ఒక్క మ్యాచ్..11 కోట్లు..హైదరాబాద్ లో భారత పేసర్ కు దసరా బొనాంజా
ఒక్క మ్యాచ్.. ఒక్కటంటే ఒక్కటే మ్యాచ్.. రూ.11 కోట్లు వచ్చి వాలతాయి.. ఇదీ ఓ భారత క్రికెటర్ పరిస్థితి.
By: Tupaki Desk | 12 Oct 2024 12:30 AM GMTఒక్క మ్యాచ్.. ఒక్కటంటే ఒక్కటే మ్యాచ్.. రూ.11 కోట్లు వచ్చి వాలతాయి.. ఇదీ ఓ భారత క్రికెటర్ పరిస్థితి. కానీ, వాతావరణం చూస్తుంటే అతడికి ఆ డబ్బు వచ్చేలా లేదు. టీమ్ ఇండియా ప్రస్తుతం బంగ్లాదేశ్ తో టి20 సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలి రెండు టి20లలో ఘన విజయం సాధించింది. మూడో టి20 మన హైదరాబాద్ లో దసరా పండుగ రోజు జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆ క్రికెటర్ గనుక తుది జట్టులో ఉంటే అతడికి రూ.11 కోట్లు దక్కుతాయి. అంటే దసరా బొనాంజా అన్నమాట
18వ సీజన్ లో..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ పలు మార్పులకు లోను కానుంది. దీనికి మెగా వేలం నవంబరులో జరగనుంది. ఇప్పటికే మెగా వేలం రూల్స్ వచ్చేశాయి. ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజు సహా కీలక మార్పులను ప్రకటించారు. దీంతో ఆంధ్రా క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి ఇప్పటికే బంపర్ ఆఫర్ దక్కింది. వచ్చే సీజన్ కు ఐపీఎల్ నిబంధనల ప్రకారం అన్ క్యాప్డ్ జాబితా నుంచి రిటైన్ చేసిన ఆటగాళ్లకు రూ.4 కోట్లు మాత్రమే ఇస్తారు. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్ పేసర్ హర్షిత్ రాణాకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే చాన్స్ రాలేదు. మరో పేసర్ మయాంక్ యాదవ్, నితీశ్ రెడ్డి రెండు మ్యాచ్ ల్లోనూ ఆడారు. వీరు క్యాప్డ్ ప్లేయర్లుగా మారిపోయి 4 కోట్ల నుంచి రూ.11 కోట్లు అందుకోనున్నారు.
చాన్స్ దొరుకుతుందా?
కోల్ కతా నైట్ రైడర్స్ పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ హర్షిత్ రాణా గత సీజన్ లో అద్భుత ప్రతిభ కనబర్చాడు. దీంతో జట్టుకు టైటిల్ దక్కింది. అయితే, గత రెండు టూర్ లకు అతడు ఎంపికైనా తుది జట్టులో చోటు లభించలేదు. ఇప్పుడు బంగ్లాతో టి20 సిరీస్ కూ ఆడించలేదు.
వాస్తవానికి నితీశ్ రెడ్డి బంగ్లాతో టి20 సిరీస్ లో అరంగేట్రం చేయడని అనుకున్నారు. హర్షిత్ ను ఆడిస్తారని భావించారు. కానీ, నితీశ్ ఆడడం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలవడం జరిగిపోయాయి. అయితే, హైదరాబాద్ మ్యాచ్ లో హర్షిత్ ను ఆడిస్తారని భావించవచ్చు. కోల్ కతాకు మెంటార్ గా వ్యవహరించిన గంభీర్ ఇప్పుడు టీమ్ ఇండియా హెడ్ కోచ్. రాణా ప్రతిభ గురించి అతడికి తెలుసు. ఒక్క మ్యాచ్ ఆడిస్తే రూ.11 కోట్లు వచ్చే చాన్సుంది. దీన్నికూడా పరిగణించవచ్చు. మొత్తానికి హైదరాబాద్ లో హర్షిత్ ఆడితే అతడికి దసరా బొనాంజానే.