Begin typing your search above and press return to search.

ప్రపంచ కప్ లో శుభవార్త.. ఆ విశ్వ క్రీడా సమరంలోనూ క్రికెట్!

టి20లు అయినా దాదాపు మూడున్నర గంటల సమయం పడుతుంది. ఇక వన్డేలకు అయితే ఆరేడు గంటలు కావాలి. ఇంత సమయం ఇచ్చే వీలు లేకనే క్రికెట్ ను ఒలింపిక్స్ లో చేర్చలేదు.

By:  Tupaki Desk   |   13 Oct 2023 11:42 AM GMT
ప్రపంచ కప్ లో శుభవార్త.. ఆ విశ్వ క్రీడా సమరంలోనూ క్రికెట్!
X

భారత్ లో క్రికెట్ వన్డే ప్రపంచ కప్ సమరం జరుగుతున్న సమయంలో ఓ శుభవార్త. ఇకపై మరో విశ్వ క్రీడా సమరంలోనూ క్రికెట్ కనిపించనుంది. ఇప్పటికే ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ లో భాగమైన క్రికెట్ కు ఇకమీదట మరింత గుర్తింపు రానుంది. మరికొన్నేళ్లలో విశ్వవ్యాప్తంగా క్రికెట్ ప్రాచుర్యం పొందనుంది.

ఇంగ్లండ్ లో పుట్టి భారతీయుల మతంగా మారిన క్రికెట్ ను ఒలింపిక్స్ లోనూ ప్రవేశపెట్టనున్నారు. ఎన్నాళ్లనుంచో నలుగుతున్న ఈ ప్రతిపాదనకు తాజాగా ఆమోద ముద్ర పడింది. అదికూడా అగ్ర రాజ్యం అమెరికా ఆతిథ్యం ఇవ్వనున్న ఒలింపిక్స్ నుంచి మొదలుకానుంది. 2028 లాస్ ఏంజిల్స్ గేమ్స్ నుంచి క్రికెట్ ను కూడా చేర్చడానికి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ శుక్రవారం ఆమోదం తెలిపింది.

ముంబై సమావేశంలోనే నిర్ణయం..

ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చాలనేది ఎప్పటినుంచో ఉన్న డిమాండ్. ఊరూ పేరూ అనేక క్రీడలకు అవకాశం ఇచ్చి.. క్రికెట్ ను విస్మరించడం ఏమిటనే ప్రశ్నలూ వచ్చాయి. అయితే, దీనికి పెద్ద కారణమే ఉంది. మిగతా క్రీడల తరహాలో క్రికెట్ చకచకా ముగిసేది కాదు. టి20లు అయినా దాదాపు మూడున్నర గంటల సమయం పడుతుంది. ఇక వన్డేలకు అయితే ఆరేడు గంటలు కావాలి. ఇంత సమయం ఇచ్చే వీలు లేకనే క్రికెట్ ను ఒలింపిక్స్ లో చేర్చలేదు. దీనికితోడు క్రికెట్ కోసం పెద్దపెద్ద మైదానాలు అవసరం. అదీ ఓ సమస్యనే. మొత్తానికి వీటిని అధిగమిస్తూ విశ్వ క్రీడా సమరంలో క్రికెట్ కూడా భాగమైంది. లాస్ ఏంజెల్స్ గేమ్స్‌లో క్రికెట్ ను చేర్చడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆమోదించింది. అది కూడా ముంబైలో జరిగిన ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.

మరో నాలుగు క్రీడలూ..

బేస్ బాల్/సాఫ్ట్ బాల్, ఫ్లాగ్ ఫుట్ బాల్‌, స్వ్కాష్, లాక్రోస్‌.. ఈ నాలుగూ క్రికెట్ తో పాటు ఒలింపిక్స్ లో చేర్చిన క్రీడలు. ఈ 5 క్రీడల చేర్పు ఐవోసీ అధ్యక్షుడు థామస్ బాచ్ ప్రకటన చేశఆరు. క్రికెట్‌ను కూడా ఒలింపిక్స్ లో చేర్చాలనే లాస్ ఏంజెల్స్‌ నిర్వాహకుల ప్రతిపాదనను ఆమోదించామని చెప్పారు.

కొసమెరుపు: ఒలింపిక్స్ కు వచ్చే ఏడాది పారిస్ ఆతిథ్యం ఇవ్వనుంది. అందులో క్రికెట్ కు చాన్సు లేదు. 2028లో మాత్రం లాస్ ఏంజెల్స్ లో జరిగే గేమ్స్ లో క్రికెట్ ఉంటుంది. అయితే, అది ఏ ఫార్మాట్ లో అనేది తెలియాల్సి ఉంది. ఎక్కువ శాతం టి20 ఫార్మాట్ లోనే ఒలింపిక్స్ క్రికెట్ జరుగుతుందని చెప్పొచ్చు.