రోహిత్ పై పాక్ మాజీల ప్రశంసలు పీక్స్!
అవును... తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ వసీం అక్రం, షోయబ్ మాలిక్ లు రోహిత్ శర్మపై ప్రశంసల జల్లులు కురిపించారు.
By: Tupaki Desk | 15 Nov 2023 2:45 AM GMTఈ వరల్డ్ కప్ లో టీం ఇండియా సూపర్ ఫెర్మార్మెన్స్ తో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్ లలోనూ గెలిచి అద్భుత ప్రదర్శన ఇచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ భారత క్రికెటర్లు ఆకట్టుకున్నారు. ఈ సమయంలో మరిముఖ్యంగా ఇక తనదైన వ్యూహాలతో జట్టును విజయాల బాటలో నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు రోహిత్ శర్మ.
ఈ వరల్డ్ కప్ లో టీం ఇండియా ఫెర్మార్మెన్స్, ఒక బ్యాట్స్ మెన్ గా రోహిత్ శర్మ ఫెర్మార్మెన్స్ తో పాటు కెప్టెన్ గా హిట్ మ్యాన్ తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న వ్యూహాలు మరింత చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. దీంతో రోహిత్ శర్మపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో పాక్ దిగ్గజాలు వసీం అక్రం, షోయబ్ మాలిక్ కూడా టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ను పొగడ్తల్లో ముంచెత్తారు.
అవును... తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ వసీం అక్రం, షోయబ్ మాలిక్ లు రోహిత్ శర్మపై ప్రశంసల జల్లులు కురిపించారు. ఇందులో భాగంగా... ప్రపంచ క్రికెట్ లో ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు ఉన్నారని.. అయితే రోహిత్ శర్మ వారందరికంటే ప్రత్యేకమని ప్రశంసించారు.
ఈ సందర్భంగా విశ్లేషించిన వసీం అక్రం... ఇంటర్నేషనల్ క్రికెట్ లో రోహిత్ శర్మ లాంటి ఆటగాడు మరొకరు లేరు. విరాట్ కోహ్లీ, జోరూట్, కేన్ విలియమ్సన్, బాబర్ అజాం గురించి మనం అందరం మాట్లాడుతుంటాం కానీ.. వారందరికంటే రోహిత్ ప్రత్యేకమైన ఆటగాడు. ప్రత్యర్థి ఎవరైనా కానీ.. ఎలాంటి బౌలింగ్ దాడైనా కానీ.. వారిని దీటుగా ఎదుర్కొంటాడు అని అన్నాడు.
ఇదే సమయంలో... కోహ్లీ, రూట్, కేన్, బాబర్ లాంటి వాళ్లు ముగ్గురు నుంచి నలుగురు బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటారేమో.. కానీ రోహిత్ మాత్రం ఐదుగురి బౌలర్లను దంచికొడతాడు అని షోయబ్ మాలిక్ వివరించాడు. అదేవిధంగా... జట్టుకు మంచి ఆరంభాలు ఇచ్చేందుకు ప్రయత్నించడమే రోహిత్ ఆలోచనా విధానం అని, ఇది బౌలర్ల మైండ్ సెట్ ను కూడా మార్చేస్తుందని మాలిక్ ప్రశంసించాడు.
కాగా... బుధవారం జరగబోయే ఫస్ట్ సెమీ ఫైనల్ లో టీం ఇండియా సెమీస్ లో న్యూజిలాండ్ తో తలపడనున్న సంగతి తెలిసిందే. దీంతో... గత ప్రపంచకప్ లో ఓటమికి ప్రతికారం తీర్చుకుని ఫైనల్ లోకి దూసుకెళ్లాలని టీం ఇండియా అభిమానులు ఆశిస్తున్నారు. జరుగుతుందని నమ్ముతున్నారు!