గూగుల్ హిస్టరీ ‘ఛేజ్’ చేసిన టీమిండియా దిగ్గజం
బ్యాట్స్ మన్, బౌలర్, ఆల్ రౌండర్ కాకుండా.. క్రికెట్ లో వినిపించే మరో ముఖ్యమైన పదం ఫినిషర్. ఆధునిక క్రికెట్ లో పోటీ తత్వం బాగా పెరిగిపోయింది.
By: Tupaki Desk | 12 Dec 2023 12:30 PM GMTబ్యాట్స్ మన్, బౌలర్, ఆల్ రౌండర్ కాకుండా.. క్రికెట్ లో వినిపించే మరో ముఖ్యమైన పదం ఫినిషర్. ఆధునిక క్రికెట్ లో పోటీ తత్వం బాగా పెరిగిపోయింది. దీంతో ఫినిషర్లకు ప్రాధాన్యం ఏర్పడింది. చేసింది పది పరుగులా? 20 పరుగులా? అని కాదు.. ఫినిషర్ గా తమ వంతు పాత్ర పోషించామా? లేదా? అనేది ముఖ్యమైంది. ఈ ఫినిషర్ కు మరో పేరు రన్ ఛేజర్ అనుకోవచ్చు. ఫినిషర్ మొదటి బ్యాటింగ్ చేసిన జట్టులోనూ కనిపిస్తాడు. ఛేజర్ మాత్రం టార్గెట్ ను అందుకునేటప్పుడే బయటకు వస్తాడు.
బెవాన్, ధోనీ..
ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ ఫినిషర్లు ఎవరంటే.. ఆస్ట్రేలియాకు చెందిన మైకేల్ బెవాన్. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఓ 20 ఏళ్ల కిందటి వరకు బెవాన్ లాంటి క్రికెటర్ మనకూ దొరికితే బాగు అనుకునే పరిస్థితి. అలాంటి సమయంలోనే వచ్చాడు ధోనీ. తనదైన శైలిలో సిక్సులు కొడుతూ మ్యాచ్ లను గెలిపించాడు. ఇక ధోనీ తరంలోనే ఎదిగాడు విరాట్ కోహ్లి. అయితే, తనదైన శైలిలో కోహ్లి ఛేజింగ్ మాస్టర్ గా నిలిచాడు. రన్ మెషిన్ గా ఎంతటి పేరుందో ఛేజింగ్ లోనూ కోహ్లికి అంతటి పేరుంది.
గూగుల్ నూ ఛేదించాడు..
పాతికేళ్ల చరిత్ర గూగుల్ ది. 1998లో మొదలైంది దాని శకం. అప్పటివరకు ఉన్న బ్రౌజర్లను ఛేజ్ చేసి టాప్ లోకి వచ్చింది. అలాంటి గూగుల్ నే ఛేజ్ చేశాడు కోహ్లి... గూగుల్ 25ఏళ్ల చరిత్రలో కోహ్లీ టాప్ లో నిలిచాడు. ఎందుకంటే.. ఆ సెర్చ్ ఇంజిన్ లో అత్యధికంగా వెతికింది ఇతడినే.. ఆ మేరకు కోహ్లీ ప్రత్యేక ఘనత సాధించాడు. వాస్తవానికి గూగుల్ వచ్చిన సమయంలో సచిన్, ధోనీ వంటి దిగ్గజాలు అంతర్జాతీయ క్రికెట్ లో ఉన్నారు. వారిని దాటుకుని అత్యంత ఎక్కువమంది శోధించిన క్రికెటర్‌గా టాప్‌లో నిలిచాడు కోహ్లి. ఈ పరుగుల యంత్రం గురించి ఏ చిన్న విషయమైనా అభిమానులకు ఆసక్తే. అందుకే అతడి సమాచారం కోసం బాగా వెదికినట్లు తెలుస్తోంది. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం 25 ఏళ్లను పూర్తిచేసుకున్న క్రమంలోనే తాజాగా ఎక్స్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. అత్యధికంగా శోధించిన అంశాలతో దీన్ని రూపొందించింది. అందులో ‘అత్యధిక మంది వెతికిన క్రికెటర్’గా కోహ్లీ నిలవడం విశేషం.
అక్కడ రొనాల్డోనే టాప్..
అర్జెంటీనా స్టార్ మెస్సీతో ఎంత పోటీ ఉన్నప్పటికీ.. అత్యధిక మంది శోధించిన అథ్లెట్ గా ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అగ్ర స్థానంలో ఉన్నాడు. ఇక అత్యధిక మంది వెదికిన ఆటగా ఫుట్‌బాల్ కే అగ్ర పీఠం దక్కింది. ప్రజలు ఎక్కువగా ఇష్టపడే రంగమైన సినిమాల్లో ఎక్కువ మంది శోధించిన మూవీ జానర్ గా మన బాలీవుడ్ అగ్రస్థానంలో ఉంది. ‘‘25 ఏళ్ల క్రితం ఈ ప్రపంచం వెతకడం (గూగుల్ సెర్చ్‌ను ఉద్దేశిస్తూ) మొదలు పెట్టింది. ఇక మిగతాదంతా చరిత్రే’’ అంటూ ఆ వీడియో ప్రారంభమైంది. చరిత్రలో అత్యంత ఎక్కువ మంది వెతికిన ‘మొదటి అడుగు’గా.. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై కాలు మోపిన దృశ్యం నిలిచింది. ఇక, 1980వ దశకం గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది శోధించారట.