Begin typing your search above and press return to search.

న్యూజిలాండ్ తో మూడో టెస్టు.. మళ్లీ మూడు మార్పులు.. ఇదేం తీరు?

ఇప్పటికే రెండు టెస్టులో మూడు మార్పులు చేసిన టీమ్ మేనేజ్ మెంట్ మరోసారి మూడు మార్పులతో దిగుతుండడం గమనార్హం.

By:  Tupaki Desk   |   28 Oct 2024 7:37 AM GMT
న్యూజిలాండ్ తో మూడో టెస్టు.. మళ్లీ మూడు మార్పులు.. ఇదేం తీరు?
X

చరిత్రలో తొలిసారి టెస్టు మ్యాచ్ లో స్వదేశంలో కేవలం 46 పరుగులకే ఆలౌటైన దారుణ రికార్డు.. చరిత్రలో తొలిసారి న్యూజిలాండ్ తో స్వదేశంలో టెస్టు సిరీస్ ను కోల్పోయిన టీమ్ ఇండియా అత్యంత చెత్త రికార్డు.. ఈ రెండూ ఒకే సిరీస్ లో మూటగట్టుకుంది టీమ్ ఇండియా. స్టార్ బ్యాట్స్ మెన్ ఫామ్ లో లేరు.. పేస్ బౌలర్లు వికెట్ల తీసే పిచ్ లు కావు.. స్పిన్నర్లేమో తేలిపోతున్నారు.. మూడు టెస్టుల సిరీస్ లో ఇప్పటికే 0-2తో వెనుకబడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మూడో టెస్టు జరగనుంది. ఇందులోనైనా గెలుస్తుందా? అనే అనుమానాలు ఉండగా.. ఏకంగా మూడు మార్పులతో బరిలో దిగుతోంది. ఇప్పటికే రెండు టెస్టులో మూడు మార్పులు చేసిన టీమ్ మేనేజ్ మెంట్ మరోసారి మూడు మార్పులతో దిగుతుండడం గమనార్హం.

తేడా వస్తే క్లీన్ స్వీపే..

ఇప్పటివరకు విదేశాల్లో భారత జట్టు క్లీన్ స్వీప్ కావడం చూశాం. మన దేశానికి వచ్చిన పెద్ద జట్లు క్లీన్ స్వీప్ కావడం చూశాం.. కానీ, ఇప్పుడు మన జట్టే.. స్వదేశంలో క్లీన్ స్వీప్ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. కచ్చితంగా జరుగుతుందని చెప్పలేం కానీ.. రోహిత్ శర్మ టీమ్ ఫామ్ చూస్తే ఇదే అనుమానం వస్తోంది. నవంబరు 1 నుంచి ముంబై వాంఖడే మైదానంలో మూడో టెస్టు జరగనుంది. పుణెలో భారత్ బ్యాట్స్ మెన్ న్యూజిలాండ్ స్పిన్ కు తలొంచారు. ముంబై పిచ్ కూడా స్పిన్ పిచ్ అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. అయినా, సరే మూడు మార్పులతో బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది.

ఆస్ట్రేలియా తో సిరీస్ కోసం..

వచ్చే నెల 22 నుంచి ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియాలో టీమ్ ఇండియా ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. మరోవైపు ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కు చేరాలంటే న్యూజిలాండ్ తో చివరి టెస్టులో నెగ్గడం, ఆస్ట్రేలియాలో సాధ్యమైనంత తక్కువ నష్టంతో బయటపడడం కీలకం. దీంతో న్యూజిలాండ్ తో మూడో టెస్టుకు పలువురు ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోందట. ఇప్పటికే రెండో టెస్టులో బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్, చైనామన్ స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్, హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌ స్థానాల్లో వన్ డౌన్ బ్యాటర్ శుబ్ మన్ గిల్, ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, పేసర్ ఆకాశ్‌ దీప్ లను తీసుకున్నారు.

మూడో టెస్టులో జట్టులోకి వీరే..

బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో ప్రభావం చూపించని సిరాజ్‌ ను పుణె టెస్టుకు పక్కనపెట్టారు. అయితే, మూడో టెస్టుకు అతడిని తీసుకుని స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతి ఇస్తారని సమాచారం. దీంతో ఆకాశ్ తో కలిసి సిరాజ్‌ బౌలింగ్‌ దాడిని ప్రారంభిస్తాడు. ఇక బెంగళూరులో గాయపడిన వికెట్ కీపర్ బ్యాట్స్ మన రిషబ్ పంత్ రెండో టెస్టుకు కోలుకుని జట్టులోకి వచ్చాడు. పెద్దగా రాణించలేదు. అతడిపై భారం పడకుండా ముంబై టెస్టుకు పక్కనపెట్టే చాన్సుంది. యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌ ను తీసుకుంటారని చెబుతున్నారు. సీనియర్ స్పిన్నర్ జడేజా స్థానంలో అక్షర్‌ పటేల్‌ ను ఆడిస్తారని ఊహిస్తున్నారు.

మార్పు మంచికేనా..? ముంచేస్తుందా?

జట్టులో మార్పులనేవి సహజం. కానీ.. ఒకేసారి మూడు మార్పులతో దిగడం కాస్త ఇబ్బందికరమే అని చెప్పాలి. రెండో టెస్టులో మూడు మార్పులతో ఆడినా భారత్ కు ఓటమి తప్పలేదు. తొలి టెస్టు కంటే రెండో టెస్టులోనే ఘోరంగా ఓడింది. మరిప్పుడు క్లీన్ స్వీప్ ప్రమాదం పొంచి ఉండగా.. మూడో టెస్టుకు మళ్లీ మూడు మార్పులతో దిగడం అంటే కాస్త సాహసమే అని చెప్పాలి.