మరోసారి మజిల్స్ చూపించిన సంజూ... సృష్టించిన రికార్డులు ఇవే!
బంగ్లాతో జరిగిన టీ20లో 47 బంతుల్లో 111 పరుగులు చేసిన తర్వాత.. వరుసగా సంజూకి ఇది రెండో సెంచరీ.
By: Tupaki Desk | 9 Nov 2024 3:50 AM GMTచాలాకాలం తర్వాత సంజూ శాంసన్ తనదైన శైలిలో, తన స్థాయికి తగ్గట్లు, తనపై పెట్టుకున్న ఆశలకు తగ్గట్టుగా ఆడుతున్నాడు. గత టీ20 మ్యాచ్ లో హైదరబాద్ లో బంగ్లాదేశ్ బౌలర్లపై విరుచుకుపడి, మెరుపు శతకం సాధించిన సంజూ... ఈసారి సౌతాఫ్రికా బౌలర్లను ఊచకోత కోశాడు. ఫలితంగా... నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టీ20 పోరులో భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
అవును... సంజూ శాంసన్ చెలరేగి ఆడుతున్నాడు. స్వదేశీ పిచ్, విదేశీ పిచ్ అనే తారతమ్యాలు.. బంగ్లా స్పినర్లు, సఫారీ సీమర్లు అనే బేధాలు ఏమీ చూపించకుండా మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు. ఈ సమయంలో పలు రికార్డులు సృష్టించాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో వన్ మ్యాన్ షో చేశాడు. 50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్ లతో 107 పరుగుల మెరుపు శతకం సాధించాడు.
ఇలా డర్బన్ లో సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టీ20లో అద్భుతమైన సెంచరీని కొట్టి.. భారత్ తరుపున బ్యాక్ టు బ్యాక్ టీ20 ఇంటర్నేషనల్ సెంచరీలు కొట్టిన మొట్టమొదటి క్రికెటర్ గా సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్), రిలీ రోసోవ్ (సౌతాఫ్రికా), ఫుస్తావ్ మెక్ కీన్ (ఫ్రాన్స్) లు ఉండేవారు. ఈ జాబితాలో 4వ ఆటగాడిగా సంజూ చేరాడు.
బంగ్లాతో జరిగిన టీ20లో 47 బంతుల్లో 111 పరుగులు చేసిన తర్వాత.. వరుసగా సంజూకి ఇది రెండో సెంచరీ. ఇదే సమయంలో టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ లో దక్షిణాఫ్రికాపై ఓ భారతీయుడు చేసిన ఫాస్టెస్ట్ సెంచరీ కూడా ఇదే కావడం గమనార్హం.
ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే... టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన జట్టు భారీ స్కొరు (202/8) చేయడంలో సంజూదే కీలక పాత్ర. సఫారీ బౌలర్ను ఊచకోత కోస్తూ శాంసన్ చెలరేగిపోయాడు.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చక్కని టైమింగ్ తో, బలమైన షాట్లతో మైదానం నలువైపులా బాదుదే బాదుడు అన్నట్లుగా సాగింది శాంసన్ స్వైర విహారం!
ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది టీమిండియా. అనంతర ఛేజింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా బ్యాటర్స్ ని భారత్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి (3/25), రవి బిష్ణోయ్ (3/28), ఆవేశ్ ఖాన్ (2/28), అర్ష్ దీప్ (1/25) సమిష్టిగా అడ్డుకున్నారు. దీంతో 17.5 ఓవర్లలో 141 పరుగులకే సఫారీ టీం ఆలౌటైంది. ఈ విజయంతో భారత్ 1-0 ఆధిక్యం సంపాదించింది.