3 జట్లు.. 4వ సెమీస్ బెర్తు.. ప్రపంచ కప్ లో ఎవరికి దక్కేనో?
వన్డే ప్రపంచ కప్ లో మరొక్క వారమే లీగ్ మ్యాచ్ లు.
By: Tupaki Desk | 5 Nov 2023 10:45 AM GMTవన్డే ప్రపంచ కప్ లో మరొక్క వారమే లీగ్ మ్యాచ్ లు. వచ్చే ఆదివారం భారత్ –నెదర్లాండ్స్ మధ్య బెంగళూరులో జరిగే మ్యాచ్ తో లీగ్ దశ ముగుస్తుంది. ఈ నెల 15న తొలి సెమీఫైనల్, 16న రెండో సెమీఫైనల్ జరగనున్నాయి. సెమీఫైనల్ చేరే జట్లలో మూడు ఖరారయ్యాయి. మరొక్కటి ఏమిటా అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. అందులోనూ నాలుగో బెర్తుకు మూడు జట్లు పోటీ పడుతుండడంతో దేనికి అవకాశం దక్కుతుందోననే టెన్షన్ పెరిగిపోతోంది.
ఆసీస్ కు 3వ స్థానం పక్కా..
టీమిండియా ప్రపంచ కప్ లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్ లకు ఏడూ గెలిచి టాప్ ప్లేస్ లో ఉంది. దక్షిణాఫ్రికా ఏడింటిలో ఆరు నెగ్గింది. ఈ రెండు జట్లూ ఇప్పటికే సెమీఫైనల్స్ కు చేరాయి. ఆదివారం ఎనిమిదో మ్యాచ్ ఆడుతున్నాయి. దీంట్లో గెలిచిన నేపథ్యంలో దక్షిణాఫ్రికాకు టాప్ ప్లేస్ దక్కుతుంది. భారత్ రెండో స్థానానికి వస్తుంది. లేదా టీమిండియానే గెలిస్తే మన జట్టు టాప్ ప్లేస్ పదిలం అవుతుంది. ఇక మరో స్థానం.. అంటే మూడో ప్లేస్ ఆస్ట్రేలియా ఖాయం చేసుకుంది. ఏడు మ్యాచ్ లు ఆడిన ఆసీస్ ఐదు గెలిచింది. మరో రెండింటిని అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ తో ఆడనుంది. వీటిలో రెండింటినీ గెలిచే సత్తా ఆసీస్ సొంతం. ఇక దక్షిణాఫ్రికా కూడా అఫ్గానిస్థాన్ తో చివరి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇందులో గెలుస్తుందని భావించినా, భారత్ చేతిలో ఓడితే ఆ జట్టుకు 14 పాయింట్లే ఉంటాయి. ఆసీస్ మిగతా రెండూ గెలిస్తే దానికీ 14 పాయింట్లే ఉంటాయి. కానీ, రన్ రేట్ మెరుగ్గా ఉన్న దక్షిణాఫ్రికా దే రెండో స్థానం అవుతుంది. సరే, ఏది ఏమైనా భారత్; దక్షిణాఫ్రికాతో పాటు ఆస్ట్రేలియాకు సెమీఫైనల్ పక్కా.
నాలుగోది ఎవరికో?
నాలుగో సెమీఫైనల్ బెర్తు విషయంలోనే సస్పెన్స్ రేగుతోంది. దీనికోసం న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ రేసులో ఉన్నాయి. సమీకరణాల ప్రకారం చూస్తే న్యూజిలాండ్ కే అవకాశాలు ఎక్కువ. ఆ జట్టు రన్ రేట్ (0.398) కూడా చాలా బాగుంది. పాకిస్థాన్ (0.036), అఫ్గాన్ (-0.330) రన్ రేట్ బాగా తక్కువ. ఇక న్యూజిలాండ్ తన చివరి మ్యాచ్ ను శ్రీలంకతో ఆడాల్సి ఉంది. లంక ఫామ్ ను బట్టి చూస్తే కివీస్ గెలుపు సులువే. అఫ్ఘానిస్థాన్ కు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలతో మ్యాచ్ లున్నాయి. వీటిలో గెలవడం కష్టమే. ఇక పాకిస్థాన్ విషయానికి వస్తే డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ను ఎదుర్కొనాల్సి ఉంది. లంక చేతిలో కివీస్ ఓడిపోయి.. అఫ్ఘాన్ తన మిగతా రెండింటిలో పరాజయం పాలై.. ఇంగ్లండ్ ను పాకిస్థాన్ ఓడిస్తే గనుక ఆ జట్టుదే సెమీస్ బెర్తు. లేదా.. న్యూజిలాండ్ తన శైలిలో చెలరేగి లంకను చుట్టేస్తే.. వారిదే ప్రపంచ కప్ నాలుగో బెర్తు అవుతుంది. పాకిస్థాన్.. ఇంగ్లండ్ మీద గెలిచినప్పటికీ ఫలితం ఉండదు. ఎందుకంటే న్యూజిలాండ్, పాకిస్థాన్ 10 పాయింట్లతో సమంగా ఉన్నప్పటికీ న్యూజిలాండ్ మెరుగైన రన్ రేట్ తో సెమీస్ కు వెళ్తుంది.
కొసమెరుపు: టీమిండియా పాయింట్ల పట్టికలో టాప్ లో నిలవడం ఖాయం. ఈలెక్కన నాలుగో స్థానంలో నిలిచే న్యూజిలాండ్ లేదా పాకిస్థాన్ తో సెమీఫైనల్ ఆడాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా సెమీస్ లో గత ప్రపంచ కప్ లో టీమిండియాకు న్యూజిలాండ్ చేదు అనుభవం మిగిల్చింది. ఒకవేళ లక్ కలిసొచ్చి పాకిస్థాన్ సెమీస్ కు చేరితే ఆడాల్సింది టీమిండియాతోనే కావడం గమనార్హం.