ప్రపంచకప్‌లో భారత జట్టుకు బిగ్ షాక్
గత నెల 19న బంగ్లాతో మ్యాచ్‌లో బౌలింగ్‌కు వచ్చిన హార్దిక్.. బంతి వేస్తూ వేస్తూ చీలమండ గాయానికి గురైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 4 Nov 2023 12:53 PM GMTప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు ఇప్పటికే సెమీస్ చేరిపోయింది కదా. ఇంకా షాక్ ఏంటి అనుకుంటున్నారా? ఏడుకు ఏడు మ్యాచ్‌ల్లో నెగ్గిన టీమ్ ఇండియాకు ఇప్పుడు మరే జట్టూ షాక్ ఇవ్వలేదు కానీ.. ఒక కీలక ఆటగాడి విషయంలోనే మన జట్టుకు పెద్ద షాక్ తగిలింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడి జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్య.. పూర్తిగా టోర్నీకే అందుబాటులో లేకుండా పోయాడు. గత నెల 19న బంగ్లాతో మ్యాచ్‌లో బౌలింగ్‌కు వచ్చిన హార్దిక్.. బంతి వేస్తూ వేస్తూ చీలమండ గాయానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో అర్ధంతరంగా ఆ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. తర్వాతి మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చేస్తాడులే అనుకుంటే.. ఒక్కో మ్యాచ్‌కు దూరమవుతూ వచ్చాడు. ఎలాగూ భారత జట్టుకు సెమీస్ బెర్తు ఖరారైంది కాబట్టి.. లీగ్ దశ మొత్తానికి దూరమైనా పర్వాలేదులే అనుకున్నారు.
కానీ ఇప్పుడు అతను మొత్తంగా టోర్నీకి దూరమయ్యాడన్న వార్త టీమ్ ఇండియాకు పెద్ద షాకే. భారత జట్టు సులువుగానే సెమీస్ చేరింది కానీ.. అక్కడ్నుంచి జర్నీ అంత తేలిగ్గా ఉండదు. నాకౌట్‌కు వచ్చే ఏ జట్టూ అంత తేలిగ్గా వదిలిపెట్టదు. కాబట్టి హార్దిక్ లాంటి కీలక ఆటగాడు లేకపోవడం భారత జట్టుకు దెబ్బే. హార్దిక్ ఉంటే మిడిలార్డర్లో ఒక నమ్మకమైన బ్యాట్స్‌మన్ ఉన్నట్లే. అలాగే ఒక అదనపు పేస్ బౌలర్‌ను కలిగి ఉన్నట్లే. ఫీల్డింగ్‌లోనూ అతను కీలకమే.
ఇద్దరు ఆటగాళ్ల పని అతనొక్కడే చేస్తాడు. దాని వల్ల అదనంగా ఒక బౌలర్ లేదా బ్యాట్స్‌మన్‌ను ఎంచుకోవడానికి అవకాశముంటుంది. ఇప్పుడు ఆ సౌలభ్యాన్ని భారత్ కోల్పోయింది. హార్దిక్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకున్నారు. కానీ హార్దిక్ స్థానాన్ని ప్రసిద్ధే కాదు.. ఇండియాలో మరే ఆటగాడూ భర్తీ చేయలేని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. హార్దిక్ లేకపోవడంతో సూర్యకుమార్ యాదవ్‌కు మిగతా మ్యాచ్‌ల్లోనూ ఛాన్స్ దక్కబోతున్నట్లే.