అజ్జూకు సుప్రీంలో పంచ్ మామూలుగా లేదుగా?
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ (అజ్జూ) కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాగే లీగ్ మ్యాచ్ లకు సంబంధించి అజ్జూ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకు అప్పీలు కోసం వెళ్లారు.
By: Tupaki Desk | 23 July 2023 4:25 AM GMTదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ (అజ్జూ) కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాగే లీగ్ మ్యాచ్ లకు సంబంధించి అజ్జూ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకు అప్పీలు కోసం వెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన విచారణలో అజారుద్దీన్ లాయర్ చేసిన వ్యాఖ్యపై సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. దిమ్మ తిరిగే సమాధాన్ని ఇచ్చింది. అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు గతంలో అజారుద్దీన్ అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ జట్టు ఆడేందుకు ఆయన నిరాకరించారు. తమ జట్టుకు ఆడేందుకు అవకాశం ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ నాటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్ అందుకు ససేమిరా అన్నారు. ఈ నేపథ్యంలో అతనికి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ అయ్యాయి.
ఈ నోటీసుల్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆధ్వర్యంలో ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం పిటిషన్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అజారుద్దీన్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం.. ‘‘మీరు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఇక్కడికి వచ్చారు. మీరు ధిక్కరణకు పాల్పడలేదా?’’ అని ప్రశ్నించగా.. లేదన్న సమాధాన్ని ఇచ్చారు న్యాయవాది.
దీంతో అసహనాన్ని వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం .. ‘‘అయితే గుడ్. మీరు ఇదే సమాధానాన్ని హైకోర్టుకు వెళ్లి చెప్పండి’’ అంటూ వ్యాఖ్యానించింది. దీంతో.. విషయం మరింత సీరియస్ అవుతుందన్న విషయాన్ని గుర్తించిన అజ్జూ తరఫు న్యాయవాది.. తన పిటిషన్ ను ఉపసంహరించుకోవటానికి అనుమతి ఇవ్వాలని విన్నవించుకోవటంతో.. అందుకు అంగీకరించిన ధర్మాసనం కేసు విచారణను ముగించింది. లక్ బాగుంది కాబట్టి సరిపోయింది కానీ.. సుప్రీం సీరియస్ అయితే మరిన్ని చిక్కుల్లో అజ్జూ పడేవారన్న మాట క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది.