Begin typing your search above and press return to search.

మొన్న రనౌట్..నిన్న ఎల్బీడబ్ల్యూ..టి20 వరల్డ్ కప్ లో భారత్ పై రగడ?

ఈ ప్రపంచ కప్ లో అంపైరింగ్ విషయంలో భారత్ రెండోసారి చర్చనీయాంశం అయింది.

By:  Tupaki Desk   |   14 Oct 2024 10:36 AM GMT
మొన్న రనౌట్..నిన్న ఎల్బీడబ్ల్యూ..టి20 వరల్డ్ కప్ లో భారత్ పై రగడ?
X

మహిళల టి20 ప్రపంచ కప్ లో రికార్డుల మాటేమో కానీ.. రగడకు మాత్రం తక్కువ లేదు. అయితే, అది మొత్తంగా అన్ని జట్లకూ కాదు.. వరుసగా రెండుసార్లు ఇందులో భారత మహిళలే ఉన్నారు. దీంతో మనకే ఎందుకిలా అనే చర్చ మొదలైంది. అందులోనూ భారత్ ఈ ప్రపంచ కప్ లీగ్ దశలో రెండో మ్యాచ్ లో ఓడింది. దీంతో గ్రూప్ దశలోనే నిష్క్రమించే ప్రమాదంలో పడింది. సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే మన చిరకా ప్రత్యర్థి పాకిస్థాన్ చివరి లీగ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ను ఓడించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, ఈ ప్రపంచ కప్ లో అంపైరింగ్ విషయంలో భారత్ రెండోసారి చర్చనీయాంశం అయింది.

ఆసీస్ పై ఆ నిర్ణయం..

ఆదివారం ఆస్ట్రేలియాతో భారత్ కీలకమైన లీగ్‌ మ్యాచ్‌ ఆడింది. ఇందులో కేవలం 9 పరుగుల తేడాతో ఓడింది. అయితే, ఓ ఎల్బీడబ్ల్యూపై మూడో అంపైర్‌ తీసుకున్న నిర్ణయం వివాదం రేపుతోంది. మన జట్టు ఓటమికి ఇదో కారణమని అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఈ మ్యాచ్ లో మొదట ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసింది. దీప్తిశర్మ వేసిన 17వ ఓవర్‌ రెండో బంతిని ఎడమచేతివాటం బ్యాటర్ లిట్చ్‌ ఫీల్డ్ ఆడింది.

ఆఫ్‌ వికెట్‌ వైపు వచ్చిన బంతిని లిట్చ్ ఫీల్డ్ స్విచ్‌ షాట్ కొట్టాలని చూసింది. కానీ, ఆమె విఫలం కావడంతో బౌలర్‌ తో పాటు ఫీల్డర్లు ఎల్బీ కోసం అప్పీల్ చేశారు. ఫీల్డ్‌ అంపైర్ ఔట్‌ ఇచ్చినా.. లిట్చ్‌ ఫీల్డ్‌ డీఆర్‌ఎస్‌ అడిగింది. బంతి ఔట్‌ సైడ్ లెగ్‌ గా చూపించడంతో థర్డ్ అంపైర్‌ నాటౌట్‌ ప్రకటించారు.

ఓడింది 9 పరుగులు.. ఆమె చేసింది 10

లిట్చ్ ఫీల్డ్ రివ్యూ కోరేప్పటికి ఐదు పరుగులే చేసింది. తర్వాత ఇన్నింగ్స్‌ చివరిదాక ఆడి 9 బంతుల్లో 15 పరుగులు చేసింది. 20వ ఓవర్‌ ఆఖరి బంతికి సిక్స్‌ బాదింది. ఇక నిబంధన ప్రకారం అయితే.. బ్యాటర్‌ బంతి పడకముందే ఎడమ చేతివాటం నుంచి కుడికి మారినప్పుడు ‘ఔట్ సైడ్‌ లెగ్‌’ అనేందుకు అవకాశమే లేదనేది క్రికెట్ నిపుణుల మాట. ఇలాగైతే లిట్చ్ ఫీల్డ్ ఔట్. కానీ, థర్డ్ అంపైర్ వేరే విధంగా భావించి నాటౌట్ ఇచ్చారు. ఈ నిర్ణయంతో భారత క్రికెటర్లు స్మృతీ మంధాన, షఫాలీ వర్మ, దీప్తి శర్మ తీవ్ర నిరాశ చెందారు. లిట్చ్‌ ఫీల్డ్‌ త్వరగా ఔటైతే.. ఆస్ట్రేలియా స్కోరు 140 దాటేది కాదనేది అభిమానుల అంచనా. అయితే, లిట్చ్ ఫీల్డ్ చేసిన 15 పరుగులకు తోడు ఆసీస్ 151 పరుగులు కొట్టగా.. భారత్‌ 142 పరుగులకే పరిమితమైంది.

న్యూజిలాండ్ తో రనౌట్..

మహిళల టి20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో భారత్ న్యూజిలాండ్ తో ఆడింది. ప్రత్యర్థి ఇన్నింగ్స్ లో బ్యాటర్ అమేలియా రనౌటైనా అంపైర్లు నాటౌట్ గా ప్రకటించడం వివాదానికి దారితీసింది. 14వ ఓవర్ చివరి బంతిని అమేలియా ఎక్స్ ట్రా కవర్స్ వైపు పంపి సింగిల్ తీసింది. స్వ్కేర్ లెగ్ అంపైర్ బంతి పూర్తయిందన్న ఉద్దేశంతో షూ లేస్ కట్టుకుంటూ కనిపించింది. అయితే, బ్యాటర్లు అమేలియా, సోఫీ రెండో పరుగు కోసం ప్రయత్నించారు. హర్మన్ నుంచి బంతి అందుకున్న వికెట్ కీపర్ రిచా ఘోష్ అమేలియాను రనౌట్ చేసింది. అమేలియా కూడా ఔట్ గా భావించింది. కానీ, అంపైర్లు ఆ ఔట్ పరిగణనలోకి రాదని చెప్పారు. అంపైర్ బంతి అప్పటికే డెడ్ అయినట్లు ప్రకటించి ఆమెను వెనక్కు పిలిచింది. ఆ మ్యాచ్ లో అమేలియా పెద్ద స్కోరేమీ చేయలేదు.

కాగా, ఎల్బీడబ్ల్యూ సమీక్ష సమయంలో మూడో అంపైర్‌ చాలా అంశాలు పరిగణించాల్సి ఉంటుందని.. ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో తీసుకున్న నిర్ణయం సరైనదే అయితే.. తప్పకుండా నిబంధనల్లో మార్పులు చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. బ్యాటర్ రివర్స్‌ స్వీప్‌ చేసినప్పుడు లెగ్‌సైడ్ వైడ్‌ లేదా ఔట్ సైడ్‌ లెగ్ అనేదే ఉత్పన్నం కాదని పేర్కొంటున్నారు. బ్యాటర్ స్టాండ్‌ ను మార్చుకున్నప్పుడు ఇలాంటి నిబంధన వర్తించదని పేర్కొంటున్నారు. దీనిపై ఐసీసీ దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.