ఏకైక ప్రపంచ కప్ అందించిన ఇమ్రాన్ ఖాన్ పాక్ క్రికెట్ ను చెడగొట్టాడా?
పాకిస్థాన్ ఇప్పటివరకు గెలిచింది ఒకే ఒక వన్డే ప్రపంచకప్.. అది 1992లో.. అంటే ఇప్పటికి 33 ఏళ్లు అవుతుంది.
By: Tupaki Desk | 26 Feb 2025 5:30 PM GMT‘‘మళ్లీ పాకిస్థాన్ వన్డే ప్రపంచ కప్ ఎందుకు గెలవలేదు’’ ఈ ప్రశ్న ప్రపంచ క్రికెట్ లో ఎవరినైనా అడిగితే.. ‘‘మళ్లీ ఇమ్రాన్ ఖాన్ లాంటి కెప్టెన్ రాలేదు కదా?’’ అని సమాధానం చెబుతారు.
పాకిస్థాన్ ఇప్పటివరకు గెలిచింది ఒకే ఒక వన్డే ప్రపంచకప్.. అది 1992లో.. అంటే ఇప్పటికి 33 ఏళ్లు అవుతుంది. మళ్లీ ఇన్నేళ్లలో పాకిస్థాన్ వన్డే ప్రపంచ కప్ నెగ్గలేకపోయింది. 1999లో మాత్రమే ఫైనల్ వరకు వచ్చింది. ఇక 1992లో ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్రధారి అప్పటి పాకిస్థాన్ కెప్టెన్, మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. వరుస పరాజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితి ఎదురవగా ఇమ్రాన్ నాయకత్వ పటిమ చాటుతూ జట్టులో స్ఫూర్తి నింపాడు. కుర్రాళ్లను ముందుండి నడిపించాడు. ఇప్పటికీ ఆ ప్రపంచ కప్ లో ఇమ్రాన్ కెప్టెన్సీ గురించి గొప్పగా చెబుతారు.
ఒక గొప్ప కెప్టెన్ గానే కాదు.. పాకిస్థాన్ తరఫున గొప్ప పేస్ బౌలర్/ఆల్ రౌండర్ కూడా అయిన ఇమ్రాన్ ను ప్రపంచంలో అందరూ మేటి క్రికెటర్ గా గౌరవిస్తారు. పాక్ క్రికెట్ లో ప్రతిభ ఎక్కడ ఉన్నా వెదికి పట్టుకుని దేశానికి ఆడేలా చేయడం ఇమ్రాన్ గొప్పదనం అని పేర్కొంటారు.
అలాంటి ఇమ్రాన్ ఖాన్ గురించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ చైర్మన్ నజామ్ సేథి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం తమ జట్టు జింబాబ్వేతో సమానం ఉందని.. ఇదంతా ఇమ్రాన్ వల్లనేనని నిందించాడు. స్వదేశంలో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్థాన్ లీగ్ దశలోనే నిష్క్రమించడంతో నజామ్ ఏకంగా ఇమ్రాన్ నే నిందించాడు.
దేశంలో క్రికెట్ అభిమానుల ఆగ్రహం సరైనదేనని. పాక్ క్రికెట్ పతనమైందని.. ఇది 2019 నుంచే మొదలైందని సేథి అన్నాడు. 2019 పాక్ ప్రధాని అయ్యారు ఇమ్రాన్‌ఖాన్. ఆయన ఆధ్వర్యంలో కొత్త మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలే ప్రస్తుత దుస్థితికి కారణాలని విమర్శించాడు. ఇమ్రాన్ ప్రధానిగా ఉండగా దేశవాళీ క్రికెట్ ను సమూలంగా మార్చేశారని.. అత్యుత్తమ క్రికెటర్లను అందించిన వ్యవస్థను దెబ్బకొట్టారని తప్పుబట్టాడు. తమ దేశానికి సరిపోని ఆస్ట్రేలియా హైబ్రిడ్ మోడల్ ను తేవడంతో పాటు రాజకీయ జోక్యం ఎక్కువై పీసీబీ విధానాలు దారితప్పాయన్నాడు. విదేశీ కోచ్ లు, ఇష్టమైన వారిని సెలక్టర్లుగా నామినేట్ చేయడం, మేనేజ్ మెంట్‌లోకి పాతవారిని తేవడం.. సహచరులతో కెప్టెన్ కు పడకపోవడం, గ్రూప్ లు, మేనేజ్‌మెంట్ పట్టించుకోకపోవడంతో దారుణ ఫలితాలకు కారణం అవుతోందని సేథి వెల్లడించాడు.
కాగా, ఇమ్రాన్ అవినీతి ఆరోపణలతో జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. తమ జట్టు ఓటమిపై ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు మీడియాలో వచ్చింది.
ఇక్కడ గమ్మత్తు ఏమంటే.. సేథి ఏమో ఇమ్రాన్ కారణంగానే వైఫల్యాలు అని నిందిస్తుంటే.. కీలక నిర్ణయాలు తీసుకొనేవారి స్థానంలో ఇష్టులైనవారు ఉంటే పాక్ క్రికెట్ పతనం దిశగానే సాగుతుంది అంటూ ఇమ్రాన్ అన్నట్లుగా వార్తలు రావడం.