Begin typing your search above and press return to search.

ప్రపంచ కప్ పోయినా.. భారతీయుల క్రీడా స్ఫూర్తి సూపర్

అందులోనూ ప్రపంచ కప్ ఫైనల్లో మనల్ని ఓడించిన జట్టుతోనే..? ఈ లెక్కన చూస్తే గురువారం విశాఖపట్టణంలో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టి20కి ఆదరణ తక్కువగా ఉండాలి.

By:  Tupaki Desk   |   24 Nov 2023 11:12 AM GMT
ప్రపంచ కప్ పోయినా.. భారతీయుల క్రీడా స్ఫూర్తి సూపర్
X

సరిగ్గా నాలుగు రోజులు కూడా కాలేదు.. ప్రతిష్ఠాత్మక ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమిపాలై.. అదికూడా వరుసగా పది విజయాలు సాధించిన తర్వాత ఎదురైన పరాజయం.. గెలుపు ఖాయం, కప్ మనదే అనుకుంటున్న స్థితిలో ఎదురైన ఓటమి.. ఇంతలోనే టి20 మ్యాచ్. అందులోనూ ప్రపంచ కప్ ఫైనల్లో మనల్ని ఓడించిన జట్టుతోనే..? ఈ లెక్కన చూస్తే గురువారం విశాఖపట్టణంలో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టి20కి ఆదరణ తక్కువగా ఉండాలి. వరల్డ్ కప్ కోల్పోయిన నిరాశతో అభిమానుల వ్యూయర్ షిప్ తగ్గాలి. కానీ, దీనికి భిన్నంగా జరిగింది.

స్టేడియం కిక్కిరిసింది..

విశాఖపట్టణం వంటి నగరంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు తక్కువే. అయితే, ఇక్కడి స్టేడియం ఏమీ తీసిపారేయదగినది కాదు. కాకపోతే, విశాఖ ద్వితీయ శ్రేణి నగరం. ఇలాంటిచోట స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ లకు ప్రేక్షకుల ఆదరణ తక్కువగానే ఉంటుంది. కానీ, గురువారం మైదానం కిక్కిరిసింది. వాస్తవానికి ప్రపంచ కప్ జరిగిన నాలుగు రోజులకే నిర్వహించిన ఈ మ్యాచ్ లో అభిమానుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. దాదాపు 99శాతం తెలుగు వారే కనిపించారంటే అతిశయోక్తి కాదేమో..? వారందరి ఉత్సాహం చూసే.. కెప్టెన్ సూర్యకుమార్ చెలరేగి ఆడాడా? అనిపిస్తోంది కూడా.

వ్యూయర్ షిప్ అదిరింది..

మొన్నటివరకు 45 రోజుల పాటు సాగిన వన్డే ప్రపంచ కప్ ను డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ ప్రసారం చేసింది. జియోతో పోటీ నేపథ్యంలో ఉచితంగా ప్రపంచ కప్ మ్యాచ్ లను అందించింది. కానీ, అన్ని మ్యాచ్ లకూ వ్యూయర్ షిప్ భారీగా రాలేదు. మరీ ముఖ్యంగా లీగ్ దశలో సగం మ్యాచ్ లకు. అయితే, కప్ లో మ్యాచ్ లు పెరిగిన కొద్దీ వ్యూయర్ షిప్ పెరిగింది. చివరకు భారత్ – ఆస్ట్రేలియా తలపడిన ఫైనల్ మ్యాచ్ ను ఏకంగా 5 కోట్ల మంది చూశారు. ఇది గరిష్ఠం అనుకున్నారు. దీనినిమించి గురువారం నాటి ఆస్ట్రేలియా-భారత్ టి20కి ఆదరణ దక్కింది. ఈ మ్యాచ్ ను కూడా 5 కోట్ల మంది చూడడం విశేషం. ఆదివారం సెలవు రోజు జరిగిన ప్రపంచ కప్ ను ఎంతమందైతే చూశారో.. గురువారం పనిదినాన అంతేమంది చూడడం విశేషమే మరి..

ఇది కదా.. క్రీడా స్ఫూర్తి

క్రికెట్ ను చూసేవారిని మూడు రకాలుగా అభివర్ణించవచ్చు. స్కోరు ఎంతో తెలుసుకుని సరిపెట్టేవార...గెలుపు ఓటములను పట్టించుకునేవారు.. ఈ రెండు వర్గాల వారు భారత్ గెలుస్తుందంటేనో, ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నీలు ఉంటేనే మ్యాచ్ లు చూస్తారు. ఇక ఫలితాన్ని విశ్లేషించేవారు.. మూడో రకం వారు వీరాభిమానులు. మ్యాచ్ ల గణాంకాలను నోటితో చెప్పేస్తారు. ఇలాంటివారు ఎప్పుడు మ్యాచ్ జరిగినా చూస్తారు. కానీ, మిగతా రెండు వర్గాలు మాత్రం అడపాదడపా చూసేవారు. గురువారం నాటి మ్యాచ్ వ్యూయర్ షిప్ ను పరిశీలిస్తే వీరందరూ చూసినట్లు స్పష్టమవుతోంది. దీనినే నిజమైన క్రీడా స్ఫూర్తి అని అంటారు.