Begin typing your search above and press return to search.

టీమిండియాకు బిగ్ షాక్.. ప్రపంచ కప్ నుంచి స్టార్ ఆల్ రౌండర్ ఔట్?

ఈ ప్రపంచ కప్ లో జట్టుకు ఎక్స్ ఫ్యాక్టర్ గా ఉంటాడని భావించిన ఆల్ రౌండర్ హార్దిక్‌ పాండ్యా మొన్న బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో మూడు బంతులే వేసి వైదొలగాడు

By:  Tupaki Desk   |   26 Oct 2023 8:34 AM GMT
టీమిండియాకు బిగ్ షాక్.. ప్రపంచ కప్ నుంచి స్టార్ ఆల్ రౌండర్ ఔట్?
X

వన్డే ప్రపంచ కప్ లో ఐదు వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియాకు బిగ్ షాక్ తప్పదా? సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ కప్ లో టైటిట్ పై కన్నేసిన రోహిత్ శర్మ సేనకు ఊహించని దెబ్బ తగలనుందా..? బౌలింగ్ లో కీలకంగా నిలుస్తూ, అవసరమైతే బ్యాట్ తో దుమ్ము రేపే స్టార్ ఆల్ రౌండర్ జట్టుకు దూరం కానున్నాడా? పరిణామాలు చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తోంది కూడా. ప్రపంచ కప్ ముందు వరకు వరుసగా ఆటగాళ్ల గాయాలు వేధించినప్పటికీ.. మెగా టోర్నీ ముందర అందరూ ఫిట్ నెస్ సాధించడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. కానీ, ఇప్పుడు స్టార్ ఆల్ రౌండర్ ఫిట్ నెస్ మాత్రం అందరినీ కలవరపరుస్తోంది.

చిన్నదే అనుకుంటే.. పెద్దదైందట

ఈ ప్రపంచ కప్ లో జట్టుకు ఎక్స్ ఫ్యాక్టర్ గా ఉంటాడని భావించిన ఆల్ రౌండర్ హార్దిక్‌ పాండ్యా మొన్న బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో మూడు బంతులే వేసి వైదొలగాడు. పుణెలో జరిగిన నాటి మ్యాచ్ లో రనప్ చేస్తూనే కింద పడ్డాడు. దీంతో చీలమండకు గాయమైంది. అనంతరం ధర్మశాలలో న్యూజిలాండ్‌ తో జరిగిన మ్యాచ్‌ కు దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) పర్యవేక్షణలో ఉన్నాడు. కాగా, ఆదివారం ఇంగ్లండ్ తో మ్యాచ్ ఆడబోవడం లేదని తొలుత ప్రకటించారు. అయితే, అతడు టోర్నీ మొత్తానికి దూరమయ్యే ప్రమాదముందని తెలుస్తోంది.

హార్దిక్ గాయం అనుకున్నదాని కంటే తీవ్రమైందని భావిస్తుండడమే దీనికి కారణం. వాస్తవానికి ఇంగ్లాండ్‌తో స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ గానైనా హార్దిక్ ను ఆడించాలని అనుకున్నారు. కానీ, ఎందుకొచ్చిన రిస్క్ అని భావించిన టీమ్ మేనేజ్ మెంట్ ఇంగ్లండ్, శ్రీలంకతో మ్యాచ్ లకు దూరం పెట్టింది.

లిగ్మెంట్ లో చీలిక.. అందుకే తీవ్రం

హార్దిక్ గాయం తొలుత చీలమండ గాయమని భావించారు. కానీ, అది లిగ్మెంట్ (అస్థి బంధనం)లో చీలికగా తేలిందట. అదే నిజమైతే గనుక కొన్ని వారాల పాటు హార్దిక్ జట్టుకు దూరమవుతాడు. కనీసం అతడికి నెల రోజుల విశ్రాంతి కావాలి. అంటే ఈ ప్రపంచ కప్ టోర్నీలో మనం మళ్లీ హార్దిక్ ను మైదానంలో చూడనట్లే. కాగా, హార్దిక్ గాయంపై బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.