Begin typing your search above and press return to search.

అటు యూరో, ఇటు కోపా.. ఒకే రోజు ఫైనల్స్.. ఫుట్ బాల్ లో పండుగే

ఫిఫా ప్రపంచ కప్ తర్వాత ఫుట్ బాల్ లో అత్యంత ఆదరణ పొందినవి యూరో, కోపా అమెరికా కప్ లు. యూరో కప్ లో కేవలం యూరప్ దేశాలు ఆడతాయి.

By:  Tupaki Desk   |   11 July 2024 7:56 AM GMT
అటు యూరో, ఇటు కోపా.. ఒకే రోజు ఫైనల్స్.. ఫుట్ బాల్ లో పండుగే
X

ప్రపంచంలో మోస్ట్ పాపులర్ గేమ్.. ఫుట్ బాల్. అయితే, ఇది దక్షిణ అమెరికా, యూరప్ లోనే ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఆసియాలో ప్రభావం తక్కువే. కానీ, ప్రేక్షకాదరణకు మాత్రం ఢోకా లేదు. కాకపోతే.. నాలుగేళ్లకోసారి వచ్చే ఫిఫా ప్రపంచకప్ సందర్భంగా ఈ విషయం నిరూపితం అవుతుంటుంది. అంతెందుకు..? భారత్ లోనే ఫిఫా ప్రపంచ కప్ ను అత్యధికులు చూస్తూ ఉంటారు.

ఫిఫా ప్రపంచ కప్ తర్వాత ఫుట్ బాల్ లో అత్యంత ఆదరణ పొందినవి యూరో, కోపా అమెరికా కప్ లు. యూరో కప్ లో కేవలం యూరప్ దేశాలు ఆడతాయి. కోపా అమెరికాలో ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలకు చెందిన దేశాలు ఆడతాయి. కాగా, ఈ రెండు కప్ లు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఒకేసారి ముగింపునకు వచ్చాయి. గత నెలలో ఆ రెండు టోర్నీలు మొదలయ్యాయి. కోపా అమెరికా సెమీస్‌ లో కొలంబియా బుధవారం ఉరుగ్వేపై 1-0 తేడాతో విజయం సాధించింది. కొలంబియా ఆటగాడు జెఫెర్సన్ లెర్మా 39వ నిమిషంలోనే గోల్‌ కొట్టి తన జట్టును ముందుకుతీసుకొచ్చాడు. అయితే, హాఫ్ టైమ్ అనంతరం కొలంబియా కేవలం 10 మందితోనే ఆడాల్సి వచ్చింది.

డిఫెండర్ డానియల్ మునోజ్‌ కు రెండోసారి యెల్లో కార్డ్‌, ఒక రెడ్‌ కార్డు రావడంతో బయటకు వెళ్లాల్సి వచ్చింది. అయినా, కొలంబియా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఉరుగ్వేపై నెగ్గింది. ఈ నెల 15న అర్జెంటీనాతో ఫైనల్లో కొలంబియా తలపడనుంది. ఇక యూరో కప్‌ లో మొదట స్పెయిన్ ఫైనల్‌ బెర్తను ఖాయం చేసుకుంది. బుధవారం నెదర్లాండ్స్‌ ను సెమీస్‌లో 2-1 తేడాతో ఓడించిన ఇంగ్లాండ్‌ ఫైనల్ కు వచ్చింది. నెదర్లాండ్స్‌ 7వ నిమిషంలోనే గోల్‌ కొట్టి ఆధిక్యంలోకి వచ్చింది. కానీ, ఇంగ్లాండ్‌ 18వ నిమిషంలోనే మాజీ కెప్టెన్ హ్యారీ కేన్‌ కొట్టిన గోల్‌ తో 1-1 చేసింది. కాసేపట్లో మ్యాచ్ ముగుస్తుందనగా.. ఇంగ్లాండ్ ఆటగాడు ఓలీ వాట్కిన్స్‌ 90వ నిమిషంలో అద్భుత గోల్‌ చేశాడు. ఈ నెల 15న స్పెయిన్‌- ఇంగ్లాండ్‌ యూరో కప్‌ కోసం ఢీకొంటాయి.

ఆ మేటి జట్లు లేకుండానే..

ప్రపంచ ఫుట్ బాల్ లో మేటి జట్లు ఫ్రాన్స్, జర్మనీ (యూరప్), బ్రెజిల్ (దక్షిణ అమెరికా). 2022 ప్రపంచ కప్ ఫైనల్ చేరిన ఫ్రాన్స్.. ఈసారి యూరో కప్ లో తుది సమరానికి రాలేకపోయింది. సెమీస్ లో స్పెయిన్ చేతిలో 2-1తో ఓడింది. జర్మనీ సెమీస్ కు కూడా రాలేకపోయింది. మరోవైపు కోపా కప్ లో బ్రెజిల్ సైతం ఫైనల్ కు రాలేదు. కోపా అమెరికా కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో తొమ్మిదిసార్లు చాంపియన్‌ బ్రెజిల్‌. క్వార్టర్‌ ఫైనల్లో ఉరుగ్వే 4–2తో బ్రెజిల్‌ ను ఓడించింది. అయితే, 2022 ప్రపంచ కప్ చాంపియన్ అర్జెంటీనా మాత్రం ఫైనల్ చేరింది. ఈ నెల 15న కొలంబియాతో తలపడుతుంది. కాగా, ప్రపంచ ఫుట్ బాల్ లో ప్రపంచ కప్ తర్వాత అత్యంత ఆదరణ పొందిన యూరో, కోపా కప్ ల ఫైనల్స్ ఒకే రోజు జరుగుతుండడం అభిమానులకు కనుల పండుగే కానుంది.