Begin typing your search above and press return to search.

పంజాబ్ ని మడతపెట్టిన 17వ ఓవర్... లఖ్ నవూ బోణి!

లఖ్‌ నవూ బౌలర్లలో తొలి మ్యాచ్ ఆడుతున్న మయాంక్‌ యాదవ్‌ (3/27) అదరగొట్టగా.. మోసిన్ ఖాన్ కీలక సమయంలో రెండు వికెట్లు పడగొట్టాడు.

By:  Tupaki Desk   |   31 March 2024 4:11 AM GMT
పంజాబ్   ని మడతపెట్టిన  17వ ఓవర్... లఖ్  నవూ బోణి!
X

ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా 11వ మ్యాచ్ శనివారం లఖ్ నవూ – పంజాబ్ మధ్య జరిగింది. రెండు టీంలకూ అత్యంత ప్రాముఖ్యమైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లఖ్ నవూ... బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో లఖ్ నవూ కు కేఎల్ రాహుల్ బదులుగా నికోలస్ పూరన్ కెప్టెన్సీ బాధ్యతలు చూసుకున్నాడు. ఈ క్రమంలో ఈ మ్యాచ్ ఆంద్యంతం ఎలా జరిగింది.. ఈ మ్యాచ్ లోని మలుపులు, మెరుపులు ఎప్పుడు ఎలా జరిగాయి అనేది ఇప్పుడు చూద్దాం...!

స్లోగా మొదలుపెట్టిన లఖ్ నవూ!:

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లఖ్ నవూ తరుపున డికాక్, కేఎల్ రాహుల్ లో బ్యాటింగ్ కు దిగారు. ఈ సమయంలో స్లోగా స్టార్ట్ అయినట్లు కనిపించిన ఈ ఇన్నింగ్స్ లో.. మొదటి ఓవర్ 5, రెండో ఓవర్ 7 పరుగులు మాత్రమే వచ్చాయి. ఈ సమయంలో 3వ ఓవర్లో డికాక్ ఫోరు, సిక్స్ బాదాడు. దీంతో మూడు ఓవర్లకు లఖ్ నవూ స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా 23 పరుగులకు చేరింది.

తొలి వైకెట్ కోల్పోయిన లఖ్ నవూ!:

కాస్త స్లోగా మొదలైన లఖ్ నవూ ఇన్నింగ్స్ లో తొలి వికెట్ పడింది. ఇందులో భాగంగా అర్ష్ దీప్ వేసిన నాలుగో ఓవర్ లో బెయిర్ స్టో కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇదే ఓవర్ లో సిక్స్, ఫోరు కొట్టి ఔటయ్యాడు. దీంతో 4 ఓవర్లు ముగిసే సరికి లక్ నవూ స్కోరు ఒక వికెట్ నష్టానికి 35 పరుగులకు చేరింది.

రెండో వికెట్ కోల్పోయిన లఖ్ నవూ!:

సాం కరన్ వేసిన ఆరో ఓవర్ తొలిబంతికి.. పడిక్కల్ (9) ఔటయ్యాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి లఖ్ నవూ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 54 పరుగులకు చేరింది.

మూడో వికెట్ డౌన్... మార్కస్ క్లీన్ బౌల్డ్!:

రాహుల్ చాహర్ వేసిన తొమ్మిదో ఓవర్ లో వరుసగా రెండు బంతులనూ స్టాండ్స్ లోకి పంపిన మార్కస్.. తర్వాత బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరోపక్క డికాక్ తనపని తాను చేసుకుంటూ పోతున్నాడు. దీంతో... 9 ఓవర్లు ముగిసే సరికి లఖ్ నవూ స్కోరు 80 పరుగులకు చేరింది. ఈ సమయంలో డికాక్ (35) నిలకడగా ఆడుతుండగా.. ఈ మ్యాచ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న నికోలస్ పూరన్ బ్యాటింగ్ కు దిగాడు.

హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఔట్ అయిన డీకాక్!:

లఖ్ నవూ ఇన్నింగ్స్ లో స్థిరమైన బ్యాటింగ్ చేసిన డీకాక్... 54 (38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు) పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. ఇందులో భాగంగా... అర్ష్‌ దీప్‌ సింగ్ వేసిన 13.1 ఓవర్‌ లో వికెట్ కీపర్‌ జితేశ్‌ శర్మకు చిక్కాడు. దీంతో 14 ఓవర్లు ముగిసే సరికి లఖ్ నవూ స్కోరు 4 వికెట్ల నష్టానికి 136 పరుగులకు చేరుకుంది.

నికోలస్ జోరుకు రబాడా బ్రేక్...!:

మైదానంంలో అడుగుపెట్టినప్పటి నుంచీ మాంచి దూకుడు ప్రదర్శించాడు నికోలస్. ఇందులో భాగంగా రాహుల్ చాహర్ వేసిన 12వ ఓవర్లో వరుసగా 6 - 4 - 6 సాధించాడు. 14 ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. ఈ క్రమంలొ 16వ ఓవర్ లో రబాడా బౌలింగ్ లో ఔటయ్యాడు. అప్పటికి నికోలస్ వ్యక్తిగత స్కోరు 42 (21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లు). దీంతో 16 ఓవర్లకు లఖ్ నవూ స్కోరు 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.

కృనాల్ పాండ్యా దూకుడు!:

మైదానంలోకి దిగినప్పటినుంచీ దూకుడుమీదున్న కృనాల్ పాండ్యా.. హర్షల్ పటేల్ వేసిన 18 ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. దీంతో 18 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన లఖ్ నవూ స్కోరు 182కు చేరింది.

వరుసగా రెండు వికెట్లు..!:

ఒకపక్క కృనాల్ పాండ్యా దూకుడుగా ఆడుతుంటే.. మరోపక్క వరుసగా బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. ఇందులో భాగంగా... సాం కరన్ వేసిన 19వ ఓవర్లో ఆయుష్‌ బదోని (8), రవి బిష్ణోయ్‌ (0) ఔటయ్యారు. దీంతో 19 ఓవర్లు ముగిసే సరికి లఖ్ నవూ స్కోరు 7 వికెట్ల నష్టానికి 191 పరుగులుగా ఉంది.

కృనాల్ మెరుపులు.. లఖ్ నవూ భారీ స్కోరు!:

పంజాబ్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో లఖ్ నవూ ప్రారంభం స్లోగా ఉన్నప్పటికీ... ముగింపు దశకు చేరుకునే సరికి భారీ స్కోరు నమోదు చేసింది. ఇందులో భాగంగా నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. డీకాక్, నికోలస్ లతో పాటు కృనాల్ పాండ్యా 43* (22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపులు మెరిపించాడు!

టార్గెట్ 200... స్లోగానే స్టార్ట్ చేసిన పంజాబ్!:

లఖ్ నవూ నిర్ధేశించిన 200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా... శిఖర్ ధావన్, బెయిర్ స్టో లు క్రీజులోకి వచ్చారు. ఈ క్రమంలో తొలి ఓవర్ లో ఓవర్లో 5, రెండో ఓవర్ లో 11 పరుగులు సాధించింది. అనంతరం ధావన్ దూకుడు పెంచి మూడో ఓవర్ లో 2 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడంతో స్కోరు బోర్డు కాస్త పరుగులు పెట్టింది.

మరో పక్క బెయిర్ స్టో కూడా బ్యాట్ ఝులిపించడంతో పంజాబ్ స్కోరు పవర్ ప్లే ముగిసే సరికి వికెట్లేమీ నష్టపోకుండా 10పైన రన్ రేట్ తో 61 పరుగులు సాధించింది. ఆ సమయంలో ధావన్‌ (41), బెయిర్‌ స్టో (20) క్రీజులో ఉన్నారు.

