ఐసీసీ పళ్లు లేని పులి.. ఈ మాటలన్నది ఓ బెబ్బులి
శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగకు ఒళ్లు మండింది.
By: Tupaki Desk | 15 Sep 2023 7:26 AM GMTఆసియా కప్ షెడ్యూల్ ను ఏ ముహూర్తాన నిర్ణయించారో కాని.. అంతా అస్తవ్యస్తమే. పాకిస్థాన్ ఆతిథ్యానికి భారత్ ససేమిరా.. ఆ దేశంలో పర్యటించేది లేదంటూ ప్రకటన.. సగం టోర్నీని పాక్ లో మిగతా టోర్నీని దుబాయ్ లోనా? శ్రీలంకలోనా ఎక్కడ నిర్వహించాలనే సందిగ్ధం. మధ్యలో భారత్ తమ దేశానికి రాకుంటే తామూ ప్రపంచ కప్ ను బహిష్కరిస్తామంటూ పాకిస్థాన్ బెదిరింపులు.. చివరకు వెనక్కుతగ్గి శ్రీలంకలో టోర్నీ మ్యాచ్ ల నిర్వహణకు అంగీకారం.. ఎలాగోలా సజావుగా సాగుతుందనుకుంటే వర్షాలు.
ఈ సమయంలో శ్రీలంకలో మ్యాచ్ లా?
ద్వీప దేశమైన శ్రీలంకలో వర్షా కాలం టోర్నమెంట్ నిర్వహించడం అంటే అది అనాలోచితమే. అసలు ద్వైపాక్షిక సిరీస్ లే ఉండని సమయంలో ఆసియా కప్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, ఇక్కడో విషయం కూడా గమనించాలి. ఈ సమయంలో దుబాయ్ లో అత్యంత వేడి ఉంది. దీంతో ఆటగాళ్లు తీవ్రంగా అలసిపోతారు. అసలు అక్కడ మ్యాచ్ ల నిర్వహణకు అనువైన సమయమే కాదిది. భారత్ లో ఎలాగూ అవకాశం ఉండదు. బంగ్లాదేశ్ కు ఆ స్థాయి లేదు. దీంతోనే లంకను ఎంచుకున్న సంగతి మరవకూడదు.
వాన దెబ్బకు అభిమానుల అబ్బా..?
ఆసియా కప్ లో అత్యంత ఆసక్తికర సమరం భారత్-పాకిస్థాన్ మ్యాచ్. అందులోనూ టి20ల్లో ఎదురుపడినా.. రెండు జట్లూ వన్డేల్లో తలపడక నాలుగేళ్లు దాటింది. దీంతోనే వీటి మధ్య మ్యాచ్ కు ఆసక్తి నెలకొంది. కానీ, వరుణుడు ఈ ఆశలపై నీళ్లు చల్లాడు. లీగ్ దశలో భారత్ ఇన్నింగ్స్ ముగిశాక వర్షం కురవడంతో మ్యాచ్ జరగలేదు. సరే.. రెండు జట్లూ సూపర్ -4కు చేరాయి అప్పుడైనా మ్యాచ్ మజాను ఆస్వాదిద్దాం అంటే వరుణుడి ముప్పుపై హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో బ్రాడ్ కాస్టర్లు, అడ్వర్టయిజ్ మెంట్ లు, ఓటీటీ తదితర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని సూపర్ 4లో భారత్-పాక్ మ్యాచ్ కు రిజర్వ్ డే కేటాయించారు. దీనికితగ్గట్లే వర్షం అడ్డంకి ఏర్పడి మ్యాచ్ రిజర్వ్ డేన కొనసాగింది. భారత్ విజయదుందుభి మోగించింది.
ఇది సమంజసమేనా?
ఆసియా కప్ లో అసలు షెడ్యూల్ ప్రకారం రిజర్వ్ డేనే లేదు. అప్పటికప్పుడు భారత్ –పాక్ మ్యాచ్ కు మాత్రమే రిజర్వ్ డేను కేటాయించారు. అంతేకాదు.. మిగతా ఏ మ్యాచ్ లకూ రిజర్వ్ డే లేదు. ఫైనల్ సహా.. దీన్నిబట్టే భారత్-పాక్ మ్యాచ్ కు అధిక ప్రాధాన్యం ఇచ్చారని స్పష్టమవుతోంది. క్రీడా స్ఫూర్తి ప్రకారం చూస్తే ఇది తగని పని. కానీ, ఆటను మించిన శక్తులు ప్రభావితం చేయడంతో తప్పని పరిస్థితి.
ఐసీసీ పళ్లు లేని పులి..
ఆసియా కప్‌లో పాకిస్థాన్, భారత్ మ్యాచ్ కు మాత్రమే రిజర్వ్ డే కేటాయించడంతో శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగకు ఒళ్లు మండింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పళ్లు లేని పులిలా మారిపోయిందంటూ నిప్పులు చెరిగాడు. ‘‘ఐసీసీకి ప్రొఫెషనలిజమే లేదు. అది ఓ దంతాలు లేని పులి. క్రికెట్‌ను ఐసీసీ నియంత్రించాలి కానీ వేరే దేశం కాదు. ఆసియా కప్‌లో ఒక్క మ్యాచ్ కోసం నిబంధనలు మార్చారు. ఇక ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ), ఐసీసీ ఎక్కడున్నాయి? ప్రపంచకప్‌లో భారత్- పాక్ పోరుకు ప్రత్యేక నిబంధనలు పెట్టినా, రిజర్వ్‌డే ప్రకటించినా ఆశ్చర్యం లేదు’’ అంటూ నిప్పులు చెరిగాడు.
రణతుంగ ఏడుపు భారత్ పైనే..?
అండర్ డాగ్ జట్టయిన లంకను పటిష్ఠమైనది తీర్చిదిద్ది.. ఏకంగా ప్రపంచ కప్ సాధించిపెట్టిన ఘనత రణతుంగది. కానీ, అతడు భారత్ పట్ల ఏమంత సానుకూలంగా ఉన్నట్లు కనిపించదు. తాజా ఆసియా కప్ ఉదంతంలో కూడా అతడి ఏడుపు భారత్ పైనే అని తెలుస్తోంది. ‘‘భారత్ శక్తిమంతమైన క్రికెట్ దేశం అనడంలో సందేహం లేదు. కానీ ఐసీసీ ప్రతినిధులు చక్కగా కోటు ధరించి, సమావేశాల్లో పాల్గొని వెళ్లిపోతామంటే ఎలా? ఒక్క జట్టు కోసం నిబంధనలు మార్చుకుంటూ పోతే వైఫల్యం తప్పదు. ఐసీసీ, ఏసీసీకి అధికారం మాత్రమే కావాలి. డబ్బులు అవసరమైన మాజీ క్రికెటర్లు నోరు మెదపడం లేదు’’ అంటూ అతడు వెళ్లగక్కిన ఆక్రోశం దీనినే సూచిస్తోంది.