Begin typing your search above and press return to search.

విడాకుల వేళ.. టీమిండియాతో ప్రయాణించని ఆల్ రౌండర్

అయితే, హార్దిక్‌ పాండ్యా భారత్ నుంచి బయల్దేరి లండన్ లో ఆగినట్లు సమాచారం.

By:  Tupaki Desk   |   26 May 2024 8:22 AM GMT
విడాకుల వేళ.. టీమిండియాతో ప్రయాణించని ఆల్ రౌండర్
X

బహుశా ఇటీవలి కాలంలో ఏ భారత క్రికెటర్ కూ ఇలాంటి పరిస్థితి ఎదురై ఉండదు. అటు జట్టు పరంగా.. ఇటు ఫామ్ పరంగా.. చివరకు వ్యక్తిగతంగానూ అతడు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాడు. అసలే అతడికి గాయాల బెడద ఎక్కువ. ఈ కారణంగానే నాలుగేళ్లలో దాదాపు మూడేళ్లు టీమిండియాకు దూరమయ్యాడు. ఆఖరికి ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచ కప్ నుంచి కూడా ఔటయ్యాడు. గాయం నుంచి కోలుకుని ఐపీఎల్ ఫ్రాంచైజీ కెప్టెన్సీ చేపట్టిన అతడు ఆటగాడిగా, కెప్టెన్ గా ఘోర అవమానాన్ని మూటగట్టుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ప్రేమించి పెళ్లాడిన భార్యా నుంచి కూడా విడిపోనున్నాడు. ఇది అతడి కెరీర్ పై పెద్ద దెబ్బ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జూన్ 5 తొలి మ్యాచ్ కు టి20 ప్రపంచ కప్‌ కోసం టీమిండియా విడతల వారీగా అమెరికా ప్రయాణం అవుతోంది. మొదటి బ్యాచ్ లో భాగంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు 360 డిగ్రీ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్, స్పిన్నర్లు కుల్‌దీప్‌ యాదవ్, ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్, శివమ్‌ దూబె, పేసర్లు బుమ్రా, మహ్మద్‌ సిరాజ్, అర్ష్‌ దీప్‌ సింగ్, ఖలీల్‌ అహ్మద్, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ శనివారం విమానం ఎక్కారు. అయితే స్టార్ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లితో పాటు ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ చేరిన జట్లలోని కొందరు ఆటగాళ్లు ఈ బ్యాచ్ లో లేరు. జూన్‌ 2న ఆరంభమయ్యే టి20 ప్రపంచకప్‌లో భారత్‌ తన తొలి మ్యాచ్‌లో జూన్‌ 5 ఐర్లాండ్‌ తో తలపడనుంది.

మరి హార్దిక్ ఎక్కడ?

టి20 ప్రపంచ కప్ లో టీమిండియా వైస్ కెప్టెన్ ఆల్ రౌండర్ హార్దిక్‌ పాండ్య. అయితే, అతడు తొలి బ్యాచ్ తో పాటు అమెరికా వెళ్లలేదు. వాస్తవానికి ఐపీఎల్ లో హార్దిక్ సారథ్యం వహించిన ముంబై ఇండియన్స్ ఘోర ప్రదర్శనతో లీగ్ దశలోనే నిష్క్రమించింది. అసలు ప్లేఆఫ్స్ కు వెళ్లదని ముందే తేలిపోయింది. చాలా సమయం దక్కినా.. హార్డిక్ అమెరికా విమానం ఎక్కలేదు. అయితే, హార్దిక్‌ పాండ్యా భారత్ నుంచి బయల్దేరి లండన్ లో ఆగినట్లు సమాచారం. భార్య నటాషా స్టాంకోవిచ్‌ తో హార్దిక్ విడిపోతున్నట్లు ప్రచారం పెద్దఎత్తున సాగుతోంది. ఇక్కడినుంచే పాండ్యా అమెరికా వెళ్తాడని తెలుస్తోంది.

కోహ్లి చిక్కుకుపోయాడు..ఐపీఎల్ ఎలిమినేర్ లో బెంగళూరు పరాజయంతో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి కూడా అమెరికా వెళ్లేంత సమయం దొరికింది. కానీ, అతడు కూడా తొలి బ్యాచ్ తో వెళ్లలేదు. కోహ్లి వీసా పేపర్ వర్క్ పూర్తికాకపోవడమే దీనికి కారణం.