Begin typing your search above and press return to search.

వరల్డ్ కప్ ముందు.. అన్ని జట్లకూ గాయాలు.. భారత్ కు తప్ప

వన్డే ప్రపంచ కప్ నకు కేవలం 12 రోజుల సమయమే ఉంది. భారత్ ఏకైక వేదికగా జరగనున్న ఈ కప్ నకు అన్ని జట్లూ 15 మంది సభ్యులను ప్రకటించాయి.

By:  Tupaki Desk   |   24 Sep 2023 12:30 AM GMT
వరల్డ్ కప్ ముందు.. అన్ని జట్లకూ గాయాలు.. భారత్ కు తప్ప
X

వన్డే ప్రపంచ కప్ నకు కేవలం 12 రోజుల సమయమే ఉంది. భారత్ ఏకైక వేదికగా జరగనున్న ఈ కప్ నకు అన్ని జట్లూ 15 మంది సభ్యులను ప్రకటించాయి. వీరిలోంచి మార్పులకు ఈ నెల 28 వరకు గడువుంది. వాస్తవంలో చూస్తే.. సమయం తక్కువగా ఉంది కాబట్టి సన్నాహాలపై ఫోకస్ పెట్టాల్సిన సమయం. కానీ, పరిస్థితి అలా లేదు. ఒక్కో జట్టు ఇద్దరేసి ఆటగాళ్లకు మార్చాల్సి వస్తోంది. దీనికి కారణం.. గాయాలు.

పేసర్ అని కాదు.. స్పిన్నర్ అని లేదు.. బ్యాట్స్ మన్ అని కాదు.. ఆల్ రౌండర్ అని కాదు.. అన్ని జట్లను ఆటగాళ్ల గాయాలు వేధిస్తున్నాయి. న్యూజిలాండ్ మొదలు ఇంగ్లండ్ వరకు ఇదే పరిస్థతి.

కెప్టెన్ పైనే కివీస్ సందేహం

న్యూజిలాండ్ కు ప్రధాన బలం కెప్టెన్ కేన్ విలియమ్సన్. ఎలాంటి పిచ్ పై అయినా రాణించే అతడు ఉంటేనే పెద్ద మానసిక స్థైర్యం. కానీ, కేన్ మామ ఐపీఎల్ మొదటి మ్యాచ్ సందర్భంగానే గాయపడ్డాడు. ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. కానీ, ప్రపంచ కప్ నకు ఎంపిక చేయక తప్పని పరిస్థితి. బౌల్ట్ తో కొత్త బంతి పంచుకునే కివీస్ ప్రధాన పేసర్ టిమ్ సౌథీ అయితే, కప్ మొత్తానికే దూరమయ్యేలా ఉన్నాడు. శస్త్రచికిత్స నుంచి వేగంగా కోలుకుంటున్న విలియమ్సన్‌ ప్రపంచకప్‌ నాటికి ఫిట్‌నెస్‌ సాధిస్తాడని న్యూజిలాండ్‌ ఆశలు పెట్టుకుంది. అందుకే అతనే కెప్టెన్‌గా ప్రపంచకప్‌ జట్టును ప్రకటించింది. కానీ శస్త్రచికిత్స నుంచి కోలుకోవడం అంటే సుదీర్ఘ ప్రక్రియ. ఒకవేళ విలియమ్సన్‌ ఫిట్‌గా మారిన ప్రపంచకప్‌లో ఆడటంపై అనుమానాలు మాత్రం అలాగే కొనసాగుతాయి. తాజాగా ఇంగ్లాండ్‌తో నాలుగో వన్డేలో క్యాచ్‌ పట్టే క్రమంలో కివీస్‌ సీనియర్‌ పేసర్‌ సౌథీ కుడిచేతి బొటన వేలికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగానే ఉందని, అతను ప్రపంచకప్‌ ఆడటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పాక్ కు పెద్ద షాక్

షహీన్ షా ఆఫ్రిది.. నసీమ్ షా.. ఒకప్పటి వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్ ను గుర్తుకు తెస్తున్న పాకిస్థాన్ పేసర్లు. కానీ, ఈ జంట ప్రపంచ కప్ లో కనిపించదు. కారణం.. నసీమ్ షా ఆసియా కప్ లో గాయపడడమే. టోర్నీ అంతటికీ అతడు దూరమయ్యాడు. పేసర్ హారిస్‌ రవూఫ్, బ్యాట్స్ మెన్ సల్మాన్‌ అఘా, ఇమాముల్‌ హక్‌ కూ గాయాల ఇబ్బందులున్నాయి.

దక్షిణాఫ్రికాకు గట్టి దెబ్బ

150 కిలోమీటర్ల వేగంతో బంతులేసే పేసర్ ను ఎదుర్కొనడం ఎవరికైనా సవాలే. అలాంటి పేసర్ గాయంతో దూరమైతే మరి జట్టుకు ఎంత దెబ్బ? దక్షిణాఫ్రికా పేసర్ నోకియా ఇలాగే ప్రపంచ కప్ ఆడబోవడం లేదు. మరో పేసర్ మగలా కూడా ఇలానే టోర్నీ నుంచి ఔట్ అయ్యాడు. కెప్టెన్, బ్యాట్స్ మన్ బవుమా కూడా కాస్త ఇబ్బందిగానే ఉన్నాడు.

ఆసీస్ లిస్టు పెద్దదే

స్టీవ్ స్మిత్, కమ్మిన్స్, హెడ్, మ్యాక్స్ వెల్.. ఆస్ట్రేలియా ప్రధాన ఆటగాళ్లు. ఈ నలుగురూ గాయాలతో ఇబ్బందిపడుతున్నవారే. స్మిత్, కమ్మిన్స్ కోలుకున్నా.. హెడ్ వంటి కీలక బ్యాట్స్ మన్ దూరమయ్యాడు.

చాంపియన్ కు ఓపెనర్ దూరం

ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ ప్రపంచ కప్ నుంచి తప్పుకొన్నాడు. డిఫెండింగ్ చాంపియన్ కు ఇది పెద్ద దెబ్బే. ఇంగ్లండ్ ప్రధాన పేసర్ ఆర్చర్ ను గాయంతోనే ప్రపంచ కప్ స్టాండ్ బైగా ఎంపిక చేసింది. పేసర్ మార్క్ ఉడ్, స్పిన్నర్ రషీద్ కూడా ఫిట్ నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక బంగ్లాదేశ్ కీలక బౌలర్‌ ఎబాదత్, బ్యాటర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ కోలుకోలేదు. వీరు ఆసియా కప్‌లోనూ ఆడలేదు. ఈలొగా నజ్మల్‌ శాంటో గాయపడ్డాడు.

భారత్ కు అక్షర్ తప్ప అంతా ఆల్ రైట్

టీమిండియాకు మొన్నటివరకు ప్రధాన పేసర్ బుమ్రా, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ గాయాలు పెద్ద ఇబ్బందిగా మారాయి. అయితే, వీరిద్దరూ కోలుకుని తిరిగివచ్చారు. బ్యాట్స్ మన్ శ్రేయస్ అయ్యర్ కూడా తిరిగొచ్చాడు. అయితే, స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ అనూహ్యంగా గాయపడ్డాడు. అతడు ప్రపంచ కప్ నాటికి ఫిట్ నెస్ సాధిస్తే అంతా రైట్ రైటే.