Begin typing your search above and press return to search.

పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ ప్రయారిటీ ఇది!

29 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తమ దేశంలో ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిస్తోంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.

By:  Tupaki Desk   |   28 Feb 2025 8:00 AM IST
పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ ప్రయారిటీ ఇది!
X

29 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తమ దేశంలో ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిస్తోంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. ఈ టోర్నీ మొదలవుతున్నపుడు పాకిస్థానీల సంబరం అంతా ఇంతా కాదు. కానీ ఐదు రోజులకే ఆ ఆనందం అంతా ఆవిరి అయిపోయింది. పాకిస్థాన్ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ముఖ్యంగా ఇండియా చేతిలో చిత్తుగా ఓడడం ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేని విషయం.

దీంతో పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు తప్పలేదు. ప్రస్తుత పాకిస్థాన్ జట్టు.. ఇండియా-బి టీం మీద కూడా గెలవలేదని సునీల్ గావస్కర్ పేర్కొనడంలో అతిశయోక్తి లేదు. అంత బలహీన పడింది పాకిస్థాన్ జట్టు. ఐతే రా టాలెంట్ ఉన్నప్పటికీ.. సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల పాక్ జట్టు వేగంగా పతనం అయిపోతోందనే అభిప్రాయాలున్నాయి. విదేశీ కోచ్‌లు ఎవ్వరూ పాక్ జట్టుతో కొన్ని నెలలు కూడా కొనసాగలేకపోవడం గమనించవచ్చు.

ఇందుకు ఓ ముఖ్య కారణం.. పాకిస్థాన్ క్రికెటర్లకు ఆట కంటే మత సంబంధిత విషయాల మీదే ఎక్కువ ఫోకస్ ఉండడం అనే ఓ వాదన ఉంది. ఇది నిజమే అనిపించేలా ఆ జట్టు ఓపెనర్ ఇమాముల్ హక్ ఓ ఇంటర్వ్యూలో ఓ విషయం వెల్లడించాడు. కెప్టెన్ రిజ్వాన్ గురించి అతను మాట్లాడుతూ.. టోర్నీల కోసం ఏదైనా హోటల్‌లో బస చేయడానికి వెళ్తే ముందు అక్కడ నమాజ్ చేయడానికి ప్రత్యేక ప్రదేశాన్ని గుర్తిస్తాడని.. అక్కడ తెల్లని వస్త్రం పెట్టి నమాజ్‌కు సిద్ధం చేస్తాడని.. అక్కడికి నాన్-ముస్లిమ్స్ ఎవరూ రాకుండా చూస్తాడని ఇమాముల్ వెల్లడించాడు.

ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి నమాజ్ వేళల గురించి, ఇతర మత సంబంధిత విషయాల గురించి అప్‌డేట్స్ ఇస్తాడని.. ఆటగాళ్లందరితో కోఆర్డినేట్ చేస్తాడని ఇమాముల్ తెలిపాడు. ఇమామ్ రిజ్వాన్ మీద విమర్శలేమీ చేయలేదు. కానీ తమ కెప్టెన్ ప్రయారిటీస్ ఎలాంటివో క్యాజువల్‌గా చెప్పాడు. పాకిస్థాన్ ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూంల్లో, మైదానంలో మతానికే ప్రయారిటీ ఇస్తారనే అభిప్రాయాలు వాళ్లతో పని చేసిన విదేశీయులు చెబుతుంటారు. ఇమామ్ వ్యాఖ్యలతో అది నిజమే అని రుజువైంది. ఆటకు మించి మతానికి ప్రయారిటీ ఇస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయంటూ నెటిజన్లు రిజ్వాన్ బృందం మీద కౌంటర్లు వేస్తున్నారు.