Begin typing your search above and press return to search.

6.2 అడుగులు.. 6.4 అడుగులు.. బంగ్లాదేశ్ ‘ఎత్తు’కు భారత్ ‘పైఎత్తు’

ఆరు నెలలుగా టి20లు, వన్డేలు తప్ప టెస్టుల రుచి చూడని క్రికెట్ అభిమానులకు వచ్చే నాలుగైదు నెలలు మహా పండుగే.

By:  Tupaki Desk   |   15 Sep 2024 7:30 PM GMT
6.2 అడుగులు.. 6.4 అడుగులు.. బంగ్లాదేశ్ ‘ఎత్తు’కు భారత్ ‘పైఎత్తు’
X

కచ్చితంగా గెలిచే ఉద్దేశంలో భారత్ పై ఎత్తు వేసింది బంగ్లాదేశ్.. అయితే, మన దేశం ఏమైనా తక్కువ తిన్నదా...? అంతకు పైఎత్తు వేసింది.. దీంతో చిత్తు చేయాలని చూస్తోంది. ఇదంతా రాజకీయాల్లోనో.. సరిహద్దుల్లోనో కాదు.. క్రీడా మైదానంలో.. వచ్చే గురువారం నుంచి జరగనున్న టెస్టు మ్యాచ్ లో. ఆరు నెలల తర్వాత టెస్టు మ్యాచ్ బరిలో దిగుతోంది టీమ్ ఇండియా. ఐపీఎల్, టి20 ప్రపంచ కప్ నకు ముందు గత మార్చిలో ఇంగ్లాండ్ తో చివరగా టెస్టు ఆడింది. ఆ తర్వాత సుదీర్ఘ ఫార్మాట్ లో పాల్గొన్నదే లేదు. మరోవైపు వచ్చూ నాలుగు నెలలు కఠినమైన షెడ్యూల్ ఉంది.

నాలుగు నెలలు.. 2+3+5

ఆరు నెలలుగా టి20లు, వన్డేలు తప్ప టెస్టుల రుచి చూడని క్రికెట్ అభిమానులకు వచ్చే నాలుగైదు నెలలు మహా పండుగే. ఎందుకంటే భారత్ వరుసగా 10 టెస్టు మ్యాచ్ లు ఆడనుంది. అంటే 50 రోజుల పాటు టెస్టుల్లోనే ఉండనుంది. ఇందులో మొదటగా ఈ నెల 19 నుంచి బంగ్లాదేశ్ తో చెన్నైలో మ్యాచ్ జరగనుంది. అయితే, బంగ్లాదేశ్ లో పరిస్థితులు ఎలా ఉన్నా ఆ దేశ జట్టు పరిస్థితి మాత్రం మెరుగైంది. ఇటీవల పాకిస్థాన్ ను వారి స్వదేశంలో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు భారత్ లో రెండు టెస్టులు ఆడేందుకు వచ్చింది. అయితే, బంగ్లా జట్టులో ఒక్క పేసర్ గురించే చర్చ నడుస్తోంది.

బంతి పట్టిన నాలుగేళ్లకే జాతీయ జట్టులోకి

బంగ్లా కొత్త కెరటం 22 ఏళ్ల నహీద్ రాణా 2020 వరకు క్రికెట్ లోకి అడుగుపెట్టిందే లేదు. కానీ, ఇప్పుడు బంగ్లా సంచలన పేసర్. 6.2 అడుగుల ఎత్తుతో 150 కిలోమీటర్ల వేగం వరకు బంతులేసే రాణా మొన్న పాకిస్థాన్ ను మట్టికరిపించడంలో కీలక పాత్ర పోషించాడు. వాస్తవానికి బంగ్లా పేసర్లలో వేగం తక్కువ. ఎత్తు కూడా తక్కువే. 140 కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటే మహా గొప్ప. కానీ, రాణా 140 నుంచే మొదలుపెడుతున్నాడు. నైపుణ్యం కూడా తోడవడంతో వికెట్లు తీస్తున్నాడు. పాక్ తో సిరీస్‌ లో రెండో టెస్టులో బ్యాటర్లు వణికిపోయారు. రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు పడగొట్టిన రాణా.. పాక్ కెప్టెన్‌ షాన్‌ మసూద్, టాప్ బ్యాటర్ బాబర్‌ అజాం, కీలక ఆల్ రౌండర్ సాద్‌ షకీల్‌ లను ఔట్ చేశాడు. రాణా 2020లో కాలేజీ చదువు పూర్తి చేసుకున్నాడు. అప్పుడే అకాడమీలో చేరాడు. 2021లో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్ లోకి రాగా.. 2022-23 జాతీయ క్రికెట్‌ లీగ్‌లో 32 వికెట్లు తీశాడు. ఈ ఏడాదే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. మూడు టెస్టుల్లో 11 వికెట్లు పడగొట్టాడు.

అతడికి పై‘ఎత్తు..’

వచ్చే సిరీస్ లో భారత్ కు 6.2 అడుగుల రాణా నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భారత జట్టు పై ఎత్తు వేసింది. పంజాబ్ కు చెందిన 24 ఏళ్ల పేసర్ గుర్నూర్ బ్రార్ ను పిలిపించింది. గుర్నార్ ఎత్తు 6 అడుగుల 4.5 అంగుళాలు కావడం గమనార్హం. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కు ఆడే గుర్నార్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 5 మ్యాచ్ లు ఆడాడు. ఇప్పుడు బంగ్లా పేసర్ రాణాకు విరుగుడుగా గుర్నార్ ను రంగంలోకి దించింది భారత్. నెట్స్ లో ఇతడు కోహ్లి, రోహిత్, రాహుల్ తదితర మేటి బ్యాట్స్ మెన్ కు బౌలింగ్ చేయనున్నాడు.