షాకింగ్.. కివీస్ తో మ్యాచ్ ఆల్ రౌండర్ దూరం.. కోలుకునేదెప్పుడో?
స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కివీస్ తో మ్యాచ్ కు దూరమయ్యాడు. పాండ్యాను బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కు పంపుతున్నారు.
By: Tupaki Desk | 20 Oct 2023 6:20 AMపేస్ బౌలింగ్ లో అవసరమైతే పూర్తి ఓవర్ల కోటా వేయగలడు అతడు.. బ్యాటింగ్ లో ఆరో స్థానంలో అదరగొట్టగలడు అతడు.. ఫీల్డింగ్ లోనూ మహా చురుకు.. మొత్తానికి కసికసిగా గేమ్ ఆడడంలో సిద్ధహస్తుడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ లో టీమిండియాకు చాలా కీలకం. అందులోనూ మూడో పేసర్ గా న్యాయం చేస్తున్న అతడు.. ఈ కప్ ముగిశాక వన్డే కెప్టెన్ అయినా ఆశ్చర్యం లేదు. కానీ, అనూహ్యంగా గాయపడ్డాడు. జట్టును షాక్ కు గురిచేశాడు.
అతడు లేకుంటే..
దిగ్గజ కపిల్ దేవ్ రిటైర్మెంట్ అయి సరిగ్గా 30 ఏళ్లు. అప్పటినుంచి టీమిండియా సమర్థుడైన పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ కోసం నిరీక్షిస్తోంది. ఈ మూడు దశాబ్దాల్లో ఎందరో వచ్చారు. వెళ్లారు. కానీ, కపిల్ స్థాయికి దగ్గరగా కూడా రాలేకపోయారు. కానీ, హార్దిక్ పాండ్యా మాత్రం కాస్తోకూస్తో న్యాయం చేస్తున్నాడు. గాయాల బెడద లేకుంటే అతడు ఇప్పటికే మేటి ఆటగాడిగా ఎదిగేవాడు. కానీ నాలుగేళ్ల కిందట ఆసియా కప్ లో వెన్నునొప్పి బారినపడ్డాడు. ఆ తర్వాత మరికొన్ని గాయాలు. కొన్నేళ్ల పాటు జట్టుకు దూరమయ్యాడు. మళ్లీ కోలుకుని జట్టులోకి వచ్చాడు. మధ్యలో ఒకటీరెండు గాయాలు ఇబ్బంది పెట్టినా, రికవర్ అయ్యాడు. ఐపీఎల్ లో ఏకంగా గుజరాత్ టైటాన్స్ టీమ్ కు కెప్టెన్ కూడా అయ్యాడు. ఆ జట్టును విజేతగానూ నిలిపాడు.
ప్రపంచ కప్ లో కీలకం
ప్రపంచ కప్ లో భారత్ కు ఆల్ రౌండర్ గా హార్దిక్ సేవలు అత్యంత అవసరం. ఇప్పటివరకు మన జట్టు నాలుగు మ్యాచ్ లు ఆడితే మూడింట్లో అతడు వికెట్లు పడగొట్టాడు. పిచ్ లు పేస్‌కు అనుకూలిస్తాయని భావిస్తే.. మూడో పేసర్ గా హార్దిక్ నే నమ్ముకుంటున్నాడు కెప్టెన్ రోహిత్. దీనికి తగ్గట్లే హార్దిక్ ఆస్ట్రేలియాపై కీలక వికెట్ పడగొట్టాడు. అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ తో మ్యాచ్‌ల్లో రెండేసి వికెట్లు సాధించాడు. పేసర్ అయిన శార్దూల్ కంటే హార్దిక్ మెరుగ్గా బౌలింగ్ చేస్తుండడం గమనార్హం.
ఏమిటా గాయం..
గురువాం బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సందర్భంగా తొమ్మిదో ఓవర్లో బౌలింగ్ చేసిన హార్దిక్ రెండు బంతులు వేశాడు. మూడో బంతిని లిటన్ దాస్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడగా కుడి కాలితో ఆపబోయి విఫలమయ్యాడు. ఆ క్రమంలో హార్దిక్ చీలమండ బెణికింది. జారి కిందపడ్డ అతడు తీవ్రమైన నొప్పితో కనిపించాడు. ప్రాథమిక చికిత్స అనంతరం బౌలింగ్ కు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో మైదానాన్ని వీడాడు. మిగిలిన మూడు బంతులను కోహ్లి వేశాడు. స్కానింగ్ చేయించగా.. పెద్ద గాయమేం కాలేదని తేలినట్లు మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ చెప్పాడు.
న్యూజిలాండ్ తో మ్యాచ్ కు దూరం
ప్రపంచ కప్ లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ వంటి పెద్ద జట్లతో టీమిండియా ఆ నెల 22, 29న ఆడాల్సి ఉంది. దీనికిముందే పెద్ద దెబ్బ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కివీస్ తో మ్యాచ్ కు దూరమయ్యాడు. పాండ్యాను బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కు పంపుతున్నారు. అతడి చీలమండ గాయాన్ని వైద్యులు పర్యవేక్షిస్తారు. ఇంజక్షన్ తో హార్దిక్ కోలుకునే చాన్సుందని వైద్యులు తెలిపినట్లు బీసీసీఐ పేర్కొంది. కాగా, ఇంగ్లండ్ తో మ్యాచ్ కు మరో 9 రోజుల సమయం ఉంది. అప్పటికైనా హార్దిక్ కోలుకుంటాడని ఆశిద్దాం. ఒకవేళ గాయం తీవ్రమైనది అయినా, ఎందుకులే రిస్క్ అని టీమ్ మేనేజ్ మెంట్ భావించినా హార్దిక్ మిగతా మ్యాచ్ లు ఆడడం కష్టమే.