టీమ్ ఇండియాకు దు'భాయ్'.. అన్ని మ్యాచ్ లూ అక్కడేనా? ఇంగ్లండ్ అక్రోశం
అలాంటి జట్టులో ఒకప్పుడు భాగమైన వారు కూడా ఇప్పుడు భారత జట్టు పాకిస్థాన్ లో పర్యటించకపోవడంపై విమర్శలు చేస్తున్నారు.
By: Tupaki Desk | 25 Feb 2025 6:30 PM GMTమొన్నటివరకు పాకిస్థాన్ వెళ్లాలంటే ఒకటికి పది కారణాలు చెప్పేవారు ఇంగ్లండ్ క్రికెటర్లు. ఆ దేశ క్రికెట్ బోర్డు ఒప్పుకొన్నా.. భద్రతా కారణాలతో తాము పాక్ లో పర్యటించలేం అని తప్పుకొనేవారు. అలాంటి జట్టులో ఒకప్పుడు భాగమైన వారు కూడా ఇప్పుడు భారత జట్టు పాకిస్థాన్ లో పర్యటించకపోవడంపై విమర్శలు చేస్తున్నారు.
చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుండగా.. భద్రతా కారణాల రీత్యా ఆ దేశానికి వెళ్లేందుకు భారత జట్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వలేదు. పాకిస్థాన్ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయగా ట్రోఫీ నిర్వహణే సందిగ్ధంలో పడింది. చివరకు తటస్థ వేదికగా దుబాయ్ ను ఎంపిక చేశారు.
కానీ, ఆస్ట్రేలియాపై భారీ స్కోరు చేసినా ఓడిపోవడంతోనో.. తదుపరి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా వంటి జట్టును ఎదుర్కొని గెలవడం కష్టం అని భావించారో ఏమో? ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైక్ అథర్టన్ ఇప్పటికే సెమీఫైనల్స్ చేరిన భారత్ పై ఏడుపు మొదలుపెట్టారు.
మరోవైపు సెమీ ఫైనల్ కూడా దుబాయ్ లోనే జరగనుంది. భారత్ ఫైనల్ చేరితే అదీ ఇక్కడే నిర్వహించనున్నారు. ఇది ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లు మైకేల్ అథర్టన్, నాసిర్ హొస్సేన్ కడుపు మంటకు కారణమైంది.
మిగతా అన్ని జట్లు పాకిస్థాన్ లోని వివిధ ప్రాంతాల్లో ఆడుతుంటే భారత్ మాత్రం దుబాయ్ లోని ఒకే మైదానంలో ఆడడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదివారికి కలిసొస్తుందని వ్యాఖ్యానించారు. ప్రయాణం చేసే అవసరం లేకపోవడం, స్టేడియంలో పరిస్థితులు కలిసివస్తాయని అథర్టన్ అంటున్నాడు.
నాజర్ హుస్సేన్ మాట్లాడుతూ ఒకే వేదికలో మ్యాచ్ లు ఆడటం కలిసొస్తుందంటున్నాడు. యూఏఈ పిచ్ లు స్పిన్ కు బాగా అనుకూలం అని భావించి టీమ్ ఇండియా ఎక్కువమంది స్పిన్నర్లను ఎంపిక చేసిందన్నాడు. ఇంగ్లాండ్, పాకిస్థాన్ ఒకరిద్దరు స్పిన్నర్లనే తీసుకున్నట్లు చెప్పాడు. అదే పాకిస్థాన్ లో ఆడే జట్లు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా తుది జట్టును ఎంచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. అన్నిటికిమించి అక్కడి వాతావరణానికి అలవాటు పడాల్సి ఉంటుందని.. కాబట్టి ఒకే వేదికలో మ్యాచ్ లు ఆడడం ప్రయోజనకరంగా వివరించాడు.
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా దుబాయ్ లో ఆడడం భారత జట్టుకు మరింత అడ్వాంటేజ్ అని అన్నాడు.