‘సిక్సర్’ పిడుగులు.. టి20లో ఆడిన తొలి బంతికే.. వీరిలో మనోడూ ఉన్నాడు
అంతర్జాతీయ టీ20ల్లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్ కొట్టిన రెండో భారత బ్యాటర్ రమణ్‌దీప్ సింగ్.
By: Tupaki Desk | 14 Nov 2024 3:30 PM GMTదక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ ప్రారంభానికి ముందు టీమ్ ఇండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఇద్దరు ఆటగాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాడు., మీకోసం రెండు సూపర్ రెసిపీలను తీసుకొచ్చానని తెలిపాడు. వీరిలో ఒకరేమో అద్భుతమైన ఫాస్ట్ బౌలర్. మరొకరేమో సూపర్ బ్యాటర్ అని వివరించాడు. ఫాస్ట్ బౌలర్ కు ఉండే బలం.. తెలివి రెండూ మనోడిలో ఉన్నాయని.. అతడే వైశాఖ్ విజయ్ కుమార్ అని అన్నాడు. రెండో రెసిపీకి కూడా ఎంతో ధైర్యం ఉంది. ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. ఎప్పుడూ ఉత్సాహం ఉంటుంది. ఫుట్ వర్క్ మసాలా అద్భుతం. రుచికరమైన చట్నీ లాంటి ఏకాగ్రత, పసందైన పొడులుగా షాట్లు కొట్టే టైమింగ్ అతడి సొంతం. అతడి పేరే రమణ్ దీప్ సింగ్ అని కొనియాడాడు. వీరిద్దరినీ పరిచయం చేస్తానని చెప్పినా ఒక్కరినే పరిచయం చేశాడు.
వస్తూనే మెరిశాడు..
పంజాబ్ కు చెందిన రమణ్ దీప్ సింగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అదరగొట్టాడు. అయితే, దక్షిణాఫ్రికాపై తొలి రెండు టి20ల్లో ఆడే చాన్స్ రాలేదు. పేసర్ అవేశ్ ఖాన్ వైఫల్యంతో పాటు బ్యాటింగ్ డెప్త్ కోసం రమణ్ దీప్ ను మూడో మ్యాచ్ లో ఆడించారు. అయితే, ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ దూకుడు చూపినా మరో ఎండ్ లో హిట్టర్లు హార్దిక్ పాండ్యా (18), రింకూ సింగ్ (13 బంతుల్లో 8) రాణించలేకపోయారు. ఓ దశలో స్కోరు 200 దాటడం కష్టమేననిపించింది. కానీ, రింకూ ఔటయ్యాక వచ్చిన రమణ్ దీప్ తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్ గా మలిచాడు. భారత ఇన్నింగ్స్ 18వ ఓవర్ లో సిమోలేన్ యార్కర్ లెంగ్త్ లో వేసిన బంతిని స్టాండ్స్ లోకి పంపాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్ కొట్టిన రెండో భారత బ్యాటర్ రమణ్‌దీప్ సింగ్. ఇలాంటి ప్రత్యేకతను సొంతం చేసుకున్నవారు మొత్తం ఎనిమిది మంది ఉండగా.. ఇందులో నలుగురు వెస్టిండీస్ ఆటగాళ్లే కావడం కొసమెరుపు.
వెస్టిండీస్ ఆటగాళ్లు జెరోమ్ టేలర్, జేవియర్ మార్షల్, ఆల్ రౌండర్ కీరన్ పోలార్డ్ 2008లో, టినో బెస్ట్ 2013లో తొలి బంతినే సిక్సులుగా మలిచారు. 2017లో దక్షిణాఫ్రికా ఆటగాడు మంగలీసో మోసెల్, 2007లో భారత్ పై పాకిస్థాన్ బ్యాటర్ తొలి బంతికే సిక్స్ కొట్టాడు.
కొసమెరుపు: రమణ్ దీప్ గురించి అద్భుతంగా చెప్పిన సూర్య.. అతడు తొలి బంతికే సిక్స్ కొట్టేసరికి స్టాండ్స్ లో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అన్నట్లు సూర్య కుమార్‌యాదవ్ కూడా 2021లో ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్ కొట్టాడు.