ప్రపంచ కప్ లో దురదృష్టా ఆఫ్రికా.. మళ్లీ స్టార్ట్
వర్ణ వివక్ష కారణంగా వేటు పడడంతో అంతర్జాతీయ క్రికెట్ కు 21 ఏళ్లు దూరమైంది దక్షిణాఫ్రికా. 1991లో తిరిగి ప్రవేశించి.. 1992 ప్రపంచ కప్ లో పాల్గొంది
By: Tupaki Desk | 18 Oct 2023 10:12 AM GMTఆ జట్టును అకస్మాత్తుగా వాన వెంటాడుతుంది.. లేదంటే వివాదం చుట్టుముడుతుంది.. అదీ కాదంటే నిర్లక్ష్యం ముంచేస్తుంది.. ఇవేవీ కాకున్నా, దురదృష్టం తరుముతుంది.. చివరకు అయ్యో అనిపించేలా నిష్క్రమిస్తుంది.. ఇదంతా ఏ జట్టు గురించో ఇప్పటికే అభిమానులకు అర్థమైపోయి ఉంటుంది. దక్షిణాఫ్రికా ప్రపంచ కప్ ల దురదృష్టంపై కథలు కథలుగా వర్ణించవచ్చు.
30 ఏళ్లుగా వెంటాడుతూ..
వర్ణ వివక్ష కారణంగా వేటు పడడంతో అంతర్జాతీయ క్రికెట్ కు 21 ఏళ్లు దూరమైంది దక్షిణాఫ్రికా. 1991లో తిరిగి ప్రవేశించి.. 1992 ప్రపంచ కప్ లో పాల్గొంది. చక్కటి ఆటతో సెమీఫైనల్స్ వరకు దూసుకెళ్లింది. కానీ, ఇంగ్లండ్ తో జరిగిన ఆ మ్యాచ్ లో గెలుపు ముంగిట ఉండగా, వర్షం కారణంగా 1 బంతికి 18 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చి ఓటమి పాలైంది. 1996లో భారత్ లో జరిగిన కప్ లో బలమైన జట్టుగా బరిలో దిగి క్వార్టర్స్ వరకు వచ్చి.. వెస్టిండీస్ చేతిలో ఓడింది. 1999 ప్రపంచ కప్ లో అయితే మీర ఘోరం. ఆల్ రౌండర్ లాన్స్ క్లూసెనర్ జోరుతో అలవోకవగా కప్ కొట్టేస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ, పటిష్ఠ స్థితిలో ఉండి కూడా.. సెమీస్ లో ఆస్ట్రేలియా చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైదంది.
ఓ ఎండ్ లో క్లూసెనర్ ఉన్నప్పటికీ పేసర్ డొనాల్డ్ అనాలోచితంగా తీసిన పరుగుతో రనౌట్ అయ్యాడు. అంతకుముందు దక్షిణాప్రికాపైనే లీగ్ మ్యాచ్ లో కనాకష్టంగా గెలిచిన ఆసీస్ సెమీస్ కు రావడం గమనార్హం. 2003లో ప్రపంచ కప్ ను సొంతగడ్డపైనే నిర్వహించినా.. అత్యున్నత స్థాయిలో సిద్ధమైనా, అద్భుతమైన ఆటగాళ్లున్నా.. అత్యంత దారుణంగా దక్షిణాఫ్రికా లీగ్ దశ కూడా దాటలేదు. 2007లోనూ సెమీస్ చేరినా ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. 2011లో క్వార్టర్స్ కు పరిమితమైంది. 2015లో అయితే, సెమీస్ లో డేల్ స్టెయిన్ వంటి పేసర్ బౌలింగ్ లో న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ ఇలియట్ చివరి బంతికి సిక్స్ కొట్టి మరీ దక్షిణాఫ్రికాను ఓడించాడు. 2019లో దక్షిణాఫ్రికాది మరీ దారుణ ప్రదర్శన. పాకిస్థాన్, శ్రీలంక తర్వాత ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.
ఈసారి మంచి జోష్ మీద
ప్రస్తుత ప్రపంచ కప్ నకు దక్షిణాఫ్రికా మంచి జోష్ మీద వచ్చింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్ లో 0-2తో వెనుకబడి మరీ పుంజుకొని 3-2తో గెలుపొందింది. ఆపై ప్రపంచ కప్ లోనూ ఆసీస్ ను ఓడించింది. దక్షిణాఫ్రికా కథ మారిందని అందరూ భావించారు. కానీ, నెదర్లాండ్స్ తో మ్యాచ్ ద్వారా అదేమీ కాదని నిరూపితమైంది.
ఒత్తిడి, ఆత్మన్యూనత
దక్షిణాఫ్రికాకు ప్రత్యర్థి కంటే ఒత్తిడే పెద్ద శత్రువు. పరిస్థితులు కాస్త ప్రతికూలంగా ఉంటే చాలు.. ఆత్మన్యూనతలోకి వెళ్లిపోతుంది. నిన్నటి నెదర్లాండ్స్ మ్యాచ్ సహా 30 ఏళ్లగా ఇదే జరుగుతోంది. వాస్తవానికి నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో దక్షిణాఫ్రికా మొదట ఆధిపత్యం చూపింది. వర్షం వల్ల 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో మొదట నెదర్లాండ్స్ 140 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఇంకేం.. మరో పది ఇరవై పరుగులు చేస్తే గొప్ప అనుకుంటే .. అనూహ్యంగా నెదర్లాండ్స్ ను 245 పరుగులు చేయనిచ్చింది దక్షిణాఫ్రికా. 43 ఓవర్లలో 245 స్కోరు అంటే అది 50 ఓవర్ల మ్యాచ్ లో 300 కొట్టినంత. ఈ లక్ష్యాన్ని చూసుకుని బెదిరిపోయిందో ఏమో దక్షిణాఫ్రికా తోక ముడిచింది. ఓటమి పాలైంది.
కొసమెరుపు: భారత్ లో ప్రస్తుతం రుతుపవనాలు వెళ్లిపోయి చలికాలం వస్తోంది. వర్షాలు కురవడం అనేది లేదు. కానీ, దక్షిణాఫ్రికా-నెదర్లాండ్స్ మ్యాచ్ జరిగిన ధర్మశాలలో మంగళవారం అనూహ్యంగా వర్షంపడింది. మ్యాచ్ ను 43 ఓవర్లకు కుదించారు. ఇది దక్షిణాఫ్రికా బ్యాడ్ లక్ కాకపోతే మరేమిటి? అందులోనూ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది సఫారీ సేన. ప్రత్యర్థికి పరుగులు ధారపోసి.. వాటిని అందుకోలేక చతికిలపడింది. దీన్నిబట్టి చూస్తే దక్షిణాఫ్రికా బ్యాడ్ లక్ మళ్లీ స్టార్లయిందా? అనే అనుమానం కలుగుతోంది.