బయోపిక్ గా హార్దిక్ పాండ్యా జీవితం.. ఏడాదిలోనే అంతా మారిపోయింది
అన్నయ్యతో కలిసి కేవలం బన్నులు తిని కడుపు నింపుకొంటూ క్రికెట్ ఆడిన అతడు ఇప్పుడు 7 కోట్ల రూపాయిల వాచీ పెట్టుకుంటున్నాడు..
By: Tupaki Desk | 20 March 2025 8:00 PM ISTఅన్నయ్యతో కలిసి కేవలం బన్నులు తిని కడుపు నింపుకొంటూ క్రికెట్ ఆడిన అతడు ఇప్పుడు 7 కోట్ల రూపాయిల వాచీ పెట్టుకుంటున్నాడు..
గ్రౌండ్ కు వెళ్లేందుకు కనీసం బైక్ కూడా లేని అతడు ఇప్పుడు ఖరీదైన కార్లలో టూర్లు వేస్తున్నాడు..
పదేళ్లలో జీవితం అంతా మారిపోయింది.. కానీ, గత ఏడాది కాలం మాత్రం అత్యంత గడ్డుగా గడిచింది.. ఓవైపు చాంపియన్ గా నిలిపిన జట్టును వదులుకుని.. తాను పెద్దవాడిని కావడానికి ఉపయోగపడిన జట్టుకు వస్తే అక్కడ అవమానాలు ఎదురయ్యాయి..
ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి తనను దాదాపు మోసం చేసినంత పనిచేస్తే వివాహ బంధాన్ని.. ముద్దుల కొడుకును వదులుకోవాల్సి వచ్చింది.. దీనికితోడు నీడలా వెన్నంటే గాయాలు.. మరొకరైతే ఏమయ్యేవారో కానీ.. అతడు మాత్రం గట్టిగా నిలబడ్డాడు.. ఏడాదిలో రెండుసార్లు ప్రపంచ చాంపియన్ గా నిలిచాడు..
ఇదంతా టీమ్ ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా గురించి.. ఇప్పుడు అతడి జీవితంపై బయోపిక్ లేదా డాక్యుమెంటరీ తీయాలంటున్నాడు మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్. దీనికి కారణాలు కూడా చెబుతున్నాడు.
గత ఐపీఎల్ సీజన్ లో హార్దిక్ గుజరాత్ ను వదిలి ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, రోహిత్ శర్మ స్థానంలో మరొకరిని కెప్టెన్ గా ఊహించుకోలేని ముంబై ఫ్యాన్స్.. హార్దిక్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. హార్దిక్ ఆటిట్యూడ్ కూడా దీనికి కొంత కారణమైంది.
జట్టు వరుస ఓటములతో పాటు ఫీల్డ్ లో రోహిత్ శర్మను అవమానించాడంటూ హార్దిక్ ను ముంబై ఫ్యాన్స్ గేలి చేశారు. తర్వాత హార్దిక్ తీరు మార్చుకున్నాడు. కానీ, అతడు ఎక్కడా ఫ్యాన్స్ ను కానీ, వారి ప్రవర్తనను కానీ నిందించలేదు. మ్యాచ్ ల తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లలోనూ హార్దిక్ తొణలేదు బెణకలేదు.
గత ఏడాది ఐపీఎల్ తర్వాత వెంటనే జరిగిన టి20 ప్రపంచ కప్ లో హార్దిక్ మెరుగైన ప్రదర్శన చేశాడు. మరీ ముఖ్యంగా ఫైనల్లో చివరి ఓవర్ ను అద్భుతంగా వేసి కప్ అందించాడు. తాజాగా చాంపియన్స్ ట్రోఫీలోనూ హార్దిక్ ప్రధాన పేసర్ మొహమ్మద్ షమీతో కొత్త బంతిని పంచుకున్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లపై కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు హార్దిక్ సగర్వంగా ఐపీఎల్ ఆడేందుకు వెళ్తున్నాడు.
అందుకనే అతడి జీవితాన్ని తప్పకుండా బయోపిక్ లేదా డాక్యుమెంటరీ తీయొచ్చని కైఫ్ వ్యాఖ్యానించాడు.
కాగా, టీమ్ ఇండియా క్రికెటర్లలో ఇప్పటివరకు సచిన్, ధోనీ బయోపిక్ లు వచ్చాయి. వీటిలో సచిన్ పై తీసినది డాక్యుమెంటరీ మాదిరిగా ఉంది. ధోనీపై తీసిన సినిమా మాత్రం సూపర్ హిట్ అయింది.