Begin typing your search above and press return to search.

2007, 2011 ఫ్లాష్ బ్యాక్... భారత్ సెమీస్ ప్రత్యర్థిపై ఆసక్తికర చర్చ!

అయితే... భారత్ సెమీస్ ప్రత్యర్థిపై ఈ రోజు మ్యాచ్ ఫలితం తర్వాత క్లారిటీ రానుంది.

By:  Tupaki Desk   |   2 March 2025 1:53 PM IST
2007, 2011 ఫ్లాష్  బ్యాక్... భారత్  సెమీస్  ప్రత్యర్థిపై ఆసక్తికర చర్చ!
X

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇవాళ గ్రూప్ - ఏ లో టాప్ ప్లేస్ లో ఉన్న భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇది లీగ్ స్టేజ్ లో చివరి మ్యాచ్. అనంతరం మంగళవారం నుంచి సెమీఫైనల్ మ్యాచ్ లు ప్రారంభమవుతాయి. అయితే... భారత్ సెమీస్ ప్రత్యర్థిపై ఈ రోజు మ్యాచ్ ఫలితం తర్వాత క్లారిటీ రానుంది. ఈ సమయంలో ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది.

అవును... ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్ మ్యాచ్ లు మంగళవారం నుంచి ప్రారంభమవుతాయి. ఈ సమయంలో గ్రూప్ - బీలో టాప్ ప్లేస్ లో ఉన్న దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లతో గ్రూప్ - ఏ లోని భారత్, న్యూజిలాండ్ జట్లు ఎవరు ఎవరితో తలపడనున్నారనే విషయంపై ఈ రోజు మ్యాచ్ అనంతరం క్లారిటీ రానుంది.

ఈ రోజు మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే సెమీస్ లో ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంటుంది. ఒకవేళ న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైతే మాత్రం దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్ ఆడాల్సి వస్తుంది. ఈ సమయంలో భారత్ సెమీస్ ప్రత్యర్థిపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఇందులో భాగంగా... భారత్ సెమీస్ ప్రత్యర్థి ఆస్ట్రేలియా అయితేనే బెటర్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సందర్భంగా ఓ సారి గతం గుర్తుచేసుకుంటున్నారు క్రికెట్ అభిమానులు. ఇందులో భాగంగా.. 2007 టీ20 వరల్డ్ కప్ సెమీస్, 2011 వన్డే వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ల ఫలితాలను తెరపైకి తెస్తున్నారు. 2007 టీ20 వరల్డ్ కప్ లో భాగంగా డర్బన్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ గెలిచింది.

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ (70), ధోనీ (36), ఊతప్ప (34) రాణించారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆసిస్ 7 వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది. బౌలింగ్ విభాగంలో... శ్రీశాంత్, ఇర్ఫాన్ పఠాన్, జోగిందర్ శర్మ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు.

ఇక 2011 వన్డే వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే... ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. జహీర్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, యువరాజ్ సింగ్ లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి, తలో రెండేసి వికెట్లు తీసుకున్నారు.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ 47.4 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి టార్గెట్ పూర్తి చేసింది. యువరాజ్ సింగ్ (57), సచిన్ (53), గౌతం గంభీర్ (50) రాణించగా.. చివర్లో సురేష్ రైనా (34*) భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. ఈ రెండు సందర్భాలను టీమిండియా అభిమానులు, పరిశీలకులు గుర్తు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే... ఇవాల్టి మ్యాచ్ లో న్యూజిలాండ్ పై గెలిచి, సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియాతో తలబడాలని అంటున్నారు. అలాకాకుండా.. ఒకవేళ కివీస్ చేతిలో ఓడిపోయి, సెమీస్ లో సౌతాఫ్రికాపై గెలిచి.. మరోపక్క కివీస్ పై ఆస్ట్రేలియా గెలిచి.. ఫైనల్ లో భారత్ - ఆస్ట్రేలియా తలపడాల్సి వస్తే అది కాస్త ఇబ్బందితో కూడుకున్న వ్యవహారమని చెబుతున్నారు.

ఈ సందర్భంగా... 2023 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను గుర్తు చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు ఒత్తిడివల్లో ఏమో కానీ.. కాస్త తడబడింది! నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులు మాత్రమే చేయగలిగింది! కేఎల్ రాహుల్ (66), విరాట్ కొహ్లీ (54), రోహిత్ శర్మ (47) మాత్రమే రాణించారు.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆసిస్ 43 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఆసిస్ బ్యాటర్స్ లో ట్రావిస్ హెడ్ (137) వన్ మ్యాన్ షో చేయగా.. మార్నస్ (58*) పని పూర్తి చేశాడు. ఈ నేపథ్యంలో... ఆసిస్ ను ఫైనల్ వరకూ తెచ్చుకోకుండా.. ఈ రోజు కివీస్ పై గెలిచి, సెమీస్ లో ఆసిస్ తో తలబడి వారిని ఇంటికి పంపాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.