వరల్డ్ కప్ స్పెషల్...బోణీ అంటే ఇది, కొట్టుడంటే అది!
వరల్డ్ కప్ కి ఎవరు ఎలా ప్రిపేర్ అయ్యారు అనే విషయానికి ఒక ఉదహరణ తాజగా తెరపైకి వచ్చింది. మెన్ ఇన్ బ్లాక్ న్యూజిలాండ్ తనదైన శైలిలో మొదలుపెట్టింది
By: Tupaki Desk | 6 Oct 2023 6:31 AM GMTవరల్డ్ కప్ కి ఎవరు ఎలా ప్రిపేర్ అయ్యారు అనే విషయానికి ఒక ఉదహరణ తాజగా తెరపైకి వచ్చింది. మెన్ ఇన్ బ్లాక్ న్యూజిలాండ్ తనదైన శైలిలో మొదలుపెట్టింది. ఇది ఆరంభం మాత్రమే అనే హింట్ ప్రత్యర్థి జట్లకు ఇచ్చింది. చెత్త షాట్లే తమ ఓటమిని శాసించాయని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ పైకి చెప్పుకున్నా... న్యూజిలాండ్ పోరాటం నిలిచింది.
అవును... వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన ఆరంభ మ్యాచ్ లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. హోరాహోరీ తప్పదనుకున్న మ్యాచ్ కాస్తా ఏకపక్షమైంది. వార్ వన్ సైడ్ అన్నట్లుగా న్యూజిలాండ్ చెలరేగింది. ఫైనల్ టై అయినా, ఇంగ్లాండ్ కంటే బౌండరీలు తక్కువ కొట్టడం వల్ల 2019 వరల్డ్ కప్ ను కోల్పోయిన కివీస్.. ఈసారి ఇంగ్లీష్ జట్టును చిత్తుగా ఓడించి టోర్నీని ఘనంగా ఆరంభించింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన జోస్ బట్లర్.. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో దారుణంగా విఫలమయ్యామని ఒప్పుకోవాల్సిన పరిస్థితి కల్పించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 9 వికెట్లకు 282 పరుగులు చేసింది. జో రూట్ (77) టాప్ స్కోరర్ గా నిలవగా... బట్లర్ (43) కూడా రాణించాడు. అయితే ఈ లక్ష్యాన్ని కివీస్ 36.2 ఓవర్లలో ఒక్క వికెట్టే కోల్పోయి ఛేదించడం గమనార్హం.
దీంతో... స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని బట్లర్ చెప్పుకున్నాడు. న్యూజిలాండ్ అసాధారణ ఆటతో ఆకట్టుకుందని కొనియాడాడు. అయితే ఈ తరహా పరాజయాలు తమకు కొత్త కాదని, గతంలో కూడా ఇలాంటి ఓటముల నుంచి తేరుకొని విజయాలందుకున్నామని గుర్తు చేస్తూ అటు అభిమానులకూ, ఇటు టీం కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు.
అవును... 'ఈ ఓటమి తీవ్రంగా నిరాశపరిచింది.. న్యూజిలాండ్ అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకుంది.. ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది.. అని చెప్పుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్... ఈ తరహా ఓటముల నుంచి తేరుకొని విజయాలను అందుకున్న అనుభవం కూడా తమకు ఉందని సర్ధిచెప్పుకున్నాడు. ఇదే సమయంలో చెత్త ప్రదర్శన కనబర్చామని ఒప్పుకున్నాడు.
ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. కీలక భాగస్వామ్యం నెలకొల్పడం చాలా కష్టం అనుకున్నప్పటికీ.. ప్రణాళికలను తాము సమర్థవంతంగా అమలు చేయలేకపోయామని, బ్యాటింగ్ లో సైతం చెత్త షాట్లతో వికెట్లు పారేసుకున్నామని ఇంగ్లిష్ కెప్టెన్ అంగీకరించారు. ఇదే సమయంలో న్యూజిలాండ్ బ్యాటర్లు మాత్రం అద్భుతమైన షాట్స్ ఆడి ఫలితం రాబట్టారని తెలిపారు.
అయితే ఫ్లడ్ లైట్స్ కింద బౌలింగ్ చేయడం కష్టమనే ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నట్లు తెలిపిన బట్లర్... జోరూట్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, అతని ఆట గురించి ఎలాంటి సందేహం అక్కర్లేదని, ఏ ఫార్మాట్ లోనైనా అతను రాణించగలడని కొనియాడాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 36.2 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 283 పరుగులు చేసి మరో 82 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది.
ఏది ఏమైనా... వరల్డ్ కప్ ఆరంభం అద్భుతంగా జరిగిందనేది క్రికెట్ అభిమానుల సంబరం అని మాత్రం చెప్పుకోవచ్చు.