ఒక బ్యాట్స్ మన్..ఒక బౌలర్..చుట్టూ 10 మంది ఫీల్డర్లు..పిక్ ఆఫ్ ది డే
చివరకు 155 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో టీ బ్రేక్ వరకు భారత్ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయింది. దీంతో మ్యాచ్ డ్రా కావడం ఖాయం అనుకున్నారు.
By: Tupaki Desk | 30 Dec 2024 12:16 PM GMTఎవరన్నారు..? టెస్టు క్రికెట్ కు కాలం చెల్లిందని..? ఎవరన్నారు..? టెస్టు క్రికెట్ లో టి20ల స్థాయి మజా ఉండదని..? ఎవరన్నారు.. టెస్టు క్రికెట్ లో మ్యాచ్ లు ఏకపక్షంగా జరుగుతున్నాయని? బోర్డర్ గావస్కర్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ నాలుగు టెస్టుల్లో తలపడగా మూడు మ్యాచ్ లలో ఫలితం వచ్చింది. ఒక్కదాంట్లోనే (మూడో టెస్టు) ఫలితం డ్రాగా తేలింది. అయితే, అది కూడా వర్షం కారణంగానే.
పోరాడి డ్రా అనుకుంటే..
ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టు అంటే మామూలు మాటలు కాదు. ఈ అవకాశం ఏటా ఒక జట్టుకు వస్తుంది. ఇప్పుడు భారత జట్టుకు దక్కింది. డిసెంబరు 26న మొదలైన ఈ టెస్టుకు సోమవారం చివరి రోజు. 80 వేలమందిపైగా ప్రేక్షకులు హాజరయ్యారు. దీంతో ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్ మజా అంటే ఏమిటో మరోసారి తెలిసింది. కాగా, ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా 340 పరుగుల టార్గెట్ తో బరిలో దిగింది. చివరకు 155 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో టీ బ్రేక్ వరకు భారత్ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయింది. దీంతో మ్యాచ్ డ్రా కావడం ఖాయం అనుకున్నారు.
ఆ షాట్ మలుపు తిప్పింది.
టీ బ్రేక్ తర్వాత భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కొట్టిన షాట్ మ్యాచ్ లో భారత్ ఓడిపోయేలా చేసింది. అప్పటికి బౌలింగ్ చేసి చేసి అలసిపోయిన ఆస్ట్రేలియా బౌలర్లు.. ఇక మ్యాచ్ లో గెలుపుపై ఆశలు వదిలేసుకున్నారు. దీంతో పార్ట్ టైమ్ బౌలర్ ట్రావిస్ హెడ్ ను బరిలో దించారు. అతడి బౌలింగ్ లో లాంగాన్ లోకి పంత్ కొట్టిన షాట్ ను మిచెల్ మార్ష్ ఒడిసిపట్టాడు. ఆ తర్వాత ఆల్ రౌండర్ జడేజా, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి, ఓపెనర్ యశస్వి జైశ్వాల్ వికెట్లు ఒకదానివెంట ఒకటి పడిపోయాయి.
సుందర్ చుట్టూ వలయం
కాస్తో కూస్తో బ్యాటింగ్ చేయగల పేసర్ ఆకాశ్ దీప్ కూడా ఔట్ కావడంతో మ్యాచ్ లో భారత్ కు ఓటమి తప్పదని అర్థమైంది. స్టార పేసర్ బుమ్రా ఔట్ తో మరింత స్పష్టమైంది. కానీ, ఒక్కడే కాస్త ఆశలు రేపాడు. అతడే యువ స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్.
తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేసిన సుందర్ రెండో ఇన్నింగ్స్ లోనూ ఆసీస్ కు కొరుకుడు పడలేదు. అతడు బంతులు కరిగిస్తుండడంతో కంగారూ బౌలర్లలో కంగారు పుట్టింది. దీంతో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ వ్యూహం పన్నాడు. మొత్తం 9 మంది ఫీల్డర్లను సుందర్ చుట్టూ మోహరించాడు. అయినా 25 ఏళ్ల సుందర్ బెదరలేదు. కాకపోతే మరో ఎండ్ లో హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఎల్బీ కావడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది.
45 బంతులు ఆడిన సుందర్.. స్టార్ బ్యాటర్లు కోహ్లి, రోహిత్ కంటే ఎక్కువ సేపు క్రీజులో నిలిచాడు. అంతేకాక ఓ దశలో అతడు డ్రా చేసేలా కనిపించాడు. అందుకే కమ్మిన్స్ అతడి చుట్టూ ఫీల్డర్లను పెట్టాడు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.