Begin typing your search above and press return to search.

అతడు లెగ్ స్పిన్నర్ టు పేసర్ టు ఆల్ రౌండర్.. కారణమేంటి?

ప్రస్తుతం మనకు తెలిసిన అతడు వేరు.. తెలియని విశేషాలు ఎన్నో..?

By:  Tupaki Desk   |   11 Oct 2024 8:30 PM GMT
అతడు లెగ్ స్పిన్నర్ టు పేసర్ టు ఆల్ రౌండర్.. కారణమేంటి?
X

టీమ్ ఇండియాలో కెప్టెన్ అయ్యే చాన్స్ ఉన్న కొద్దిమంది ఆటగాళ్లలో అతడొకడు.. దూకుడైన బ్యాటింగ్ మాత్రమే కాదు.. పదునైన పేస్ బౌలింగ్ కూడా చేయగల సమర్థుడతడు.. టి20, వన్డేల్లో అతడి పాత్ర ఏమిటో అందరికీ తెలుసు.. కానీ, గాయాల బెడద లేకుంటే టెస్టుల్లోనూ మ్యాచ్ విన్నరే. అలాంటి ప్లేయర్ ఈ రోజు 31వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ప్రస్తుతం మనకు తెలిసిన అతడు వేరు.. తెలియని విశేషాలు ఎన్నో..?

ఆటిట్యూడ్ కా బాప్

టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 1993 అక్టోబరు 11న జన్మించాడు. పదేళ్ల కిందటే జాతీయ జట్టులోకి వచ్చిన అతడు మధ్యలో గాయంతో ఏడాది పాటు మైదానానికి దూరమయ్యాడు. 2023లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో హార్దిక్ మధ్యలోనే వైదొలగడం జట్టును దెబ్బకొట్టింది. అయితే, ఈ ఏడాది జరిగిన టి20 ప్రపంచ కప్ ఫైనల్స్ లో ఫైనల్ ఓవర్ ను అద్భుతంగా వేసి దేశానికి కప్ అందించాడు. చివరి ఓవర్‌లో 16 పరుగులు అవసరం కాగా.. మిల్లర్ ను ముందే ఔట్ చేశాడు. మ్యాచ్ లో పాండ్యా 3 ఓవర్లలో 20 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. కాగా, 145 కిలోమీటర్ల వేగం కూడా అందుకోగల పాండ్యా ఒకప్పుడు లెగ్ స్పిన్నర్ అంటే ఆశ్చర్యపోవాల్సిందే. కానీ, ఓ సందర్భం అతడి కెరీర్ ను మార్చింది.

క్రికెట్ కోసం సూరత్ నుంచి బరోడాకు

హార్దిక్ పాండ్యా సొంత నగరం సూరత్. అతడి తండ్రి హిమాన్షు పాండ్యా తన ఇద్దరు కుమారుడు కృనాల్, హార్దిక్ లు క్రికెట్‌ లో ఎదిగేందుకు బరోడాకు మారాడు. భారత మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కిరణ్ మోరే అకాడమీలో చేర్చించాడు. హార్దిక్ వ్యక్తిగత కోచ్ జితేంద్రకుమార్. ఏడేళ్ల వయసులోనే అతడి వద్ద చేరాడు. అప్పటికి బ్యాటింగ్ మాత్రమే చేసేవాడు. చాలా ఆలస్యంగా బంతిని పట్టాడు. అయితే, అది కూడా పేసర్ గా కాదు.. లెగ్ స్పిన్నర్ గా. తర్వాత ఫాస్ట్ బౌలర్‌ గా హార్దిక్ సామర్థ్యాన్ని మరో చిన్ననాటి కోచ్ సనత్ కుమార్ గుర్తించాడు. నెట్ సెషన్ లో లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌ మెన్ ప్రాక్టీస్ కోసం కొంతమంది ఫాస్ట్ బౌలర్లు అవసరం అయ్యారు. రెగ్యులర్ ఫాస్ట్ బౌలర్లంతా అలసిపోవడంతో సనత్ కుమార్ నెట్స్‌ లో బౌలింగ్ చేయమని హార్దిక్ ను అడిగాడు. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో బంతిని విసరడంతో పాటు అతడి నియంత్రణను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో సనత్ కుమార్ శిక్షణ ప్రారంభించాడు.

మొదటినుంచి హార్డ్ హిట్టరే..

హార్దిక్ మొదటి నుంచి హార్డ్ హిట్టరేనట. అంతేకాదు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌ మెన్ కూడా. గంటల తరబడి బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉందని అతడి మాజీ కోచ్ లు తెలిపారు. 2009లో విజయ్ హజారే ట్రోఫీ అండర్-16 టోర్నమెంట్‌లో హార్దిక్ 8 గంటల పాటు బ్యాటింగ్ చేసి 391 బంతుల్లో 228 పరుగులు చేశాడని.. 29 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడని వివరించారు. డు. ఈ ఇన్నింగ్స్ తోనే హార్దిక్ కూచ్ బెహార్ ట్రోఫీ అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడట.

భవిష్యత్ కెప్టెన్ అతడే

హార్దిక్ గాయాల బెడద లేకుంటే దేశానికి మరింత సేవ చేసేవాడే. నిరుడు టి20లకు కెప్టెన్ కూడా అయ్యాడు. ఇంతలోనే జట్టు మేనేజ్ మెంట్ మారడంతో హార్దిక్ బదులు సూర్యకు కెప్టెన్సీ ఇచ్చారు. అయితేనేం.. మరో రెండేళ్లలో అయినా హార్దిక్ వన్డే, టి20 కెప్టెన్ అవుతాడనడంలో సందేహం లేదు.