ముకేష్ ముంచేశాడు... గుజరాత్ ని వణికించేసిన ఢిల్లీ బౌలర్లు!
ఐపీఎల్ సీజన్ 17లో తొలిసారి పూర్తిగా బౌలర్ల ఆధిపత్యం కొనసాగిన మ్యాచ్... గుజరాత్ టైటాన్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది
By: Tupaki Desk | 18 April 2024 4:10 AM GMTఐపీఎల్ సీజన్ 17లో తొలిసారి పూర్తిగా బౌలర్ల ఆధిపత్యం కొనసాగిన మ్యాచ్... గుజరాత్ టైటాన్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ బ్యాటర్స్ పేలవమైన ప్రదర్శనతో కనీసం మూడంకెల స్కోరుని కూడా చేరుకోలేకపోయింది. ఇక ఢిల్లీ బౌలర్లు.. గుజరాత్ బ్యాటర్స్ ని బంతాడేసుకున్నారు. గుజరాత్ బౌలర్లలో ఒక్క బ్యాటర్ కూడా కనీసం 25 బంతులను ఫేస్ చేయలేని పరిస్థితి అంటే.. ఢిల్లీ బౌలర్ల దాడి ఎలా సాగిందో అర్ధం చేసుకోవచ్చు!
అవును... పరుగుల వరద పారుతున్న ఐపీఎల్-17లో అహ్మదాబాద్ లో గుజరాత్ - ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ పూర్తిగా బౌలర్ల ఆధిపత్యం మీదే నడిచింది. ఇటు పరుగులూ ఇవ్వక, అటు క్రమంగా వికెట్లూ పడగొడుతూ, బెస్ట్ ఫీల్డింగ్ పెర్ఫార్మెన్స్ చేస్తూ, మెరుపు రన్ ఔట్స్ చేస్తూ గుజరాత్ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించారు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 17.3 ఓవర్లలో కేవలం 89 పరుగులకే కుప్పకూలింది.
గుజరాత్ పతనం సాగిందిలా:
ఈ సీజన్ లో ఫుల్ ఫాం లో ఉన్నట్లు కనిపించిన శుభ్ మన్ గిల్... రెండు ఫోర్లు కొట్టి ఊపుమీద కనిపించినా 8 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద.. ఇషాంత్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అక్కడ నుంచి మొదలైంది. టైటాన్స్ పతనం! మరో ఓపెనర్ సాహా (2)ను తన తొలి ఓవర్లో ముకేష్ బౌల్డ్ చేశాడు. సాయి సుదర్శన్ (12)ను సుమిత్ మెరుపు త్రోతో రనౌట్ చేశాడు.
అనంతరం సీనియర్ బ్యాటర్ మిల్లర్ (2)ను కూడా ఇషాంత్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 5 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయిన గుజరాత్ 30 పరుగులు మాత్రమే చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలా ఫేసర్లు ఇద్దరూ గుజరాత్ వెన్ను విరిచినంత పనిచేస్తే... అనంతరం స్పిన్నర్ల ప్రతాపం మొదలైంది. ఇందులో భాగంగా... ఐపీఎల్ లో తొలిసారి బౌలింగ్ చేసిన పార్ట్ టైం స్పిన్నర్ ట్రిస్టియన్ స్టబ్స్ ఒకే ఓవర్లో అభినవ్ మనోహర్ (8), షారుక్ ఖాన్ (0)లను ఔట్ చేశాడు.
తెవాతియా (10)ను అక్షర్ పటేల్ పెవిలియన్ కు పంపించాడు. ముకేష్ 18వ ఓవర్లో 2 వికెట్లతో చెక్ పెట్టాడు. 15 బంతులుండగానే ఆ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ (2/8), ట్రిస్టియన్ స్టబ్స్ (2/11), ముకేష్ కుమార్ (3/14), అక్షర్ పటేల్ (1/17), ఖలీల్ అహ్మద్ (1/18) గుజరాత్ జట్టును దెబ్బ తీశారు.
సగం ఓవర్లు పూర్తవకుండానే చక్కబెట్టిన ఢిల్లీ!:
90 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ బ్యాటర్ నెట్ రన్ రేట్ ను మెరుగుపరచుకునే ప్రయత్నం చేశారు. ఢిల్లీ ఓపెనర్లలో తన ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్ లో లక్నోపై హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించిన ఆస్ట్రేలియా యువ బ్యాటర్ జేక్ ఫ్రేజర్.. గుజరాత్ తో పోరులోనూ ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. గత మ్యాచ్ లో మాదిరే ఎదుర్కొన్న తొలి బంతినే ఫ్రేజర్ (20: 10 బంతుల్లో 2×4, 2×6) స్టాండ్స్ లోకి పంపాడు.
మరో ఓపెనర్ పృథ్వీ షా (7) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అభిషేక్ పోరెల్ (15: 7 బంతుల్లో 2×4, 1×6)తో కలిసి షై హోప్ (19: 10 బంతుల్లో 1×4, 2×6) ధాటిగా ఆడడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఆ తర్వాత కెప్టెన్ పంత్ (16*: 11 బంతుల్లో 1×4, 1×6), సుమిత్ కుమార్ (9*) లాంఛనాన్ని పూర్తి చేశారు. దీంతో 8.5 ఓవర్లలో ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఫినిష్ చేసింది.
దీంతో... ఆడిన 7 మ్యాచ్ లలో మూడేసి మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో ఢీలీ ఆరో స్థానంలో, గుజరాత్ ఏడో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లూ మైనస్ నెట్ రన్ రేట్ తో ఉండటం గమనార్హం.