Begin typing your search above and press return to search.

సిరీస్‌ ఆశలను సజీవంగా ఉంచిన మాక్స్ వెల్... 6, 4, 4, 4!

ఆ తర్వాత మ్యాక్స్‌ వెల్‌ అలవోకగా రెచ్చిపోయాడు. విధ్వంసం సృష్టించాడు. వరుసగా 6, 4, 4, 4తో ఆసీస్‌ ను విజయతీరాలకు చేర్చాడు.

By:  Tupaki Desk   |   29 Nov 2023 4:03 AM GMT
సిరీస్‌  ఆశలను సజీవంగా ఉంచిన మాక్స్  వెల్... 6, 4, 4, 4!
X

వరల్డ్ కప్ ఫైనల్ లో ఓటమి అనంతరం ఆసిస్ తో జరుగుతున్న టీ20లో వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచిన టీం ఇండియా మూడో మ్యాచ్ లో దెబ్బతింది. మాక్స్ వెల్ విధ్వంసం ముందు అనుభవం లేని భారత్ బౌలర్లు చేతులెత్తేశారు. మాక్స్ వెల్ క్రీజ్ లో ఉంటే మ్యాచ్ మనది కాదు అని అనుకున్న సగటు భారత క్రికెట్ అభిమాని భయం నిజం అయ్యింది. ఆసీస్‌ ఈ విజయంతో సిరీస్‌ లో భారత్‌ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది.

ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ కైవసం అనుకున్న టీం ఇండియాకు మాక్స్ వెల్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్ లో టీం ఇండియాకు విలన్ అతడే! సీనియర్లు లేని భారత బౌలర్లపై మ్యాక్స్‌ వెల్‌ విధ్వంసక బ్యాటింగ్‌ తో విరుచుకుపడ్డాడు. కేవలం 48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 104 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

అవును... తాజాగా జరిగిన మూడో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు సాధించింది. టీం ఇండియా బ్యాటర్స్ లో రుతురాజ్‌ నాటౌట్‌ 123 (57 బంతుల్లో 13×4, 7×6) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక కెప్టెన్ సూర్యకుమార్‌ 39, తిలక్‌ వర్మ నాటౌట్‌ 31 తో రాణించారు.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆసిస్ హెడ్‌ 35, మ్యాక్స్‌ వెల్‌ నాటౌట్‌ 104, వేడ్‌ నాటౌట్‌ 28 పని పూర్తిచేశారు. ఒకానొక దశలో మ్యాచ్ టీం ఇండియాది అనే అనిపించింది. ఆసీస్‌ చివరి రెండు ఓవర్లలో 43 పరుగులు చేయాల్సిన పరిస్థితి. అప్పుడు గతి తప్పిన భారత్ బౌలర్ల పేలవ బౌలింగ్‌ ను వేడ్, మాక్స్ వెల్ ఆడుకున్నారు. వేడ్‌ రెండు ఫోర్లు, సిక్స్‌ బాదడం, 4 బైస్‌ రావడంతో 19వ ఓవర్లో 22 పరుగులు రాబట్టాడు.

ఇక ఆఖరి ఓవర్లో వేడ్‌ ఓ ఫోర్‌ కొట్టి, సింగిల్‌ తీయగా.. ఆ తర్వాత మ్యాక్స్‌ వెల్‌ అలవోకగా రెచ్చిపోయాడు. విధ్వంసం సృష్టించాడు. వరుసగా 6, 4, 4, 4తో ఆసీస్‌ ను విజయతీరాలకు చేర్చాడు. టీం ఇండియాకు కాలరాత్రిని మిగిల్చాడు! ఈ మ్యాచ్ లో చేసిన సెంచరీ నెంబర్ 4 తో అంతర్జాతీయ టీ20ల్లో అగ్రస్థానంలోని రోహిత్‌ (4)ను మ్యాక్స్ వెల్ సమం చేశాడు.