ఆ 'బంతి' రక్తసిక్తం.. ఫుట్ బాల్ లోనే మరణాలు అధికం ఎందుకు?
ప్రపంచంలో అత్యంత ఫాలోయింగ్ ఉన్న స్పోర్ట్స్ ఏదంటే భారతీయులు బహుశా క్రికెట్ పేరే చెబుతారేమో? కానీ, ఆ స్థానం ఫుట్ బాల్ ది.
By: Tupaki Desk | 2 Dec 2024 12:30 PM GMTప్రపంచంలో అత్యంత ఫాలోయింగ్ ఉన్న స్పోర్ట్స్ ఏదంటే భారతీయులు బహుశా క్రికెట్ పేరే చెబుతారేమో? కానీ, ఆ స్థానం ఫుట్ బాల్ ది. ఒలింపిక్స్ జరుగుతుంటే ఉద్రిక్తతలు కనిపించవు.. క్రికెట్ అంటే జెంటిల్ మెన్ గేమ్.. మ్యాచ్ ల సందర్భంగా అంతగా వాడివేడి ఉండదు.. కానీ, ఫుట్ బాల్ అంటే అలా కాదు.. లాటిన్ అమెరికా, యూరప్ ఖండాలు ఊగిపోతాయి.. ప్రాణాలు తీసేంత ఉన్మాదం.. ప్రాణాలు పెట్టేంత అభిమానం..
సెల్ఫ్ గోల్ కొట్టాడని కాల్చేశారు..
లాటిన్ అమెరికాను ఫుట్ బాల్ మెట్టినిల్లుగా చెప్పొచ్చు.. ఇక్కడ డ్రగ్స్, ఫుట్ బాల్ అత్యంత పాపులర్ అంటారు. కొలంబియా, బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ, పెరూ, ఉరుగ్వే దేశాల జట్లు ప్రపంచ ఫుట్ బాల్ లో లాటిన్ అమెరికా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇక 1994 ప్రపంచ కప్ లో కొలంబియా ఆటగాడు ఆండ్రెస్ ఎస్కోబార్ సెల్ఫ్ గోల్ కొట్టడంతో ఆ జట్టు ముందు రౌండ్ కు వెళ్లలేకపోయింది. దీంతో ఎస్కోబార్ ను తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు కాల్చివేశారు. దీనివెనుక ఉన్నది డ్రగ్ మాఫియానే అని చెబుతారు.
మెస్సీని ‘బంధించారు’
కొన్ని నెలల కిందట కోపా అమెరికా కప్ లో అర్జెంటీనా కెప్టెన్, ప్రపంచ చాంపియన్ లయోనల్ మెస్సీని అభిమానులు దాదాపు బంధించినంత పనైంది. బ్రెజిల్ తో మ్యాచ్ అనుకుంట.. తీవ్ర ఉత్కంఠతో జరగడంతో మెస్సీ గది నుంచి బయటకు రాలేకపోయాడు.
ఉద్రిక్తతలు.. ఉద్వేగాలు
ఫుట్ బాల్ మ్యాచ్ అంటే తీవ్ర ఉద్రిక్తతలు, ఉద్వేగాలు. మ్యాచ్ గెలిచినా ఓడినా అంతే. ఇక అభిమానుల సందడి చెప్పక్కర్లేదు. తమ దేశ, క్లబ్ జట్లను విపరీతంగా ఆరాధించేవారు ఏ చిన్న పొరపాటు జరిగినా అంతే తీవ్రంగా స్పందిస్తుంటారు. ఇలానే తాజాగా గినీ దేశంలో ఘర్షణలు చెలరేగి వందమందిపైగా ప్రాణాలు కోల్పోయారు. చరిత్రలో చూస్తే ఇలాంటి సంఘటనలు ఎన్నో..?
గోల్స్ తక్కువ.. గోల ఎక్కువ..
ఫుట్ బాల్ ప్రపంచ చాంపియన్ అర్జెంటీనాను అనామక జట్టు అయినా ఓడించగలదు. ఆటగాళ్ల సామర్థ్యం, పోటీ అంతగా ఉంటుంది. చాలా మ్యాచ్ లలో గోల్స్ కూడా నమోదు కాకుండా డ్రా అవుతాయి. ఒకవేళ చేసిన గోల్స్ కూడా తక్కువే ఉంటాయి. ఇక హూలిగన్లు అని వీరాభిమానులు ఉంటారు. వీరిని ఫుట్ బాల్ పోకిరీలుగా చెప్పొచ్చు. తమ జట్టు గెలిచిందంటే సరే.. ఓడితే మాత్రం వీరి ఆగడాలు చెప్పలేం.