టీమ్ ఇండియాను ముంచుతాడా? తేల్చుతాడా?
భారత క్రికెట్ ప్రస్తుతం సంధి దశలో ఉంది. మరీ ముఖ్యంగా టి20 ఫార్మాట్ లో.
By: Tupaki Desk | 4 Aug 2024 3:30 PM GMTభారత క్రికెట్ ప్రస్తుతం సంధి దశలో ఉంది. మరీ ముఖ్యంగా టి20 ఫార్మాట్ లో. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ తో వారి స్థానాలను భర్తీ చేయగల కొత్త ఆటగాళ్లను వెదికిపట్టుకోవడం ముఖ్యం. ఈ ముగ్గురు రెండు, మూడేళ్లకు మించి వన్డేలు, టెస్టులు కూడా ఆడే అవకాశం లేదు. జడేజాను ఇప్పటికే వన్డేలకు పక్కనపెట్టినట్లు కనిపిస్తోంది. మరోవైపు హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టాడు. ఇతడి కాంట్రాక్టు 2027 వన్డే ప్రపంచ కప్ వరకు ఉంది. అంటే దాదాపు నాలుగేళ్లు. ఈ సమయం చాలా సుదీర్ఘమైనదే కాదు.. పూర్తిగా కొత్త రక్తం వచ్చే సమయం. ఈ పరిస్థితులను గంభీర్ సంభాళించాల్సి ఉంటుంది.
మాట నెగ్గించుకున్నాడు.. మరి మైదానంలో?
గంభీర్ హెడ్ కోచ్ గా వస్తూనే జట్టు సహాయ కోచింగ్ స్టాఫ్ ను మార్చాలని పట్టుబట్టాడు. తనతో పాటు కోల్ కతా నైట్ రైడర్స్ కు పనిచేసిన అభిషేక్ నాయర్, మోర్నీ మోర్కెల్ లను టీమ్ ఇండియా కోచింగ్ స్టాఫ్ లోకి తీసుకోవడానికి గంభీర్ గట్టి ప్రయత్నమే చేసి మాట నెగ్గించుకున్నాడు. రాహుల్ ద్రవిడ్ హయాంలో అసిస్టెంట్ కోచింగ్ స్టాఫ్ గా ఉన్నవారి కంటే తనకు తగినట్లుగా పనిచేసే స్టాఫ్ ను తీసుకున్నాడు. అన్నిటికి మించి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో హార్డ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ ను టి20 కెప్టెన్ చేయడంలో గంభీర్ దే పాత్ర. మరి మైదానంలోనూ అంతే స్థాయిలో ఫలితాలు రాబడతాడా? అనేది చూడాలి. గంభీర్ హెడ్ కోచ్ గా శ్రీలంకతో తొలి టి20 సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్ లో అతడు కొన్ని ప్రయోగాలు చేశాడు. లంక బలహీనంగా ఉంది కాబట్టి.. ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. జట్టు కూర్పు విషయంలో గంభీర్ కాస్త భిన్నంగా ఆలోచిస్తున్నాడు. ఓ బ్యాటర్ గా.. బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేస్తున్నాడు. ఇవన్నీ ఏ తీరానికి చేరుస్తాయో చూడాలి.
పెద్ద జట్లనూ కొట్టేలా..
భారత్ కొన్నేళ్లుగా నిలకడగా ఆడుతోంది. ఇది కొనసాగేలా చూడడం గంభీర్ ప్రధాన బాధ్యత. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా వంటి పెద్ద జట్లను వారి గడ్డపైనే ఓడించేలా తీర్చిదిద్దాలి. మరీ ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు భారత్ టెస్టు సిరీస్ నెగ్గలేదు. దానిని గంభీర్ సాధించిపెట్టాలి. అన్ని జట్లూ అన్ని మ్యాచ్ లను గెలవలేవు. అంతేకాదు.. గంభీర్ కు హోడ్ కోచ్ గా ఇదే తొలి సిరీస్ కాబట్టి విమర్శలకు దిగడం సరికాదు. కాకపోతే ప్రయోగాలు ఎక్కువై.. అవి వికటిస్తే గంభీర్ మరో ‘గ్రెగ్ చాపెల్’గా మిగులుతాడు. దేశాన్ని విపరీతంగా ప్రేమించే గంభీర్.. మహా ముక్కుసూటి. ఇప్పటికైతే జట్టులోని అందరితో మాట్లాడుతున్నాడు. మున్ముందు ఎలా ఉంటాడో మరి?
కొసమెరుపు: గంభీర్ ఎక్కువ కాలం ప్రధాన కోచ్ గా ఉండలేడని 2007 టి20 ప్రపంచ కప్ లో చివరి ఓవర్ వేసి భారత జట్టును గెలిపించిన ఆల్ రౌండర్ జోగిందర్ శర్మ అన్నాడు. గంభీర్ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాడని.. ఒక్కోసారి ఆటగాళ్లతో ఏకీభవించకపోవచ్చని పేర్కొన్నాడు. అత్యంత నిర్మొహమాటంగా మాట్లాడే గంభీర్ నిర్ణయాలను ఆటగాళ్లు ఇష్టపడకపోవచ్చని వ్యాఖ్యానించాడు. గంభీర్.. నిబద్ధత, నిజాయతీ కలిగినవాడని కొనియాడాడు. అవతలి వ్యక్తిని కాకా పట్టే రకం కానందున పూర్తికాలం పదవిలో ఉండకపోవచ్చని పేర్కొన్నాడు.