Begin typing your search above and press return to search.

కెప్టెన్ ''అట్టర్ ఫ్లాప్''.. వరల్డ్ కప్ నుంచి ఔట్?

ఇదే కాదు.. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో అతడి తీరు అంతా చర్చనీయాంశం అవుతోంది

By:  Tupaki Desk   |   17 April 2024 12:30 PM GMT
కెప్టెన్ అట్టర్ ఫ్లాప్.. వరల్డ్ కప్ నుంచి ఔట్?
X

చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్టుతో సొంతగడ్డపై మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుందో జట్టు.. ఇది సరైన నిర్ణయం కాదు.. పోనీ.. జట్టు మేనేజ్ మెంట్ ఆలోచన అని అనుకుందాం.. ఆ కెప్టెన్ బౌలింగ్ చేసి జట్టులో అందరికంటే అత్యధిక పరుగులు ఇచ్చాడు. 2 వికెట్లు తీసినా 3 ఓవర్లే వేసి 43 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక చివరి ఓవర్లలో అతడి బౌలింగ్ లో ప్రత్యర్థి వెటరన్ ఆటగాడు మూడు సిక్స్ లు కొట్టి 20 పరుగులు రాబట్టాడు. అంతకుముందు ఓవర్ లో రెండు వైడ్ బాల్స్ కు రివ్యూలు అడిగి విఫలమయ్యాడు. ఇక బ్యాటింగ్ లో కీలక సమయంలో దిగి 6 బంతుల్లో 2 పరుగులే చేసి ఔటయ్యాడు. ఇదే కాదు.. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో అతడి తీరు అంతా చర్చనీయాంశం అవుతోంది.

ఆట కంటే వ్యవహార శైలితోనే..

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 17 సీజన్ లో చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఒకటీ రెండు తప్ప మంచి ఇన్నింగ్స్ లు ఆడలేదు. బౌలింగ్ కూడా అంతంతమాత్రమే. రెగ్యులర్ బౌలర్ కానప్పటికీ తొలి ఓవర్ వేయడం హార్దిక్ కు ఓ అలవాటు. అయితే, కాస్త లక్ తో వికెట్లు పడగొట్టినంత కాలం ఇలాంటివి ఎన్ని చేసినా ఏమీ కాదు. ఎప్పుడైతే విఫలం అవుతాడో అప్పుడే విమర్శలు వస్తాయి. సరిగ్గా ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. ఒకప్పటి ముంబై ఆల్ రౌండర్ అయిన హార్దిక్ గుజరాత్ టైటాన్స్ కు వెళ్లాక ఆ జట్టును తొలి సీజన్ లోనే విజేతగా నిలిపాడు. మరుసటి (గత ఏడాది) సీజన్ లో త్రుటిలో కప్ చేజారింది. అయితే, ఈ సీజన్ కు కెప్టెన్ గా వెటరన్ రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ ను తీసుకొచ్చింది ముంబై. రెండు సీజన్లుగా ముంబై వైఫల్యం, ఆటగాళ్ల ఫామ్ లేమి ఈ నిర్ణయానికి కారణం అయి ఉండవచ్చు. కానీ, ఊహించింది ఒకటి. జరుగుతున్నది ఒకటి అయింది. హార్దిక్ వైఫల్యం అవుతుండగా.. రోహిత్ మాత్రం చెలరేగి ఆడుతున్నాడు.

ప్రపంచ కప్ నకు కష్టమే?

టి20 ప్రపంచ కప్ నకు త్వరలో టీమిండియా ఎంపిక జరగనుంది. ఐదారు నెలల కిందట జరిగిన వన్డే ప్రపంచ కప్ లో హార్దిక్ గాయంతో తప్పుకొన్నాడు. ఆ తర్వాత ఐపీఎల్ ద్వారానే మళ్లీ క్రికెట్ లోకి వచ్చాడు. అయితే, టి20 ప్రపంచ కప్ నకు మాత్రం అతడి ఎంపిక కష్టమే. వాస్తవానికి మొన్నటివరకు టీమిండియా టి20 కెప్టెన్ హార్దిక్ పాండ్యానే. గాయాల బెడద, ఫామ్ లేమి కారణాలు కాకుంటే ఇప్పటికీ అతడినే కెప్టెన్ గా ఉంచేవారేమో? మంచి ఆల్ రౌండర్ అయినప్పటికీ హార్దిక్ తన పాత్రకు న్యాయం చేయడం లేదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్ లలో పేల‌వ‌మైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో హార్దిక్ ఒక్క మ్యాచ్ లోనూ పూర్తి కోటా (4 ఓవ‌ర్లు) వేయ‌లేదు. గాయం నుంచి అతడు కోలుకోలేద‌ని మాజీలు అంటున్నారు. ఇది వాస్తవమే అయితే.. హార్దిక్‌ కు స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు. అత‌డిని కేవ‌లం బ్యాట‌ర్‌ గానే జ‌ట్టులోకి తీసుకునే చాన్స్ లేదు.

కెప్టెన్ కాదు.. జట్టులోనే లేడు..

టీమిండియా టెస్టు కెప్టెన్ రోహిత్‌ శర్మను మళ్లీ టి20 కెప్టెన్ చేసే యోచనలో ఉన్నట్లు తెలిసిందే. రోహిత్, కోచ్ ద్రావిడ్‌, సెల‌క్షన్ క‌మిటీ ఇటీవల స‌మావేశమై హార్దిక్ ను టి20ల్లోకి తీసుకోవాలా, వ‌ద్దా? అని చర్చించినట్లు సమాచారం. అతడి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్న శివ‌మ్ దూబే పేరును పరిశీలించాలన్న వాదన వస్తోంది. ఈ నేపథ్యంలో లీగ్ లో మిగతా మ్యాచ్‌ ల‌లో హార్దిక్ అద్భుతంగా రాణిస్తే తప్ప టి20 ప్రపంచ కప్ జట్టులో ఉంటాడని భావించలేం.

కొసమెరుపు: హార్దిక్ ముంబైకి తిరిగొచ్చాక ఏదీ అనుకూలంగా లేదు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను తొలి మ్యాచ్ లలో ఫీల్డింగ్ ప్లేస్ మెంట్ లో లాంగ్ లో ఉంచడం, కాస్త దురుసుగా ప్రవర్తించడంతో హార్దిక్ ను ముంబై అభిమానులు గేలి చేశారు. అసలే ఫామ్ కోల్పోయాడంటే.. జట్టు వరుస వైఫల్యాలను ఎదుర్కొంటోంది. ఇది కాక.. సొంత కజిన్ హార్దిక్ అతడి అన్నను రూ.4 కోట్లకు మోసం చేశాడు. ఇప్పుడు ప్రపంచ కప్ లోనూ చోటు దక్కకుంటే.. నిజంగా టైమ్ బ్యాడ్ అనే అనుకోవాలి.