Begin typing your search above and press return to search.

ధోనీతో నాకు మాటల్లేవ్.. భారత గ్రేట్ ఆఫ్ స్పిన్నర్ షాకింగ్ వ్యాఖ్యలు

ధోనీతో తాను మాట్లాడక పదేళ్లు దాటిందని.. కారణం లేకుండానే ధోనీనే తనతో మాట్లాడడం లేదని చెప్పాడు. చెన్నైకు ఆడేప్పుడు మాట్లాడుకున్నా.. అది మైదానంలో మాత్రమేనని తెలిపాడు.

By:  Tupaki Desk   |   4 Dec 2024 1:30 PM GMT
ధోనీతో నాకు మాటల్లేవ్.. భారత గ్రేట్ ఆఫ్ స్పిన్నర్ షాకింగ్ వ్యాఖ్యలు
X

వారిద్దరూ కలిసి పన్నెండేళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడారు.. దేశానికి రెండు ప్రపంచ కప్ లు సాధించారు. అనేక మ్యాచ్ లలో అతడు కెప్టెన్ గా ఇతడు కీలక స్పిన్నర్ గా వ్యవహరించారు.. టి20లు, వన్డేలు, టెస్టులు.. ఐపీఎల్.. ఇలా అన్నీ కలిపి మొత్తమ్మీద మైదానంలో వందల మ్యాచ్ లు ఆడారు.. కానీ, వారి మధ్య పదేళ్లుగా మాటల్లేవంట..

ఎందుకో ఏమిటో?

భారత క్రికెట్లో 400 పైగా వికెట్లు తీశాడు ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. 1998 నుంచి 2015 వరకు దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 103 టెస్టుల్లో 417 వికెట్లు తీశాడు. 236 వన్డేల్లో 269 వికెట్లు, 28 టి20ల్లో 25 వికెట్లు పడగొట్టాడు. అలాంటి హర్భజన్.. తనకు కెప్టెన్ గా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోనీ మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమ ఇద్దరి మధ్య మాటల్లేవని.. అసలు తాము స్నేహితులమే కాదని అన్నాడు.

ఐపీఎల్ లో మాటల్లేవ్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ నుంచి 2018 లో చెన్నై సూపర్ కింగ్స్ కు మారాడు. ఆ జట్టుకు ధోనీ కెప్టెన్ గా ఉండగా 2020 వరకు ఆడాడు. మొత్తమ్మీద చూస్తే 2007 నుంచి 2015 వరకు జాతీయ జట్టుకు, 2018-20 మధ్య ఐపీఎల్ లో ధోనీ కెప్టెన్సీలోనే ఆడాడు. అయితే, సీఎస్కే తరఫున ఆడినప్పుడు కూడా గ్రౌండ్ లో తాము పరిమితంగానే మాట్లాడుకున్నట్లు భజ్జీ వెల్లడించాడు.

ఫోన్ కు స్పందించలేదా?

ధోనీతో తాను మాట్లాడక పదేళ్లు దాటిందని.. కారణం లేకుండానే ధోనీనే తనతో మాట్లాడడం లేదని చెప్పాడు. చెన్నైకు ఆడేప్పుడు మాట్లాడుకున్నా.. అది మైదానంలో మాత్రమేనని తెలిపాడు. ఇద్దరం తమతమ హోటల్ గదుల్లోనే ఉన్నామన్నాడు. తమకేం విరోధం లేదని.. ఏదైనా చెప్పాలనుకుంటే తనకు చెబుతాడని.. ఏదైనా ఉంటే ఇప్పటికే చెప్పి ఉండేవాడన్నాడు. ఇక తాను ధోనీకి ఫోన్ చేయనని... తన ఫోన్ కు ఎవరైతే స్పందిస్తారో వారికే చేస్తానని తెలిపాడు.స్నేహంగా ఉన్నవారితోనే టచ్‌ లో ఉంటానని, సంబంధం అనేది ఇచ్చిపుచ్చుకోవడంపై ఆధారపడి ఉంటుందని వివరించాడు. మనం ఎదుటివారిని గౌరవిస్తే వారి నుంచి కూడా అదే ఆశిస్తామని.. ఎవరికైనా ఒకట్రెండుసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోతే అవసరమైనప్పుడు మాత్రమే కలుస్తాననని పేర్కొన్నాడు. ఈ అభిప్రాయం ప్రకారం చూస్తే హర్భజన్ ఫోన్ చేసినా ధోనీ స్పందించలేదని అర్థం అవుతోంది.

ధోనీ ఫోన్ కు దొరకడంతే..

ధోనీ ఈ కాలం వారిలా తరచూ ఫోన్ లో మునిగిపోయే రకం కాదు. అతడు ఫోన్ పట్టుకున్నట్లు ఎక్కడా కనిపించదు. అసలు అతడు ఫోన్ కు ఎవరికీ అందుబాటులో కూడా ఉండడు. ఇది ఒకరకంగా మంచి పద్ధతే. మరి, హర్భజన్ తో ఎందుకు మాట్లాడడం లేదు..? అనేది ఎవరూ చెప్పలేరు.. ధోనీ నోరు విప్పితే తప్ప. ఇది ఎలాగూ జరగదు.