Begin typing your search above and press return to search.

25 వేల టికెట్లు.. లక్షన్నర మంది పోటీ.. అదీ భారత్-పాక్ మ్యాచ్ అంటే

అమెరికా నుంచి శ్రీలంక వరకు ప్రపంచంలో ఏ మూలన భారత్-పాక్ మ్యాచ్ జరిగినా టిక్కెట్లు క్షణాల్లో తెగుతాయి..

By:  Tupaki Desk   |   4 Feb 2025 9:30 PM GMT
25 వేల టికెట్లు.. లక్షన్నర మంది పోటీ.. అదీ భారత్-పాక్ మ్యాచ్ అంటే
X

అమెరికా నుంచి శ్రీలంక వరకు ప్రపంచంలో ఏ మూలన భారత్-పాక్ మ్యాచ్ జరిగినా టిక్కెట్లు క్షణాల్లో తెగుతాయి..

నరాలు తెగే ఉత్కంఠ.. చివరి క్షణం వరకు పోటాపోటీ.. మ్యాచ్ కు ముందే టెన్షన్ టెన్షన్.. ఇదీ దాయాదుల సమరం అంటే అన్నట్లుంటుంది..

ఇప్పుడు ప్రతిష్ఠాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఈ టోర్నీ అసలు ఆతిథ్యం దేశం పాకిస్థానే కావడం గమనార్హం. కానీ, అక్కడ పర్యటించేందుకు టీమ్ ఇండియాను పంపేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీంతో అసలు టోర్నీ జరుగుద్దా..? లేక భారత మ్యాచ్ లను వేరే చోటకు తరలిస్తారా? అనే మీమాంస నెలకొంది. ఎట్టకేలకు వాటికి తెరపడింది.

ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. అంటే మరో 15 రోజులే. భారత్ ఆడే మ్యాచ్ లు మాత్రం దుబాయ్ లో జరగనున్నాయి. ఇప్పటికే అన్ని దేశాలు జట్లను ప్రకటించాయి. ఈ నెల 11 వరకు వీటిలో మార్పులు చేసుకోవచ్చు. ఆసక్తికరం ఏమంటే.. భారత్ ఉన్న గ్రూప్ లోనే పాకిస్థాన్ కూడా ఉండడం. ఇక భారత్ తన తొలి మ్యాచ్ లో ఈ నెల 20 బంగ్లాదేశ్‌, 23న పాకిస్థాన్‌, మార్చి 2న న్యూజిలాండ్‌ తో ఆడుతుంది.

వీటిలో ఏ రెండు మ్యాచ్ లలో గెలిచినా భారత్ సెమీఫైనల్ చేరుతుంది. అప్పుడు సెమీస్ కూడా దుబాయ్ లోనే జరుగుతుంది. కాగా, భారత్ మ్యాచ్‌ ల టికెట్లను సోమవారం ఆన్‌ లైన్‌ లో ఉంచారు. సాధారణ స్టాండ్ టికెట్ల ప్రారంభ ధర 125 యూఏఈ దిర్హమ్‌లు (సుమారు రూ.2,965)గా నిర్ణయించారు. భారత మ్యాచ్‌ ల టికెట్లన్నీ హాట్‌ కేకుల్లా నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి.

భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ కు దుబాయ్‌ స్పోర్ట్స్‌ సిటీ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. దీని సామర్థ్యం 25 వేల సీట్లు. కానీ, ఆన్‌ లైన్‌ లో సుమారు 1,50,000 మంది పోటీపడ్డారట.

కొసమెరుపు: చాంపియన్స్ ట్రోఫీ చివరిసారిగా 2017లో జరిగింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు వన్డే ఫార్మాట్ లోనే జరగనుంది. 2017లో ఫైనల్లో భారత్-పాక్ తలపడ్డాయి. రోహిత్, కోహ్లి వంటి వారిని త్వరగా ఔట్ చేసిన పాక్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది.