చాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ ఇండియాకు ఆస్ట్రేలియాపై కసిదీర్చుకునే చాన్స్!
India Clinches the Championship Trophy with Thrilling Victory Over New Zealand
By: Tupaki Desk | 2 March 2025 10:51 PM IST2023 అక్టోబరు –నవంబరులో సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా జైత్రయాత్ర సాగించింది టీమ్ ఇండియా. ఇంకేం..? మనదే ప్రపంచ కప్ అని అభిమానులు అందరూ భావించారు. 12 ఏళ్ల తర్వాత భారత్ ప్రపంచ చాంపియన్ గా నిలవనుందని కలల్లో తేలిపోయారు. కానీ, ఆస్ట్రేలియా ఆ కలలను కల్లలు చేసింది. అప్రతిహతంగా సాగిన టీమ్ ఇండియా ప్రయాణాన్ని వేదనతో ముగిసేలా చేసింది.
భారత్ లో భారత్ ను ఓడించే సత్తా ఏ జట్టుకూ లేదనే చెప్పాలి. అయితే, ఆస్ట్రేలియా వన్డే ప్రపంచ కప్ లో అత్యంత ప్రణాళికతో ఆడి టీమ్ ఇండియాను ఓడించింది. ఇప్పుడు నాటి పరాజయానికి బదులు తీర్చుకునే అవకాశం లభించింది. అది కూడా వన్డే ఫార్మాట్ లోనే కావడం గమనార్మం.
చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ సమయం వచ్చేసింది. గ్రూప్-ఎ, గ్రూప్-బి లీగ్ దశ ముగిసింది. గ్రూప్-ఎలో టాప్ లో నిలిచిన టీమ్ ఇండియా.. గ్రూప్ –బిలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాను సెమీస్ లో ఢీకొట్టనుంది.
చాంపియన్స్ ట్రోఫీలో మూడు లీగ్ మ్యాచ్ లనూ గెలిచిన టీమ్ ఇండియా టేబుల్ టాపర్ గా నిలిచింది. గ్రూప్-బిలో ఒక మ్యాచ్ గెలిచి, రెండు మ్యాచ్ లు రద్దయి నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.
మంగళవారం భారత్ –ఆస్ట్రేలియా మధ్య చాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీ ఫైనల్ దుబాయ్ లో జరగనుంది.
అటువైపు ఎవరో?
రెండో సెమీస్ లో దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ నెల 5న (బుధవారం) లాహోర్ లో జరుగుతుంది.
భారత్ ఫైనల్ చేరితే ఆ మ్యాచ్ కూడా దుబాయ్ లోనే నిర్వహిస్తారు. ఒకవేళ ఇటు ఆస్ట్రేలియా, అటు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల్లో ఏ జట్లు ఫైనల్ చేరినా మ్యాచ్ ను లాహోర్ లోనే నిర్వహిస్తారు.
కొసమెరుపు: భద్రతా కారణాల రీత్యా టీమ్ ఇండియా పాకిస్థాన్ కు వెళ్లేందుకు నిరాకరించడంతో మ్యాచ్ లన్నీ దుబాయ్ లో నిర్వహిస్తున్నారు. భారత్ తో సెమీ ఫైనల్ కోసం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా రెండూ పాకిస్థాన్ నుంచి దుబాయ్ కు వచ్చాయి. ఏ జట్టుతో తలపడాల్సి ఉంటుందో తెలియని పరిస్థితే దీనికి కారణం. ఇప్పుడు దక్షిణాఫ్రికా జట్టు తిరిగి లాహోర్ వెళ్లాల్సి ఉంటుంది.