Begin typing your search above and press return to search.

పాక్ పై ఘన విజయం... తుపాకులకు పనిచెప్పిన తాలిబాన్లు!

ఇందులో భాగంగా... చెన్నై చెపాక్‌ లోని చిదంబరం స్టేడియంలో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌ లో పాకిస్తాన్‌ ను చిత్తు చేసింది ఆఫ్ఘనిస్తాన్.

By:  Tupaki Desk   |   24 Oct 2023 5:57 AM GMT
పాక్  పై ఘన విజయం... తుపాకులకు పనిచెప్పిన తాలిబాన్లు!
X

రెండేళ్ల కిందట తాలిబన్ల చేతుల్లోకి వెళ్లాక అఫ్గానిస్థాన్‌ పరిస్థితి దయనీయంగా మారిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఇటీవల సంభవించిన భూకంపం.. అది మిగిల్చిన విషాదం వర్ణనాతీతం. ఇలాంటి విషాదాల మధ్య ఉన్న ఆఫ్గాన్ ప్రజల కళ్లల్లో ఆనందం కనిపించింది.. సంబరాలు చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఇందులో భాగంగా తాలిబన్లు సైతం తుపాకులకు డిఫరెంట్ గా పనిచెప్పారు. అందుకు సంబందించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

అవును... ఎవరూ ఊహించని విధంగా ప్రపంచ కప్ లో మరో సంచలనం వెలుగు చూసింది. మొన్నటికి మొన్న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ ను మట్టికరిపించిన ఆఫ్ఘనిస్తాన్.. ఆ మ్యాచ్ లో 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే అది గాలివాటంలో వచ్చిన విజయం అని ఎవరైనా అనుకుంటే అంతకంటే పొరపాటు లేదని మరోసారి గట్టిగా చెప్పే ప్రయత్నం చేసింది.

ఇందులో భాగంగా... చెన్నై చెపాక్‌ లోని చిదంబరం స్టేడియంలో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌ లో పాకిస్తాన్‌ ను చిత్తు చేసింది ఆఫ్ఘనిస్తాన్. నభుతో న భవిష్యత్ అన్నట్లుగా ఎనిమిది వికెట్ల తేడాతో పాక్ పై అద్భుత విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్ పెట్టిన 282 పరుగుల టార్గెట్‌ ను కేవలం రెండు వికెట్లను కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్ లో ఆఫ్గాన్ ఫెర్మార్మెన్స్ పై విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి.

ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ (74) అబ్దుల్లా షఫీక్‌ (58), షాదాబ్‌ ఖాన్‌ (40), ఇఫ్తికార్ అహ్మద్‌ (40) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన అఫ్గాన్‌ కు ఓపెనర్లు రహ్మనుల్లా గుర్భాజ్ (65), ఇబ్రహీం జాద్రాన్‌ (74) అర్ధ శతకాలతో రాణించి మొదటి వికెట్‌ కు 130 పరుగులతో బలమైన పునాది వేశారు.

అనంతరం వచ్చిన రహ్మత్‌ షా (77), హష్మాతుల్లా షాహిది (48) నిలకడగా ఆడి అఫ్గాన్‌ కు చారిత్రక విజయాన్ని అందించారు. ఇక అఫ్గాన్ బౌలర్లలో నూర్ అహ్మద్‌ 3, నవీనుల్ హక్ 2, అజ్మతుల్లా, మహ్మద్‌ నబీకి ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో గెలవడంతో పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి చేరుకుంది ఆఫ్ఘన్.

ఇలా వరల్డ్ కప్ వంటి అత్యున్నత వేదికపై తమ దేశం నిన్న డిఫెండింగ్ ఛాంపియన్ ని ఓడించడంతోపాటు పాకిస్తాన్‌ ను ఓడించడంతో ఆఫ్ఘనిస్తాన్‌ లో సంబరాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా... రాజధాని కాబుల్ సహా ఇతర ప్రధాన నగరాల్లో పండగ వాతావరణం కనిపించింది. ఈ ప్రాంతాల్లో అభిమానులు రోడ్లపైకి వచ్చి, బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. తమ దేశ జాతీయ పతాకాలను ప్రదర్శించారు.

ఆఫ్గాన్ లో ప్రజలు స్వచ్ఛందంగా ఇలా రోడ్లపైకి వచ్చి మనస్పూర్తిగా సంబరాలు చేసుకోవడం ఈ మధ్యకాలంలో ఇదే ప్రథమం అని అంటున్నారు. వీరితో పాటు కాబుల్‌ లో తాలిబన్లు సైతం ఈ వేడుకల్లో పాల్గొనడం గమనార్హం. ఈ విజయాన్ని తాలిబాన్లు సైతం తమదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నారు! ఇందులో భాగంగా... తుపాకులతో గాల్లోకి కాల్పులు జరుపుతూ సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

కాగా... ఈ మ్యాచ్ తో పాయింట్ల పట్టికలో ఆఫ్గన్ ఆరోస్థానానికి వచ్చేసింది. ఇంగ్లండ్, శ్రీలంక, నెదర్లాండ్, బంగ్లాదేశ్ లను దాటి 4 పాయింట్లతో పైకి ఎగబాకింది.