Begin typing your search above and press return to search.

ఐసీసీ ఆదాయంలో 38 శాతం బీసీసీఐకే.. అదీ మన పవర్

ప్రపంచ కప్ నిర్వహణ పై ఇటీవల ఐసీసీ సన్నాహక సమావేశం నిర్వహించింది.

By:  Tupaki Desk   |   31 July 2023 8:01 AM GMT
ఐసీసీ ఆదాయంలో 38 శాతం బీసీసీఐకే.. అదీ మన పవర్
X

ఓ మూడు దశాబ్దాల కిందట ప్రపంచ క్రికెట్ లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా బోర్డులదే ఆధిపత్యం. రూల్స్ వారు రాస్తే మనం పాటించేవారం. ఓ రెండు దశాబ్దాల కిందట కూడా పాశ్చాత్య మీడియా ఇతర జట్ల పై ముఖ్యంగా భారత్ పై దుమ్మెత్తిపోసేది. తప్పులన్నీ వేరే వారివి.. మెప్పులన్నీ మనవి అన్నట్లుండేది వారి ధోరణి. "యాషెస్ సిరీస్" వారికి అన్ని సిరీస్ లకూ మించి గొప్ప. కానీ ఇప్పుడు కాలం మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భారత క్రికెట్ దశనే మార్చింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్లే తమ బోర్డులను ధిక్కరించి ఐపీఎల్ ఆడేంత స్థాయికి వెళ్లిపోయింది భారత క్రికెట్. ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మాటే నెగ్గేది. కానీ, అదే ఐసీసీ ఇప్పుడు భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ వైపు చూస్తోంది. అసలు బీసీసీఐ ని కాదనే ధైర్యమే చేయడం లేదు.

అందులోనూ టీమిండియా సిరీస్ ల విషయం లో మరింత జాగ్రత్తగా ఉంటోంది. మనం ఏం చెబితే దానికి తలాడిస్తోంది. బీసీసీఐ ని కాదంటే ఎక్కడ పోటీ గా మరో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ను తెస్తుందోనని భయం. ఇదంతా డబ్బు మహిమ.. అవును ఐసీసీ ఆదాయం లో సింహభాగం మన నుంచే. అందులోనూ మరో రెండు నెలల్లో భారత్ లో ప్రపంచ కప్ మొదలుకానుంది. లక్షలాదిగా అభిమానులు పోటెత్తే స్టేడియాలు.. వేల కోట్ల విలువైన ప్రకటనలు.. ఇంకేం..? ఇక ఈ ఆదాయం మరింత పెరగడం ఖాయం. కాగా, ప్రపంచ కప్ నిర్వహణ పై ఇటీవల ఐసీసీ సన్నాహక సమావేశం నిర్వహించింది. దక్షిణాఫ్రికా లోని డర్బన్ ఇందుకు వేదికైంది.

మన వాటా 38.5 శాతం

డర్బన్‌ లో జరిగిన సమావేశం అనంతరం ఐసీసీ ఏడాది ఆదాయం నుంచి భారత క్రికెట్ బోర్డు వాటా కింద 231 మిలియన్ డాలర్లు ఇవ్వాల ని నిర్ణయించారు. భారత కరెన్సీలో ఈ వాటా విలువ సుమారు రూ. 2,000 కోట్లు. మొత్తం ఆదాయంలో ఇది 38.5 శాతం కావడం విశేషం.

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ డిమాండ్ మేరకు ఐసీసీ ఆదాయం నుంచి 2015-23 మధ్య కాలం లో బీసీసీఐ 22 శాతం వాటా పొందింది.

క్రికెట్ పుట్టిల్లు.. మనకంటే వెనుకే

క్రికెట్ పుట్టిల్లు ఇంగ్లండ్. కానీ.. ఐసీసీ ఆదాయం లో ఆ బోర్డు పొందినదెంతో తెలుసా? కేవలం 41 మిలియన్ డాలర్లు. దీనికంటే బీసీసీఐ పొందే మొత్తం ఆరు రెట్లు అన్నమాట. కాగా, ఐసీసీ ఆదాయాల నుంచి క్రికెట్ బోర్డులు పొందే వాటా లో, 6.89 శాతం వాటాతో ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 6.25 శాతం వాటాతో 37.53 మిలియన్ డాలర్లను పొందనుంది. విశేషం ఏమంటే ఈ రెండింటి మొత్తం కంటే కూడా మూడు రెట్లు బీసీసీఐ పొందనుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు 5.75 శాతం వాటా (34.5 మిలియన్ డాలర్లు) ఐసీసీ నుంచి రానున్నాయి. బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్ఘానిస్థాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, జింబాబ్వే, వెస్టిండీస్, ఐర్లాండ్ అన్నీ 5 శాతం కంటే తక్కువ వాటానే పొందనున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్ లో భారత్ వాటానే 70-80 శాతం

అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆదాయంలో 70 నుంచి 80 శాతం వాటా భారత మార్కెట్ దే. ఇతర బోర్డులతో పోలిస్తే బీసీసీఐ ఆదాయం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నా, వాస్తవానికి అంత ఆదాయం ఉండదు. ఐసీసీ టోర్నమెంట్ల సందర్భంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి పన్ను రాయితీలను బీసీసీఐ పొందకపోవడమే దీనికి కారణం. గంగూలీ చైర్మన్‌ గా ఉన్న సమయం లో ప్రపంచ కప్ నిర్వహించేందుకు బీసీసీఐ కి పన్ను రాయితీలు ఇవ్వకపోతే బోర్డు రూ.955 కోట్ల వరకు నష్టపోతుందని అంచనా వేశారు. మ్యాచ్‌ల ప్రసారాల నుంచి ఆర్జిస్తోన్న ఆదాయం పై 21.84 శాతం పన్ను చెల్లించాల్సి ఉంది. 2016 టి20 ప్రపంచ కప్ సమయం లో బీసీసీఐ రూ.193 కోట్లను పన్ను కింద కట్టింది.