Begin typing your search above and press return to search.

దీపావళి తర్వాత మూడో రోజు రాత్రి వేళ పటాసులు కాల్చుడా?

అవును.. దీపావళి తర్వాత మూడు రోజులకు భారతీయులు మరోసారి దీపావళి పండుగ జరుపుకున్న అరుదైన సందర్భం ఇదేనని చెప్పాలి

By:  Tupaki Desk   |   16 Nov 2023 4:07 AM GMT
దీపావళి తర్వాత మూడో రోజు రాత్రి వేళ పటాసులు కాల్చుడా?
X

అవును.. దీపావళి తర్వాత మూడు రోజులకు భారతీయులు మరోసారి దీపావళి పండుగ జరుపుకున్న అరుదైన సందర్భం ఇదేనని చెప్పాలి. ఆదివారం దేశ వ్యాప్తంగా దీపావళి పండుగను జరుపుకున్నాం. మూడురోజుల తర్వాత బుధవారం రాత్రి పది గంటలు దాటిన తర్వాత ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చి టపాసులు కాల్చటం.. భారీ వాలాల్ని కాల్చి తమ సంతోషాన్ని ప్రదర్శించిన వైనం అందరిని ఆకర్షిస్తోంది. కారణం.. ప్రపంచకప్ టోర్నీలో కివీస్ ను సెమీస్ లో ఓడించి.. అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవటమేనని చెప్పాలి.

బ్యాట్ తో విరాట్ కోహ్లీ.. శ్రేయస్ అయ్యర్.. రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్సీకి షమీ తోడు కావటంతో బంతితో మేజిక్ చేసేశాడు. ఒకటి తర్వాత ఒకటి చొప్పున వికెట్లు తీస్తూ.. అందరి మనసుల్ని దోచేసుకున్నాడు. చక్కని ఆటతీరుతో టీమిండియా గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా కివీస్ బ్యాటర్లు చెలరేగిపోతున్న వేళ.. అనూహ్యంగా బంతితో ఎంట్రీ ఇచ్చేసి.. కిమీస్ బ్యాటర్లకు దిమ్మ తిరిగే షాకిచ్చాడు. ఓవర్ తీసుకున్న ప్రతి సందర్భంలోనూ వికెట్ ను సొంతం చేసుకోవటం తానువేసే చివరి ఓవర్లో రెండు వికెట్లను సాధించి.. మొత్తంగా ఏడు వికెట్లను పడగొట్టటం ద్వారా షమీ మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలవటమే కాదు.. కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు దైవంగా మారాడని చెప్పక తప్పదు.

మ్యాచ్ ను అద్భుతంగా ముగించటం ద్వారా షమీ.. తన సత్తాను చాటారని చెప్పారు. టీమిండియాకు తానెంత బలమన్న విషయాన్ని బంతితో చెప్పిన షమీకి రాత్రికి రాత్రే భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. కివీస్ మీద ఘన విజయాన్ని సాధించి.. నాలుగేళ్ల క్రితం ఎదురైన అవమానాన్ని తిరిగి వారికి ఇచ్చేస్తూ చేసిన వైనం అందరికి మర్చిపోలేని అద్భుత ఫీలింగ్ ను అందించింది. అందుకే.. మ్యాచ్ లోనూ ఘన విజయాన్ని సాధించినంతనే వీధుల్లోకి వచ్చిన క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున టపాసుల్ని కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇదే.. దీపావళి తర్వాత మూడు రోజులకు మళ్లీ దీపావళి వచ్చినట్లుగా ఎక్కడికక్కడ టపాసులు పేల్చి.. వారం వ్యవధిలోనే మరో దీపావళిని తీసుకొచ్చేశారని చెప్పాలి.