Begin typing your search above and press return to search.

3 క్రికెట్ సంఘాలు.. 4వ క్రికెట్ స్టేడియం.. దేశంలోనే రికార్డు!

దేశంలో అత్యంత ప్రగతిదాయక రాష్ట్రాల్లో ఒకటి గుజరాత్ అని చెబుతారు. పారిశ్రామికంగా చాలా ముందంజలో ఉంటుందా రాష్ట్రం.

By:  Tupaki Desk   |   21 Feb 2024 1:30 PM GMT
3 క్రికెట్ సంఘాలు.. 4వ క్రికెట్ స్టేడియం.. దేశంలోనే రికార్డు!
X

దేశంలో కొన్ని రాష్ట్రాలకు ఒక్కటే క్రికెట్ సంఘం ఉంది.. ఈశాన్యంలో అయితే అదీ లేదేమో..? తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు 'ఆంధ్రా', 'హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ)' ఉండేవి. ఇప్పటికీ తెలంగాణకు ప్రత్యేకంగా క్రికెట్ సంఘం లేదంటే ఆశ్చర్యమే. సాపేక్షంగా హైదరాబాద్ క్రికెట్ సంఘం తెలంగాణదే అయినా, పూర్తిస్థాయిలో రాష్ట్రానిది అని చెప్పలేం. కానీ, దేశంలో ఏ రాష్ట్రానికి లేనివిధంగా ఒక రాష్ట్రంలో మూడు క్రికెట్ సంఘాలు ఉన్నాయి.

అందుకే దానిని గుజరాత్ అంటారు..

దేశంలో అత్యంత ప్రగతిదాయక రాష్ట్రాల్లో ఒకటి గుజరాత్ అని చెబుతారు. పారిశ్రామికంగా చాలా ముందంజలో ఉంటుందా రాష్ట్రం. ప్రజలు కూడా ఎక్కువగా వ్యాపార పరంగానే ఆలోచిస్తారు. ఇక గుజరాత్ మరో ప్రత్యేకత ఏమంటే.. మూడు క్రికెట్ సంఘాలు ఉండడం. వాటిలో ఒకటి సౌరాష్ట్ర, రెండు గుజరాత్, మూడు బరోడా. ఇక ఈ మూడు జట్లూ రంజీల్లో బలమైనవే. సౌరాష్ట్ర నుంచి రవీంద్ర జడేజా, చతేశ్వర్ పుజారా, గుజరాత్ తరఫున పార్థివ్ పటేల్, మునాఫ్ పటేల్ వంటి వారు జాతీయ జట్టుకు ఆడారు. బరోడాకూ చాలా చరిత్రే ఉంది. అసలు గుజరాత్ లో మొదటి క్రికెట్ సంఘం ఇదే. సరిగ్గా చెప్పాలంటే 90 ఏళ్ల చరిత్ర. 1934లో ఈ సంఘాన్ని మహారాజా శాయాజీరావ్ గైక్వాడ్-3 ఏర్పాటు చేశారు. విజయ్ హజారే వంటి దిగ్గజ క్రికెటర్లు బరోడా నుంచి వచ్చినవారే. గుజరాత్ లోని వడోదర నగరం కేంద్రంగా ఈ సంఘం పనిచేస్తుంది. మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రానికి మాత్రమే దేశంలో మూడు క్రికెట్ సంఘాలు (మహారాష్ట్ర, ముంబై, విదర్భ) ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్ లోనే మూడు ఉన్నాయి.

అటు మోదీ స్టేడియం.. ఇటు?

గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్దదైనది అనే సంగతి తెలిసిందే. లక్షమందిపైగా పట్టే సామర్థ్యం దీని సొంతం. ఇక సౌరాష్ట్రకు కేంద్రం రాజ్ కోట్. ఇటీవల ఇంగ్లండ్ తో టెస్టు మ్యాచ్ కు వేదికైనది ఈ మైదానమే అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బరోడా క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) కొత్త స్టేడియం నిర్మించుకుంది. 35 వేల సీట్లతో వడోదరలో దీనిని నిర్మించారు. రూ.215 కోట్లు ఖర్చు పెట్టారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో రెండేళ్ల కిందట గుజరాత్ కు కొత్తగా ఫ్రాంచైజీ (గుజరాత్ టైటాన్స్) ఏర్పాటైన సంగతి తెలిసిందే. తొలిసారే ఆ జట్టు విజేతగా ఆవిర్భవించింది కూడా. రెండోసారి రన్నరప్ తో సరిపెట్టుకుంది. వడోదర క్రికెట్ స్టేడియం ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ కు హోం గ్రౌండ్. విశేషం ఏమంటే ఇప్పటికే రంజీ మ్యాచ్ లకు వడోదర స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. వచ్చే ఐపీఎల్ సీజన్ లోనూ కొన్ని మ్యాచ్ లను కేటాయించే చాన్సుంది. కాగా, గుజరాత్ లోని సూరత్ లో లాలాబాయ్ కాంట్రాక్టర్ స్టేడియం కూడా ఉంది. అయితే, ఇదింకా ద్వితీయ శ్రేణి మైదానమే. త్వరలో అప్ గ్రేడ్ అయినా కావొచ్చు. ఎందుకంటే సూరత్ వజ్రాల నగరం. వ్యాపారపరంగా చాలా ముందంజలో ఉంటుంది.