టీమిండియాకు భారీ షాక్.. యువ ఓపెనర్ 2 మ్యాచ్ లకు దూరం?
టీమిండియా యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్ విష జర్వమైన డెంగీ బారినపడ్డాడు. దీంతో ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగే ప్రపంచ కప్ తొలి మ్యాచ్ కు అతడు అందుబాటులో ఉండడం లేదని తెలుస్తోంది.
By: Tupaki Desk | 6 Oct 2023 7:10 AM GMTప్రపంచ కప్ మొదలుకాకముందే భారత్ కు అపశకునాలు ఎదురవుతున్నాయి.. ఈశాన్య ప్రాంతంలోని గువాహటిలో ఆస్ట్రేలియా లాంటి కఠిన ప్రత్యర్థితో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడదామంటే వర్షం తుడిచిపెట్టేసింది. దక్షిణాదిన ఉన్న తిరువనంతపురంలో పసికూన నెదర్లాండ్స్ తో అయినా ఆ టాడుకుందామంటే మళ్లీ వాన ముంచేసింది. దీంతో మిగతా జట్ల తరహాలో మ్యాచ్ ల ప్రాక్టీస్ మ్యాచ్ లు లేకుండానే బరిలో దిగుతోంది. అయితే, దీనికిముందుగా ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడడం అందులో కీలక ఆటగాళ్లు రాణించడం శుభపరిణామే అని చెప్పాలి.
ఆ ఓపెనర్ అత్యంత కీలకం
రోహిత్, కోహ్లిలను మించి ఆడుతూ.. వన్డేలు, టి20లు, టెస్టులు ఇలా అన్ని ఫార్మాట్లలోనూ అదరగొడుతూ భారత భవిష్యత్ గా పేరు తెచ్చుకున్నాడు ఆ ఓపెనర్. భావి కెప్టెన్ గానూ అతడి పేరే వినిపిస్తోంది. ఇటీవల ఆసీస్ తో సిరీస్ లోనూ రాణించి మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్న అతడు ప్రపంచ కప్ లో అత్యంత కీలక బ్యాట్స్ మన్ అవుతాడని అంచనాలున్నాయి. కానీ , బ్యాడ్ లక్.
మాయదారి డెంగీ
టీమిండియా యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్ విష జర్వమైన డెంగీ బారినపడ్డాడు. దీంతో ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగే ప్రపంచ కప్ తొలి మ్యాచ్ కు అతడు అందుబాటులో ఉండడం లేదని తెలుస్తోంది. ఇప్పటికైతే ఇది ప్రాథమిక సమాచారమే. డెంగీ తీవ్రత ఎక్కువగా ఉంటే గిల్ మరో మ్యాచ్ కూ దూరం కావొచ్చు. కాకపోతే ఒక్క మ్యాచ్ కే అతడు అందుబాటులో ఉండడని చెబుతున్నారు.
అతడు లేకుంటే కిషన్..
గిల్ అనూహ్యంగా మ్యాచ్ కు దూరమైన పరిస్థితుల్లో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్ భారత ఇన్నింగ్స్ ను తెరిచే చాన్సుంది. వాస్తవానికి కిషన్, గిల్ ఇద్దరినీ భారత భావి ఓపెనర్లుగా భావిస్తున్నారు. అయితే, జట్టు కూర్పు రీత్యా ఒక్కరికే చోటు దక్కుతోంది. మరోవైపు భారత బ్యాటింగ్ లైనప్ లో ఎడమచేతి వాటం స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్ ఒక్కడూ లేరు. కిషన్ కు చోటు దక్కితే ఆ లోటు తీరుతుంది. కానీ, ఒక్క మ్యాచ్ వరకే.
కొసమెరుపు: టీమిండియా వన్డే ఓపెనర్లు ముగ్గురూ (రోహిత్, గిల్, కిషన్) డబుల్ సెంచరీ వీరులే. కెప్టెన్ రోహిత్ అయితే ఏకంగా మూడు డబుల్ సెంచరీలు కొట్టాడు. గిల్, కిషన్ ఈ ఏడాది ఆ ఘనతను అందుకున్నారు. ప్రపంచంలో మరే జట్టు ఓపెనర్లకూ సాధ్యం కాని రికార్డు ఇది.