శిఖర్ ధావన్ ఆఫ్ సెంచరీ:

దూకుడు మీదున్న శిఖర్ ధావన్... రవి బిష్ణోయ్ వేసిన 8 ఓవర్లో సిక్సర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోపక్క బెయిర్ స్టో కూడా దూకుడు పెంచాడు. ఇందులో భాగంగా 9 ఓవర్లో వరుసగా రెండు సిక్స్ లు కోట్టాడు. దీంతో... 10 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు వికెట్లేమీ నష్టపోకుండా 98 పరుగులు సాధించింది.

తొలి వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌:

హాఫ్ సెంచరీకి చేరువవుతున్న దశలో బెయిర్‌ స్టో... మయాంక్‌ యాదవ్‌ బౌలింగ్‌ లో భారీ షాట్‌ కు ప్రయత్నించి ఔటయ్యాడు. అప్పటికి బెయిర్ స్టో వ్యక్తిగత స్కోరు 42 (29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లు) పరుగులు. దీంతో 12 ఓవర్లకు పంజాబ్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 107.

రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్:

ఇంపాక్ట్ ప్లేయర్ గా క్రీజ్ లోకి వచ్చి దూకుడుగా ఆడిన ప్రభు సిమ్రన్ (19)... మయాంక్ యాదవ్‌ వేసిన 13.3 ఓవర్‌ లో నవీనుల్ హక్‌ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 14 ఓవర్లు ముగిసే సరిపికి పంజాబ్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 129 పరుగులు.

మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్‌!:

ఒకపక్క కెప్టెన్ శిఖర్ ధావన్ నిలకడగా ఆడుతున్న దశలో.. మరోపక్క వరుసగా వికెట్లు పడుతున్నాయి. ఇందులో భాగంగా.. మయాంక్‌ యాదవ్‌ వేసిన 16 ఓవర్‌ లో నాలుగో బంతికి జితేశ్‌ శర్మ (6) ఔటయ్యాడు. దీంతో 16 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 60 పరుగులకు చేరింది. ఫలితంగా... చివరి నాలుగు ఓవర్లలోనూ గెలవాలంటే పంజాబ్ కు ఇంకా 60 పరుగులు కావాలి.

టర్న్ చేసిన 17 ఓవర్... వరుసగా రెండు వికెట్లు!:

24 బంతుల్లో 60 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో పంజాబ్ ఉండటం.. క్రీజ్ లో 70 పరుగుల వ్యక్తిగత స్కోర్ తో శిఖర్ ధావన్ ఉండటం.. మరోపక్క సాం కరన్ క్రీజ్ లోకి రావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఈ సమయంలో ఆ ఉత్కంఠకు తెర దించాడు మోసిన్ ఖాన్.

అతడు వేసిన 17వ ఓవర్ లో రెండో బంతికే శిఖర్ ధావన్ 70 (50 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్ లు) ని ఔట్ చేశాడు. ఆ తర్వాత బంతికే సాం కరన్ (0) ని పెవిలియన్ కు పంపాడు. దీంతో... 17 ఓవర్లకు పంజాబ్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 144. అంటే... ఇంకా మిగిలిన 3 ఓవర్లలోనూ విజయానికి 56 పరుగులు అవసరం అన్నమాట.

పంజాబ్ ఓటమి ఫైనల్!:

ఈ సమయంలో కీలక బ్యాటర్లు పెవిలియన్ కు చేరడంతో... పంజాబ్ దూకుడుగా ఆడలేకపోయింది. దీంతో... చివరి ఆరు బంతుల్లో 41 పరుగులు అవసరం పడింది. దీంతో ఓవర్ మిగిలి ఉండగానే పంజాబ్ ఓటమి ఖాయమైంది. దీంతో నిర్ణీత లక్ష్యఛేదనలో పంజాబ్‌ 5 వికెట్లకు 178 పరుగులకు పరిమితమైంది.

లఖ్‌ నవూ బౌలర్లలో తొలి మ్యాచ్ ఆడుతున్న మయాంక్‌ యాదవ్‌ (3/27) అదరగొట్టగా.. మోసిన్ ఖాన్ కీలక సమయంలో రెండు వికెట్లు పడగొట్టాడు.