పాండ్యా.. మొన్న వైస్ కెప్టెన్.. నిన్న ‘కెప్టెన్’.. నేడు ఏమీ లేదు
శ్రీలంకతో సిరీస్ కు ముందు భారత జట్టు విషయంలో పెద్ద చర్చనే జరిగింది.
By: Tupaki Desk | 20 July 2024 12:30 AM GMTశ్రీలంకతో సిరీస్ కు ముందు భారత జట్టు విషయంలో పెద్ద చర్చనే జరిగింది. మూడు టి20లు ఆడాల్సిన సిరీస్ కు కెప్టెన్ ఎవరనేది సందిగ్ధం నెలకొంది. వన్డేలకు ఎలాగూ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తిరిగొస్తాడు కాబట్టి.. పొట్టి ఫార్మాట్ లో నడిపించేది ఎవరనే చర్చ జరిగింది. దీనికి అందరూ ఊహించిన సమాధానం ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. ఐపీఎల్ లో, గతంలోనూ టి20ల్లో టీమ్ ఇండియాకు కెప్టెన్ గా పనిచేసిన పాండ్యానే తదుపరి కెప్టెన్ గానూ భావించారు. కానీ.. అనూహ్యంగా సూర్య కుమార్ యాదవ్ పేరు ప్రకటించారు. మరి దీనివెనుక ఏం జరిగింది...? మొన్నటివరకు వైస్ కెప్టెన్ అయిన ఆటగాడు.. ఇప్పుడు అదేమీ లేకుండా ఎలా మిగిలాడు?
మొన్న వైస్ అయినప్పటికీ..
పాండ్యా భారత్ విజేతగా నిలిచిన మొన్నటి టి20 ప్రపంచ కప్ లో జట్టుకు వైస్ కెప్టెన్. 2022 టి20 ప్రపంచ కప్ అనంతరం రోహిత్ ను కాదని పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చారు. అయితే, రోహిత్ తిరిగి రావడంతో మళ్లీ పాండ్యాను వైస్ చేశారు. సరే.. రోహిత్ తప్పుకొనడంతో పాండ్యానే తదుపరి పూర్తి స్థాయి కెప్టెన్ అని భావించారు. కానీ, జరిగింది వేరు. కొత్త హెడ్ కోచ్ గంభీర్ వస్తూ వస్తూనే హార్దిక్ స్థానంలో సూర్య సారథ్యం వైపు మొగ్గుచూపాడు. పాండ్యాకు కనీసం వైస్ కెప్టెన్సీ కూడా ఇవ్వలేదు. దీంతో హార్దిక్ టి20 జట్టులో సాధారణ ఆటగాడిగా మిగిలాడు.
ఆటగాళ్లు మొగ్గుచూపలేదా?
రోహిత్ స్థానంలో పాండ్యా కంటే సూర్యనే బెటర్ అని జట్టులోని ఆటగాళ్లు భావించినట్లు సమాచారం. సూర్య అయితేనే స్వేచ్ఛ ఇస్తాడని వారు చెప్పినట్లు తెలిసింది. మరోవైపు సూర్యకు కూడా ఫిట్ నెస్ సమస్యలు ఉన్నాయి. అయితే, అవి హార్దిక్ అంత మాత్రం కాదు. దీంతోనే సెలక్టర్లు, గంభీర్ కూడా సూర్యను కెప్టెన్ చేశారు. కాగా, ఐపీఎల్ లో హార్దిక్ ఈ ఏడాది ముంబై ఇండియన్స్ కు సారథ్యం వహించాడు. గుజరాత్ టైటాన్స్ ను రెండేళ్లు చక్కగానే నడిపిన అతడు ఈసారి ముంబైకి వచ్చాడు. కానీ, జట్టు దారుణ ప్రదర్శన చేసింది. ఇదికూడా పాండ్యాకు కొంత దెబ్బనే.