అమరావతిలో అతిపెద్ద స్టేడియం.. అహ్మదాబాద్ మోదీ స్టేడియాన్ని మించి
ఇక్కడే ప్రతిష్ఠాత్మక 2023 వన్డే ప్రపంచ కప్ ప్రారంభ, ముగింపు మ్యాచ్ లు జరిగాయి. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే..?
By: Tupaki Desk | 26 March 2025 8:52 AMప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏదంటే కొన్నాళ్ల కిందటి వరకు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ అనో, మెల్ బోర్న్ లోని మైదాన గురించో, లండన్ లోని ఈడెన్ గార్డెన్స్ అనో చెప్పేవారు. కానీ, వీటిని తలదన్నేలా గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లోని మొతేరా మైదానాన్ని ఆధునికీకరించి ప్రపంచంలోనే అతిపెద్దదిగా మార్చారు. ఇక్కడే ప్రతిష్ఠాత్మక 2023 వన్డే ప్రపంచ కప్ ప్రారంభ, ముగింపు మ్యాచ్ లు జరిగాయి. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే..?
తెలుగు రాష్ట్రాల్లో రెండు క్రికెట్ సంఘాలు ఉన్నాయి. తెలంగాణకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ), ఆంధ్రప్రదేశ్ కు ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) అధికారిక సంఘాలు. వీటిలో హెచ్ సీఏకు ఉప్పల్ మైదానం వంటి ఆధునిక స్టేడియం అందుబాటులో ఉంది. ఇది ఐపీఎల్ ఫ్రాచైంజీ సన్ రైజర్స్ హైదరాబాద్ కు సొంత మైదానం. అంతర్జాతీయ మ్యాచ్ లకు వేదిక కూడా.
కాగా, ఏపీలో విశాఖపట్నంలోని స్టేడియంను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సొంత మైదానంగా ఎంచుకుంది. ఏపీలో మాత్రం అంతర్జాతీయ మ్యాచ్ లకు విశాఖ అంత తొందరగా వేదిక కాలేకపోతోంది. ఇక ఏపీ రాజధానిగా ఉన్న అమరావతిలో మాత్రం అంతర్జాతీయ మైదానం లేని లోటు కనిపిస్తోంది.
ఈ లోటును తీర్చేలా అమరావతిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణం కానుంది. దీనికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది అమరావతి క్రీడా రంగంలో చరిత్రాత్మక మైలురాయి కానుంది.
లక్షకు పైగా సీట్లతో..
అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియం 1.10 లక్షల సీట్ల సామర్థ్యంతో ఉంది. దీనిని తలదన్నేలా 1.32 లక్షల సీటింగ్ తో అమరావతిలో భారీ స్టేడియం నిర్మాణానికి రంగం సిద్ధం అవుతోంది. 200 ఎకరాల స్పోర్ట్స్ సిటీలో ఇది నిర్మాణం కానుంది. కాగా, స్టేడియం నిర్మాణం గురించి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ చేసిన ప్రతిపాదనకు ఏపీ సీఎం చంద్రబాబు పూర్తి మద్దతు ఇచ్చారు.
పూర్తయితే ప్రతిష్ఠాత్మకమే..
అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పూర్తయితే మెగా లీగ్ ఐపీఎల్ తో పాటు 2026లో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లకు ఆతిథ్యం దక్కనుంది. అయితే, రవాణా, పార్కింగ్, హోటల్స్, ట్రైనింగ్ అకాడమీలు, రెసిడెన్షియల్ సౌకర్యాలు అంతర్జాతీయ స్థాయిలో ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. కాగా, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి మద్దతు ఉండడం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా ఐసీసీ చైర్మన్ కావడంతో అమరావతి అద్భుత అంతర్జాతీయ స్టేడియం కల సాకారం కానుంది. త్వరలోనే భూమి పూజ జరిపి నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.