Begin typing your search above and press return to search.

భారత్ తో మ్యాచ్..పాక్ కు బిగ్ షాక్.. 2017 ఫైనల్ సెంచరీ హీరో మిస్

2017 చాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యచ్ లో భారత్ చేతిలో దారుణంగా ఓడిన పాకిస్థాన్.. ఫైనల్లో మాత్రం మన జట్టును కంగుతినిపించింది. దీనికి కారణం.. పాక్ ఓపెనర్ ఫఖర్ జమాన్.

By:  Tupaki Desk   |   20 Feb 2025 7:18 AM GMT
భారత్ తో మ్యాచ్..పాక్ కు బిగ్ షాక్.. 2017 ఫైనల్ సెంచరీ హీరో మిస్
X

ఎన్నో సంవత్సరాల తర్వాత స్వదేశంలో ఓ ఐసీసీ టోర్నీ నిర్వహిస్తున్న ఆనందం పాకిస్థాన్ కు ఆవిరవుతోంది.. బుధవారం లాహోర్ లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో పరాభవం ఎదుర్కొన్న పాక్ కు రెండో మ్యాచ్ కు ముందే గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఆదివారం భారత్ తో దాయాది మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కు తటస్థ వేదిక దుబాయ్ ఆతిథ్యం ఇవ్వనుంది. పాక్ అసలే క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటే ఇప్పుడు పెద్ద గాయమే తగిలింది.

2017 చాంపియన్స్ ట్రోఫీ విజేత పాకిస్థాన్. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ టోర్నీ జరుగుతోంది. అంటే డిఫెండింగ్ చాంపియన్ ప్లస్ ఆతిథ్య దేశం కూడా. టైటిల్ నిలబెట్టుకోవడంతో పాటు సొంతగడ్డపై పరువు పోకుండా చూసుకోవడమూ ముఖ్యమే. లేదంటే తమ జట్టు విషయంలో పాకిస్థాన్ అభిమానుల స్పందన తీవ్రంగా ఉంటుంది.

2017 చాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యచ్ లో భారత్ చేతిలో దారుణంగా ఓడిన పాకిస్థాన్.. ఫైనల్లో మాత్రం మన జట్టును కంగుతినిపించింది. దీనికి కారణం.. పాక్ ఓపెనర్ ఫఖర్ జమాన్. టాస్ గెలిచి మరీ భారత్ బ్యాటింగ్ అప్పగించగా దీనిని సద్వినియోగం చేసుకున్న దాయాది భారీ స్కోరు సాధించింది. ముఖ్యంగా జమాన్ 12 ఫోర్లు, 3 సిక్స్ లతో 106 బంతుల్లో 114 పరుగులు సాధించాడు. మిగతా ఆటగాళ్లూ తలో చేయి వేయడంతో పాక్ 338 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆపై పేసర్ మొహమ్మద్ ఆమిర్ (3/16) చెలరేగడంతో టీమ్ ఇండియాను కేవలం 158 పరుగులకే ఆలౌట్ చేసి టైటిల్ కొట్టేసింది.

జమాన్ ఆ తర్వాత వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టిన తొలి పాకిస్థానీ బ్యాటర్ గా రికార్డులెక్కాడు. ఇప్పుడు కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. అయితే, అనూహ్యంగా గాయపడడంతో భారత్ తో మ్యాచ్ కు దూరమయ్యాడు.

న్యూజిలాండ్ తో మ్యాచ్ లో కండరాలు పట్టేయడంతో జమాన్ ఓపెనింగ్ కు రాలేదు. నాలుగో స్థానంలో ఆడాడు. ఇప్పుడు వైద్యులు పరీక్షించగా అతడికి విశ్రాంతి అవసరం అని తేలింది. దీంతో దుబాయ్ లో మ్యాచ్ కు వెళ్లడం లేదు. జమాన్ స్థానంలో ఓపెనర్ ఇమాముల్ హక్ ను ఆడించనున్నారని తెలుస్తోంది.

జమాన్ దూరం కావడం పాక్ కు చాలా దెబ్బనే. ఎందుకంటే పాక్ బ్యాటింగ్ అసలే బలహీనం. పైగా ఒక మ్యాచ్ ఓడింది. తర్వాతి మ్యాచ్ భారత్ తో దుబాయ్ లో. ఇందులోనూ ఓడితే టోర్నీ నంచి ఔట్. చివరగా బంగ్లాదేశ్ తో మ్యాచ్. అసలే ఇటీవల ఆ జట్టుకు టెస్టు సిరీస్ కోల్పోయింది పాక్. ఇంత ఒత్తిడిలో భారత్ తో మ్యాచ్ ఎలా ఆడుతుందో చూడాలి.

కొసమెరుపు: 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో జమాన్ ను బుమ్రా ఔట్ చేశాడు. కానీ, అది నో బాల్. లైఫ్ ను సద్వినియోగం చేసుకున్న జమాన్ సెంచరీ కొట్టాడు. దీంతో బుమ్రాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆ ఇద్దరూ మ్యాచ్ లో లేరు.