Begin typing your search above and press return to search.

అతడికి 41.. సహచర బౌలర్లు ఇంకా పుట్టనే లేదు

ఇప్పటికీ పదును తగ్గలేదు. అనుకూలమైన పిచ్ దొరికితే స్వింగ్ తో బ్యాట్స్ మెన్ ను కంగుతినిపించగల నైపుణ్యం అతడి సొంతం.

By:  Tupaki Desk   |   2 Feb 2024 4:30 PM GMT
అతడికి 41.. సహచర బౌలర్లు ఇంకా పుట్టనే లేదు
X

పది పదిహేను కాదు.. 21 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్.. 183 టెస్టులు.. 691 వికెట్లు.. 194 వన్డేలు.. 269 వికెట్లు.. ఇవన్నీ ఏదో ఒక స్పిన్నర్ గణాంకాలు కాదు.. ఆధునిక కాలంలోనూ ఓ పేస్ బౌలర్ రికార్డులు.. పదేళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడితేనే గొప్ప అనుకుంటారు.. కానీ, అతడు 20 ఏళ్లుగా ఆడుతున్నాడు. అప్పటి సచిన్ టెండూల్కర్ నుంచి ఇప్పటి యశస్వి జైశ్వాల్ వరకు బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పటికీ పదును తగ్గలేదు. అనుకూలమైన పిచ్ దొరికితే స్వింగ్ తో బ్యాట్స్ మెన్ ను కంగుతినిపించగల నైపుణ్యం అతడి సొంతం.

విశాఖపట్టణంలో భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ మైదానంలోకి దిగాడు. హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో ఆడని అతడు.. విశాఖలో మాత్రం తుది జట్టులోకి వచ్చాడు. ఇంతకూ అండర్సన్ వయసు ఎంతనుకుంటున్నారు..? 41 పైనే. ఇప్పటికే 183 టెస్టులు ఆడిన అతడికి విశాఖ మ్యాచ్ 184వది. మరోవైపు అండర్సన్ 2003 మేలో జింబాబ్వేతో కెరీర్ లో తొలి టెస్టు ఆడాడు. అంటే.. మరికొద్ది రోజుల్లో అతడి అంతర్జాతీయ టెస్టు కెరీర్ 21 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. వాస్తవానికి 2002 డిసెంబరులోనే అండర్సన్ వన్డే అరంగేట్రం చేశాడు. మరో ఆరు నెలల తర్వాత టెస్టులోకి వచ్చాడు.

200 టెస్టులు ఆడించాలని..

అంతర్జాతీయ క్రికెటర్ గా అందులోనూ పేసర్ గా సగటు లెక్కల ప్రకారం చూస్తే అండర్సన్ వయసు ఎప్పుడో రిటైర్మైంట్ దాటిపోయింది. కానీ, అతడితో 200 టెస్టులు ఆడించాలని ఇంగ్లిష్ బోర్డు పట్టుదలతో ఉన్నట్లుంది. భారత్ కు చెందిన బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 200 టెస్టులు ఆడి టాప్ లో ఉన్నాడు. జాత్యంహకారమో ఏమో కానీ.. సచిన్ రికార్డును ఎలాగైనా బద్దలు కొట్టాలని ఇంగ్లండ్ బోర్డు భావిస్తోంది. అందుకనే 41 ఏళ్లుదాటినా అండర్సన్ ను కొనసాగిస్తోంది. అతడు మ్యాచ్ లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసి చాన్నాళ్లయింది. అయినప్పటికీ కొనసాగిస్తోంది. అదే సమయంలో 700 వికెట్ల మైలురాయిని కూడా చేరతాడని.. ప్రపంచ టాప్ వికెట్ టేకర్లలో రెండో స్థానంలో ఉంటాడని అనుకుంటోంది.

విశాఖలో ఇంగ్లండ్ టెస్టు జట్టులో ఏకైక పేసర్ అండర్సన్. మిగతావారు ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్, లెగ్ స్పిన్నర్ రేహాన్ అహ్మద్. వీరిద్దరి వయసు 20 లోపే కావడం గమనార్హం. షోయబ్ కు ఇదే తొలి టెస్టు కూడా. అండర్సన్ తో కలిసి బౌలింగ్ చేస్తున్న వీరిద్దరు అతడు అంతర్జాతీయ కెరీర్ మొదలుపెట్టేటప్పటికి పుట్టనేలేదు. ఇక అండర్సన్ ప్రస్థానం మొదలయ్యేప్పటికి కెప్టెన్ స్టోక్స్, రూట్, పోప్ వంటి వారు నిక్కర్లు వేసుకుని స్కూల్ క్రికెట్ ఆడుతుండవచ్చు. ఏదిఏమైనా ఒక పేసర్ రెండు దశాబ్దాల కెరీర్ పూర్తిచేసుకోవడం అంటే మామూలు మాటలు కాదు.