మీరు రాకుంటే ఎంత? వస్తే ఎంత? పాక్ కు హర్భజన్ గట్టి కౌంటర్
‘‘సరే.. మా దేశంలో జరిగే చాంపియన్స్ ట్రోఫీకి భారత్ రాకపోయినా ఫర్లేదు. ఆ దేశపు జట్టు ఆడే మ్యాచ్ లు ఇతర దేశంలో నిర్వహించుకోవచ్చు.
By: Tupaki Desk | 3 Dec 2024 9:08 AM GMT‘‘సరే.. మా దేశంలో జరిగే చాంపియన్స్ ట్రోఫీకి భారత్ రాకపోయినా ఫర్లేదు. ఆ దేశపు జట్టు ఆడే మ్యాచ్ లు ఇతర దేశంలో నిర్వహించుకోవచ్చు. కానీ, భవిష్యత్ లో భారత్ లో జరిగే టోర్నీల్లో మా జట్టు పాల్గొనదు. మీరు కూడా మమ్మల్ని ఒత్తిడి చేయొద్దు’’ ఇదీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పెట్టిన షరతు.
ఇదెక్కడి విడ్డూరం..
పాకిస్థాన్ లో భారత్ ఎందుకు పర్యటించడం లేదు..? ఆ దేశం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని.. ఆ దేశంలో శాంతిభద్రతలు సరిగా లేవని..కానీ, భారత్ లో అలాంటి పరిస్థితి లేదు. అనేక మెగా టోర్నీలు సక్సెస్ ఫుల్ గా జరిగాయి. అయితే, భారత్ తమ దేశానికి రావడం లేదని.. పాకిస్థాన్ కూడా భారత్ లో పర్యటించకూడదనుకోవడమే విడ్డూరం.
హైబ్రిడ్ కు ఓకే.. కానీ..
వచ్చే ఫిబ్రవరిలో పాకిస్థాన్ లో చాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. భారత్ రాననడంతో నిర్వహణ సందిగ్ధంలో పడింది. దీంతో హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించడానికి అంగీకరిస్తూనే పాక్ మెలిక పెట్టింది. దీనిపై ఆ దేశ క్రికెట్ బోర్డుకు భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ దీటైన కౌంటర్ ఇచ్చాడు. ఇష్టం ఉంటేనే భారత్ కు రండి.. లేదంటే మానుకోండి.. మాకేం బాధ లేదు అంటూ తేల్చిచెప్పాడు.
అంతేకాదు పాక్ జట్టు రాకపోతే పెద్దగా ఎవరూ పట్టించుకోరని.. క్రికెటర్లను అడిగినా ఇదే చెప్తారన్నాడు. పాక్ లో పరిస్థితి భిన్నంగా ఉంటే భారత్ కూడా అందుకుతగ్గ నిర్ణయం తీసుకునేదన్నాడు. మొండి వైఖరి వీడి టోర్నీ జరిగేలా చూడాలని.. ఎలాగూ మీరు దానిని ఆపలేరని వివరించాడు. శ్రీలంకతో పాటు మలేసియా వంటి దేశాలు చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నాయన్నాడు.
మీ దేశంలో ఆతిథ్యం అపూర్వం
కాగా, పాకిస్థాన్ లో 2004, 2006లో పర్యటించాడు హర్భజన్. ఆ సమయంలో అద్భుత ఆతిథ్యం దక్కిందన్నాడు. బయట భోజనం చేసిన ప్రతిసారీ వారు డబ్బులు తీసుకోలేదన్నాడు. కొందరు శాలువాలు బహుమతిగా ఇచ్చారని తెలిపాడు. కోహ్లితో పాటు స్టార్ ఆటగాళ్లను పాక్ అభిమానులు ప్రత్యక్షంగా చూడలేకపోతున్నారని, తనకు చాలా బాధగా ఉందన్నాడు. ఇది పాక్ అభిమానుల తప్పు కాదని పాకిస్థాన్ లోని పరిస్థితుల ప్రభావం అని వివరించాడు.