ఆస్ట్రేలియాతో ఘోర పరాజయం.. సీనియర్ల పరిస్థితేంటి గంభీర్?
ప్రతిష్ఠాత్మక బోర్డర్-గావస్కర్ సిరీస్ ఓటమి కొందరు స్టార్ ఆటగాళ్లకు పీడకలగా మారింది. వీరిలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వారు.
By: Tupaki Desk | 5 Jan 2025 4:30 PM GMTసొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 0-3తో క్లీన్ స్వీప్.. ఆస్ట్రేలియా చేతిలో ఆస్ట్రేలియాతో 1-3తో ఓటమి.. ఫలితంగా బోర్డర్-గావస్కర్ ట్రోఫీనే కాదు.. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్తు కూడా చేజారింది. దీనికి ముందు.. 27 ఏళ్లలో తొలిసారిగా శ్రీలంకకు వన్డే సిరీస్ కోల్పోయింది.. ఇదీ గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా వచ్చాక పరిస్థితి. ప్రతిష్ఠాత్మక బోర్డర్-గావస్కర్ సిరీస్ ఓటమి కొందరు స్టార్ ఆటగాళ్లకు పీడకలగా మారింది. వీరిలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వారు.
ఇప్పుడేం చేస్తారు?
రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నప్పటికీ చివరి టెస్టు నుంచి అతడిని తప్పించారు. అతడు మాత్రం తాను రిటైర్ కాబోనని అంటున్నాడు. అయితే, చివరి టెస్టులో ఓటమి అనంతరం గంభీర్ మీడియాతో మాట్లాడుతూ ఆటగాళ్ల భవిష్యత్తుపై తాను మాట్లాడబోనని అన్నాడు. కోహ్లి, రోహిత్ ను ఉద్దేశించిన ప్రశ్నకు సమాధానంగా ఈ మాటన్నాడు. ఆటగాళ్ల భవిష్యత్ వారిపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. తపన, నిబద్ధత ఉంటే వారు భారత క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లడానికి చేయాల్సింది చేస్తారని చెప్పాడు. డ్రెస్సింగ్ రూమ్ ను సంతోషంగా ఉంచడానికి తాను ప్రతి ఒక్కరితో నిజాయతీగా ఉంటానని వివరించాడు.
వాళ్లకు చెప్పకుండా చెప్పేసినట్లే
రోహిత్, కోహ్లిలకు చెప్పాల్సినదంతా గంభీర్ చెప్పేసినట్లే కనిపిస్తోంది. వారి భవిష్యత్ వారిపైనే ఆధారపడి ఉంటుందని అనడం అంటే.. ‘మీరు నిర్ణయం తీసుకోవాలి’ లేదా ‘మేం నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పడం. ఒకవేళ ఇద్దరు స్టార్లు ఏ విషయమూ చెప్పకుంటే వారిని తదుపరి ఎంపిక చేయడం కష్టమే. పైగా టీమ్ ఇండియా మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడేది జూన్ 20న. అయితే, ఈలోగా ముందుగా ఈ నెలలో ఇంగ్లండ్ తో టి20, వన్డే సిరీస్ లు ఆడాల్సి ఉంది. ఫిబ్రవరిలో చాంపియన్స్ ట్రోఫీ ఉంది. వన్డేలకు రోహిత్, కోహ్లిలను ఎంపిక చేస్తారా? లేదా? చూడాలి.