గంభీర్ కు డేంజర్ బెల్.. ఆ టోర్నీలో ఓడితే ఇక ఇంటికే?
టీమ్ ఇండియా హెడ్ కోచ్ వంటి అతిపెద్ద బాధ్యతను కేవలం 42 ఏళ్ల వయసుకే చేపట్టిన గౌతమ్ గంభీర్ మీద ఇప్పుడు వేటు కత్తి వేలాడుతోందా..?
By: Tupaki Desk | 15 Jan 2025 2:30 AM GMTటీమ్ ఇండియా హెడ్ కోచ్ వంటి అతిపెద్ద బాధ్యతను కేవలం 42 ఏళ్ల వయసుకే చేపట్టిన గౌతమ్ గంభీర్ మీద ఇప్పుడు వేటు కత్తి వేలాడుతోందా..? ఆయన బాధ్యతలు చేపట్టిన ఏడెనిమిది నెలల్లోనే టీమ్ ఇండియా ప్రదర్శన పడిపోవడం చేటు చేయనుందా..? గంభీర్ కు ముంగిట మరొక్క అవకాశమే మిగిలి ఉందా..?
పై ప్రశ్నలన్నిటికీ బీసీసీఐ వర్గాలు ఔననే సమాధానమే ఇస్తున్నాయి. ఎంతలో ఎంత తేడా? అనే పరిస్థితి రావడమే దీనికి కారణంగా వివరిస్తున్నాయి. గంభీర్ గత ఏడాది జూలైలో హెడ్ కోచ్ గా వచ్చాడు. శ్రీలంకతో టి20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసినా.. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను కోల్పోయింది. 27 ఏళ్ల తర్వాత లంకకు వన్డే సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఇక స్వదేశంలో బంగ్లాదేశ్ లో ఆ వెంటనే జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను గెలుచుకున్నా అదేమీ పెద్ద విశేషం కాదు. న్యూజిలాండ్ తో తొలిసారిగా మూడు టెస్టుల సిరీస్ ను 0-3తో కోల్పోవడం మాత్రం పెను సంచలనం. చరిత్రలో ఎరుగని ఈ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇక్కడే గంభీర్ కు డేంజర్ బెల్స్ మోగాయి.
ఆస్ట్రేలియాలో ఐదు టెస్టుల సిరీస్ లో మొదటి మ్యాచ్ ను గెలిచి శుభారంభం చేసినా.. రెండో, నాలుగో, ఐదో టెస్టులో ఓటమితో సిరీస్ 1-3తో చేజారింది. అంతేగాక ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్తు కూడా గల్లంతయింది. ఇప్పటివరకు రెండు డబ్ల్యూటీసీ ఫైనల్స్ జరగ్గా రెండుసార్లూ టీమ్ ఇండియా అర్హత సాధించింది. గంభీర్ హయాంలో మాత్రం అది సాధ్యం కాలేదు.
మిగిలింది లాస్ట్ చాన్స్?
గంభీర్ ముంగిట ఇప్పుడు మిగిలిన ఏకైక చాన్స్ చాంపియన్స్ ట్రోఫీ. వచ్చే ఫిబ్రవరిలో మొదలై వన్డే ఫార్మాట్ లో జరిగే ఈ టోర్నీలో భారత్ దుబాయ్ వేదికగా మ్యాచ్ లు ఆడనుంది. ఇందులోనూ భారత్ విఫలమైతే ఇక గంభీర్ కు వీడ్కోలు పలకాలన్న డిమాండ్లు పెరుగుతాయి.
అంతా అతడే చేశాడా?
యువకుడైన గంభీర్ భారత క్రికెట్ సంధి దశలో హెడ్ కోచ్ అయ్యాడు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వైఫల్యాలతో రిటైర్మెంట్ బాటలో ఉండగా.. పేసర్ మొహమ్మద్ షమీ గాయంతో అసలు అందుబాటులోనే లేడు. ప్రధాన పేసర్ బుమ్రా కూడా గాయపడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో గంభీర్ ను మాత్రమే బాధ్యుడిని చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న వస్తోంది. ఒక విధంగా చూస్తే ఇది నిజమే.
గంభీర్ టర్మ్ మూడేళ్లు. వన్డే ప్రపంచ కప్ వరకు అతడు కొనసాగే వీలుంది. ఒకటీ రెండు వైఫల్యాలకు బాధ్యుడిని చేయడం తగదు. పైగా టీమ్ ఇండియా సీనియర్లు ఒక్కొక్కరుగా వైదొలుగుతున్న సమయంలో గంభీర్ వంటి వారి అవసరం చాలా ఉంది. అందుకనే అతడిని కొనసాగించాలనేదే మెజారిటీ క్రికెట్ అభిమానుల ఉద్దేశం.