Begin typing your search above and press return to search.

పాకిస్థాన్ స్మోకింగ్ లీగ్.. డ్రెస్సింగ్ రూమ్ లోనే దమ్ము

పాకిస్థాన్ అంటేనే ఓ అపసవ్య దేశం.. ఆర్థికంగా, రాజకీయంగా, క్రీడాపరంగా దేనిలోకూ క్రమశిక్షణ ఉండదు

By:  Tupaki Desk   |   19 March 2024 9:30 AM GMT
పాకిస్థాన్ స్మోకింగ్ లీగ్.. డ్రెస్సింగ్ రూమ్ లోనే దమ్ము
X

పాకిస్థాన్ అంటేనే ఓ అపసవ్య దేశం.. ఆర్థికంగా, రాజకీయంగా, క్రీడాపరంగా దేనిలోకూ క్రమశిక్షణ ఉండదు. ఆ దేశాన్ని బాగు చేయడం ఎవరి వల్లా కాదు అనేలా ఉంటుంది. ప్రపంచ క్రికెట్ లో మేటి జట్టుగా ఉన్నప్పటికీ.. ప్రతిభకు లోటు లేనప్పటికీ.. ఎప్పుడెలా ఆడుతుందో తెలియని తీరుతో ఓటములు మూటగట్టుకుంటుంది. ఇటీవలి వన్డే ప్రపంచ కప్ లో పడుతూ లేస్తూ ఆడి సెమీస్ కు చేరలేకపోయింది.

వాళ్లకూ ఉంది లీగ్..

ఇండియన్ ప్రామియర్ లీగ్ (ఐపీఎల్) లో 2009 నుంచి పాకిస్థాన్ ఆటగాళ్లకు ప్రవేశం లేదు ముంబై దాడుల అనంతరం భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, మనకు దీటుగా వారు కూడా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను మొదలుపెట్టారు. దీనికి ఆదరణ కూడా బాగానే ఉంది. ప్రముఖ అంతర్జాతీయ ఆటగాళ్లూ పాల్గొంటుంటారు. మనదగ్గర ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల పేరిట ఫ్రాంచైజీలు ఉన్నట్లే.. పీఎస్ఎల్ లో లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ వంటి నగరాల పేరిట ఫ్రాంచైజీలు ఉన్నాయి. వీటిలో పాక్ రాజధాని పేరిట ఉన్న ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ ఫ్రాంచైజీ ఒకటి.

మ్యాన్ ఆఫ్ ద స్మోక్

ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్‌ రౌండర్‌ ఇమాద్‌ వసీం తాజాగా వివాదంలో చిక్కుకున్నాడు. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ కు సంబంధించి ఫైనల్ మ్యాచ్ సోమవారం జరిగింది. ఈ మ్యాచ్‌ జరుగుతుండగానే జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఇమాద్ సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే.. ‘పాకిస్థాన్‌ స్మోకింగ్‌ లీగ్’ అంటూ పీఎస్ఎల్ అర్థాన్ని మార్చివేశాడు. కాగా, ముల్తాన్ సుల్తాన్స్ తో జరిగిన ఫైనల్లో ఇస్లామాబాద్ గెలవడంతో ఇమాద్ పాత్ర కీలకం. 4 ఓవర్లు వేసి 23 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. సుల్తాన్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులే చేయగా.. ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి ఇస్లామాబాద్‌ చాలా కష్టపడింది. చివరి బంతికి గానీ విజయం సాధించలేకపోయింది. అలా మూడోసారి పీఎస్‌ఎల్ టైటిల్‌ అందుకుంది. ఇమాద్‌ వసీమ్‌ ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ కావడం గమనార్హం. డ్రెస్సింగ్ రూమ్ లో స్మోక్ కు సంబంధించి అతడిపై పాక్‌ క్రికెట్‌ బోర్డు ఇంకా చర్యలు తీసుకోలేదు.